ఎమ్బీయస్‌: తెలుగుదేశం కథ ముగిసిందా?

అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన పరాభవంతో, మొన్న బాబుకి అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ ఎంపీల పార్టీ ఫిరాయింపుతో బాబు పని అయిపోయిందని, టీడీపీ ఆయువు తీరిపోయిందని, దాని క్యాడర్‌ కకావికలై పోతుందని కొందరు మాట్లాడుతున్నారు.…

అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన పరాభవంతో, మొన్న బాబుకి అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ ఎంపీల పార్టీ ఫిరాయింపుతో బాబు పని అయిపోయిందని, టీడీపీ ఆయువు తీరిపోయిందని, దాని క్యాడర్‌ కకావికలై పోతుందని కొందరు మాట్లాడుతున్నారు. టీడీపీది ముగిసిన అధ్యాయమని, ఎమ్మెల్యేలు కూడా తమవైపు వచ్చేస్తారనీ, ఇకపై తమ పోరు వైసీపీతోనే అనీ ఆంధ్ర బీజేపీ నాయకులు బడాయికి పోతున్నారు. అది పొరబాటు. అసలు రాజ్యసభ ఎంపీల విషయమై కూడా ఇది బాబు వ్యూహంలో భాగమని, బీజేపీ సొంత ప్రజ్ఞకాదనీ భావించేవారున్నారు.

బాబు ఇన్నాళ్లూ తనపై ఉన్న కేసుల విషయంలో స్టేలు తెచ్చుకుంటూ తను నిప్పునని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. దీర్ఘకాలపు స్టేలు కుదరవని, కేసుల విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు. బీజేపీ ఇది అదనుగా తీసుకుని తనను వేధిస్తుందని భయపడి బాబు ఈ నలుగురిని బీజేపీకి అప్పగించారని, రాజ్యసభలో తమకు మెజారిటీ తక్కువ కాబట్టి బీజేపీ వెంటనే దీనికి సమ్మతించిందని ఒక వాదన. బీజేపీతో చేతులు కలిపితే తప్ప వైసీపీ నిలవరించలేమని టీడీపీ నాయకులనేకులు భావించడం వలన బాబు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని కూడా అంటున్నారు. కొన్నాళ్లు పోతే తప్ప వాస్తవమేమిటో తెలియదు.

ఏది ఏమైనా టీడీపీకి ఇంకా దారి మూసుకుపోలేదు. ప్రజారాజ్యం వంటి పార్టీకైతే మూసేయడానికి ఒక ఎన్నికచాలు కానీ, దశాబ్దాల వయసున్న టీడీపీ వంటి పార్టీ చరిత్ర ఒక ఎన్నికతో ఆగదు. ఉత్థానపతనాలతో ముందుకు సాగుతుంది – కనీసం కొన్నేళ్లపాటు! దాన్ని ఏ దారిన ఎలా నడిపించాలి అన్నది బాబు ఆలోచించవలసిన విషయం. 151 సీట్లతో అప్రతిహతంగా కనబడుతున్న జగన్‌ను చూసి టీడీపీ క్యాడర్‌ ఈరోజు బెంబేలు చెందవచ్చు. 1983లో ఎన్టీయార్‌ మంచి మెజారిటీతో గెలిచాక రాష్ట్రంలో తమ కథ ముగిసినట్లే అనుకుంది కాంగ్రెసు. 1967లో తమిళనాడు పోగొట్టుకున్నాక, మళ్లీ అధికారం కళ్ల చూడలేదు. ఇక్కడా అంతే అనుకుంది. కానీ ఎన్టీయార్‌ తప్పులు చేయడంతో ఆరేళ్లకే ఓడించి దింపేయగలిగింది.

జగన్‌ విషయంలో కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నిజాయితీగా ఉండకపోతే ప్రజలకు, ఉంటే ఎమ్మెల్యేలకు కోపం రావచ్చు. ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేదలకు అసంతృప్తి కలగవచ్చు. బీజేపీ, టీడీపీతో చేతులు కలిపి కేంద్రం నుంచి నిధులు అందకుండా సహాయనిరాకరణ చేయవచ్చు. జగన్‌ స్వయంగా తప్పులు చేయవచ్చు. ముఖ్య అనుచరులను దూరం చేసుకోవచ్చు. ఏదైనా జరగవచ్చు. వాటివలన ప్రయోజనం పొందడానికి టీడీపీకి అనేక అవకాశాలుంటాయి. ఉపయెన్నికలు వస్తాయి, స్థానిక ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఉన్న జగన్‌ వేవ్‌ అప్పుడుండదు. మరో పక్క ప్రజలకు కసి తీరింది కాబట్టి టీడీపీని మళ్లీ శిక్షించరు.

అదృష్టవశాత్తూ ఫిరాయింపులపై జగన్‌ వైఖరి టీడీపీకి కలిసి వచ్చింది. అందువలన కొంతమంది ఎమ్మెల్యేలు అటు వెళదామనుకున్నా వెళ్లలేరు. బీజేపీ వైపు వెళదామనుకుంటే అది స్థానికంగా ఇంకా పుంజుకోలేదు. రాజ్యసభ సభ్యత్వం అంటే ప్రజలతో ప్రత్యక్ష సంపర్కం లేనిది. టీడీపీపై ప్రజాగ్రహం భగ్గుమన్న ఈ తరుణంలో కూడా 39% ఓటు బ్యాంకు ఉంది. పైగా స్థానికంగా కొందరు బలమైన నాయకులుంటారు. నిధుల కొరతలేదు. గతంలో ఉపకారాలు పొందినవారు తప్పకుండా ఆదుకుంటారు. టిక్కెట్లు దొరకని, నామినేటెడ్‌ పదవులు దక్కని వైసీపీ అసంతృప్తులు ఇటువైపు చూస్తారు. అందువలన టీడీపీకి భవిష్యత్తు ఉంది.

అయితే బాబు ధోరణి మారాలి. ఈ మాట ప్రతీ ఓటమి తర్వాత బాబు ఒప్పుకుంటారు. 'నేను మారాను, మీరూ మారాలి' అని అనుచరులకు చెపుతూ ఉంటారు. కానీ ఆయన మారలేదు. ఒకవేళ మారినా, మార్పు కూడా మంచి వైపుకి కాదు. గతంలో కంటె నాసిది. అనేకసార్లు సంయమనం కోల్పోయి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీజేపీతో తెంపుకోవద్దని, కాంగ్రెసుతో జత కూడవద్దని అనేకమంది సహచరులు చెప్పినా వినలేదని ఇప్పుడు తేటతెల్లమౌతోంది. కొంతమంది చెప్పినట్లు మాత్రమే వింటున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాల గురించి సాధారణ కార్యకర్తలు చెప్పిన మాటలు పట్టించుకోలేదని, మొండి వైఖరితో అనేక వర్గాలను దూరం చేసుకున్నారని ఇప్పుడు అనుకూల మీడియాయే విశ్లేషణలు చేస్తోంది.

ఈ ఘోరపరాయజం తర్వాతనైనా బాబు ఈసారి నిజంగా మారాలి. ఎలా? ముందుగా తనను తాను కాబోయే ముఖ్యమంత్రిగా చూసుకోవడం మానేయాలి. కావాలంటే కేంద్రంలో ఒక మంత్రిగా ఊహించుకోవచ్చు. చివరివరకు ముఖ్యమంత్రిగా ఉండాలనే కోరిక బలంగా ఉంటే పార్టీ అధ్యక్ష పదవి వదులుకోవాలి. రెండూ ఆయన వలన కావు. ప్రస్తుతం ఏ ప్రభుత్వ పదవీలేదు కదా అనవచ్చు. పార్టీ పదవేచాలు, రోజంతా బిజీగా ఉండడానికి! జగన్‌ ఐదేళ్లగా, ఆ మాటకొస్తే అంతకంటె ముందు నుంచీ, పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ, తనను తాను వైసీపీ తరఫున ముఖ్యమంత్రిగా ప్రొజెక్టు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాక కూడా అధ్యక్ష పదవి వదలలేదు. ప్రాంతీయ పార్టీలన్నిటికీ, అప్పుడప్పుడు కాంగ్రెసు పార్టీకి పట్టిన జబ్బు ఇది.

వాళ్లకు చెల్లినపుడు బాబుకి ఎందుకు చెల్లదు అనే ప్రశ్న తప్పక వస్తుంది. వాళ్లకు వచ్చినది, ఈయనకు రానిది ఒక విద్య ఉంది. దాని పేరు డెలిగేషన్‌, పనుల అప్పగింత. ఎవరికీ ఏమీ తెలియదని, అన్ని పనులూ తనే స్వయంగా చూసుకోవాలనీ బాబు విశ్వాసం. శంకుస్థాపన ఆహ్వాన పత్రిక డిజైన్‌ నుంచి ఆయన ఖరారు చేయవలసినదే. అదసలు ఆ శాఖ మంత్రి కూడా చూడనక్కరలేదు. పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసరు ఎవరో చూసుకుంటే చాలు. కానీ ఈయన అలా వదలడు. జగన్‌ ఎన్నికల వ్యూహరచనను ప్రశాంత కిశోర్‌కు అప్పగించి, అతను చెప్పినట్లు గుడ్డిగా చేసుకుంటూపోయి గెలిచాడని అంటున్నారు. బాబు ఒకవేళ ప్రశాంత్‌ను నియమించుకున్నా, ఆయన సలహాలు చెవిన పెట్టకుండా ఉల్టా తనే లెక్చర్లిచ్చి చంపేవాడనుకోవచ్చు. ఈ 'వినికిడి దోషం' వలననే బాబు దగ్గర ఇచ్చకాలు పలికేవారు తప్ప నిజాలు చెప్పేవారు లేకుండాపోయారు. ఆయన క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా జరుగుతూ పోయాడు.

అందుకే ఆయన దగ్గర పనులు లేట్‌. పొద్దున్న ఎపాయింట్‌మెంట్‌ ఇస్తే, సాయంత్రానికి కలవగలిగితే గొప్ప. ఆయన రిలాక్స్‌ కాడు, ఎవరినీ కానివ్వడు. సెక్రటేరియట్‌లో పని ముగించుకుని, సాయంత్రం ఏ సాంస్కృతిక కార్యక్రమానికో వెళ్లి మనసారా నవ్వుతున్న బాబును ఎన్నటికీ ఊహించలేము. ఒక పాటో, సినిమానో చూస్తూ ఆహ్లాదకరమైన మూడ్‌లో ఉన్న బాబును ఊహించలేము. చీండ్రించుకున్న ముఖంతో ఏకధాటీగా పనిచేస్తూ పోవడం వలన ఫాటిగ్‌ కలిగి వ్యవహారాలు చెడతాయి. యంత్రంలా పనిచేస్తూ పోతే యాంత్రికతే అలవాటు పడుతుంది తప్ప సృజనాత్మకత లోపిస్తుంది. బాబు నేతృత్వంలోని టీడీపీని ఆ జాడ్యం పట్టి పీడిస్తోంది. వాళ్లు అనే కాదు, బాబు ముఖ్యమంత్రి అయితే అధికారగణం కూడా అలాగే తయారవుతోంది. ఏదో యాక్టివిటీ ఉంటుంది కానీ అంగుళం ముందుకు సాగదు. నిలువీత యీదుతున్నట్లే ఉంటుంది.

అందువలన మొదటగా మనం తీర్మానించవలసినది – పార్టీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి రెండూ నిర్వహించడం బాబు వలన కాదు అని. పార్టీని తన చేతిలో ఉంచుకుని టీడీపీ తరఫు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రజల మెదళ్లలో ఇప్పటి నుంచే పొజిషన్‌ చేయాలి. అది బాబే ఎందుకు కాదు, పార్టీని వేరే వారికి అప్పగించేసి ఆయనే సీఎం అనవచ్చు కదా అన్న సందేహం రావచ్చు. ఎన్టీయార్‌ పార్టీ పెట్టినపుడు ఆయన వయసు మీరినవాడైనా తెరపై యూత్‌ఫుల్‌ కారెక్టర్లతో యూత్‌ను ఆకట్టుకున్నాడు. విద్యావంతులైన యువతరానికి టిక్కెట్లిచ్చి కాంగ్రెసు వృద్ధనాయకత్వానికి ఎదురుగా నిలిపాడు. యువత టీడీపీ వెంట నడిచింది, నిలిచింది.

1983 నాటి టీడీపీ యువనాయకులు ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత వృద్ధనాయకులయ్యారు – చంద్రబాబుతో సహా! బాబు ఆరోగ్యంగా ఉండవచ్చు, మేధస్సు అమోఘంగా పనిచేస్తూ ఉండవచ్చు. శారీరకంగా చురుగ్గా ఉండవచ్చు. కానీ యువతీయువకుల దృష్టిలో ఆయన వయసు మీరినవాడే! తాతే! ఈ ఎన్నికలలో యువత టీడీపీ వైపు మొగ్గలేదని గుర్తించాలి. తెలంగాణలో తెరాసలో వృద్ధనాయకత్వంతో పాటు యువనాయకత్వం కూడా కొట్టవచ్చినట్లు కనబడుతుంది. అవతల కాంగ్రెసు క్యాంపులో వి.హనుమంతరావు లాంటి వృద్ధ జంబూకాలు ఎక్కువగా కనబడతారు. ఆంధ్రలో టీడీపీకి ప్రత్యర్థిగా నిలచిన వైసీపీ నాయకుడు రాజకీయపు లెక్కల ప్రకారం యువకుడు! బాబు తర్వాతి తరం వాడు. అతనికి దీటుగా టీడీపీ 50లకు అటూయిటూగా ఉన్నవాణ్ని నిలబెడితేనే పోటీ రసవత్తరంగా ఉంటుంది.

మరి బాబు మాటేమిటి? 2024 నాటికి ఆయనకి 73 నిండుతాయి. 80 ఏళ్లు దాటినా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవాళ్లున్నారు. కానీ వారు తమ చుట్టూ యువకులను పెట్టుకున్నారు. కరుణానిధి సంగతిచూస్తే తన కొడుకు స్టాలిన్‌ను ఎప్పటినుంచో ప్రొజెక్టు చేస్తూ వచ్చాడు. చెన్నయ్‌ మేయరును చేసి, అతని సామర్థ్యాన్ని ప్రజలకు ప్రదర్శించాడు. పార్టీలో కొన్ని విభాగాలు అతనికి అప్పగించాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకెకు మంచి ఛాన్సు ఉందని, స్టాలిన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే గెలిచి ఉండేదని, కానీ ఎంజీయార్‌లాగే తను కూడా పదవిలో ఉండగానే మరణించాలనే కాంక్షతో కరుణానిధి తననే కాబోయే ముఖ్యమంత్రిగా చూపుకుని భంగపడ్డాడని పరిశీలకులు అన్నారు.

బాబు కూడా తను ముఖ్యమంత్రి పందెంలో లేనని ప్రకటించి, తను మెంటార్‌గా ఉంటూ ప్రతిభ కల యువనాయకత్వాన్ని ఎంపిక చేసి, తర్ఫీదు ఇచ్చి, తీర్చిదిద్దాలి. ఎన్టీయార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాబు ఇది చక్కగా నిర్వహించారు. ఎన్టీయార్‌కు బ్యాక్‌రూమ్‌ బాయ్‌గా బాబు ఉన్నారు కాబట్టి ఆ కాంబినేషన్‌ హిట్టయింది. ఈ రోజు బాబుకి బ్యాక్‌రూమ్‌ బాయ్‌ ఎవరు? ఎవరూ ఉన్నట్లు తోచదు. అన్నీ పనులూ ఆయనే చూసుకోవాలి. అన్నీ చూసుకోలేకనే దెబ్బతింటున్నారు. జగన్‌ పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యాడన్నది నిజం. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా కాస్తోకూస్తో ప్రజల్లో తిరగాలి. పత్రికా సమావేశాల్లో, సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటే సరిపోదు.

ఎన్టీయార్‌ హయాంలో మహోజ్జ్వల దశ చూసిన టీడీపీ తన నేతృత్వంలో పాతాళానికి పోయిందన్న అపఖ్యాతి పోగొట్టుకోవడం బాబుకి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. పార్టీని పటిష్టం చేయాలి. దానిముందు ముఖ్యమంత్రి పదవి గొప్పదికాదని ఆయన గ్రహించాలి. ఉమ్మడి రాష్ట్రానికే 9 ఏళ్లు సీఎంగా ఉన్నాయనకు, ఈ తునకకు రెండోసారి ముఖ్యమంత్రి అయినా కొత్తగా వచ్చి చేరే తురాయి ఏమీలేదు. పోనీ ఒక మహానగరాన్ని కట్టానన్న ఖ్యాతి తెచ్చుకోవాలన్నా, ఈ ఐదేళ్లలో దాని రూపురేఖలు ఎలా మారతాయో తెలియదు. ఐదేళ్ల తర్వాత ఈయన వచ్చి మళ్లీ డిజైన్లు గీయించినా ప్రజలు స్కెప్టికల్‌గా ఓ చూపు పడేసి, చూసి సరేలే అంటారు తప్ప ఎక్సయిట్‌ అయిపోయి, విరాళాలు గుమ్మరించరు.

అందువలన బాబు ప్రభుత్వ పదవి మీద ఆశ వదులుకుని పార్టీని పటిష్టం చేయడం మీదనే దృష్టిపెట్టాలి. పార్టీకి ఆయనే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగమనండి. రాష్ట్రానికి ఒక్కో అధ్యక్షుడి చొప్పున నియమించుకుంటూ పోయినా, మధ్యమధ్యలో మార్చినా, వాళ్లంతా ఆటలో అరటిపండులనే సంగతి అందరికీ తెలుసు. తమ రాష్ట్రాలకు సంబంధించిన ఏ సొంత నిర్ణయమూ తీసుకోలేరు. బాబు మాటిమాటికీ చెపుతూ ఉంటారు – ఏ విషయం మీదనైనా సరే, నా మాటే ఫైనల్‌. నేను తప్ప వేరే ఎవరు చెప్పినా పట్టించుకోవద్దు – అని. ఇక వాళ్లని ఎవరు పట్టించుకుంటారు?

అందువలన బాబు పార్టీని తన అధీనంలోనే ఉంచుకుని (మరొకరికి అప్పగిస్తే వాళ్లు ఏకు మేకై ఈయన్నే పార్టీ నుంచి బహిష్కరించగలరు. అలాంటి ఉదంతాలూ చూశాం) తన బదులు మరో యువనాయకుణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంచుకుని, అతనికి చుట్టూ థింక్‌టాంక్‌, కార్యదక్షులైన ఒక మంచి టీము తయారుచేసి ఇవ్వాలి. వాళ్లు వైసీపీని ఎదిరించే దళంగా మారతారు. ఒక్కొక్కళ్లూ ఒక్కో అంశంపై ఫోకస్‌ చేస్తూ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపి జగన్‌పై మోజు తగ్గేట్లా చేస్తారు. కష్టపడితే ఏదో ఒక మేరకు విజయం సాధించకపోరు.

మరి ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? వెంటనే స్ఫురించే పేరు లోకేశ్‌. ప్రాంతీయ పార్టీలన్నీ పుత్రరత్నాలకే గద్దె అప్పచెపుతున్నాయి కాబట్టి. లోకేశ్‌ కాకుండా వేరే ఎవరి పేరు చెప్పినా పార్టీలో ఏదో ఒక స్థాయిలో లుకలుకలు ప్రారంభమవుతాయి. లోకేశ్‌ అంటే పార్టీలో ఎవరూ కిమ్మనరు. కానీ ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? ఉన్నదున్నట్లు చెప్పుకోవాలంటే ప్రజల దృష్టిలో లోకేశ్‌ పుత్రుడే కానీ ఇంకా రత్నంగా మారలేదు. మఱ్ఱి చెట్టు నీడలో వేరే ఏ మొక్కా మొలవదని సామెత. బాబు వంటి ప్రతిభావంతుడు తండ్రిగా ఉంటే ఎవరికైనా ఈ ఇబ్బంది ఉంటుంది. బొమ్మరిల్లు తండ్రిలా అన్నీ వారే చక్కబెట్టేస్తూ ఉంటారు. ఆ నీడలోంచి బయటకు వచ్చినపుడే లోకేశ్‌ సొంత ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

బాబు ఓసారి మాట్లాడుతూ 'వైయస్‌ తన కొడుకుని రౌడీలా (ఈ పదం కాకపోతే, ఇలాంటి పదం మరొకటేదో) పెంచాడు. నేను మా అబ్బాయిని పద్ధతిగా పెంచాను. వాడు లక్షణంగా అమెరికన్‌ యూనివర్శిటీలలో ఉన్నతంగా చదువుకుని వచ్చాడు' అని చెప్పుకున్నారు. లోకేశ్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబిఏ, కార్నిజీ మెలాన్‌ యూనివర్శిటీ నుంచి ఎంఐఎస్‌లో బీయస్సీ చేశారట. అక్కడ నేర్చుకున్న నైపుణ్యాన్ని ఏ వ్యాపారరంగంలోనో, బోధనా రంగంలోనో ప్రయోగించి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ, ప్రజాజీవితంలో జగన్‌తో సరి తూగలేకపోయారు. ఆంధ్ర ప్రజలు ఆ 'రౌడీ'ని 151 సీట్ల మెజారిటీతో ముఖ్యమంత్రిని చేస్తూ, అదే చేత్తో లోకేశ్‌ను ఎమ్మెల్యేగా కూడా పనికిరావని తేల్చారు.

2013లోనే పార్టీలో చేరిన లోకేశ్‌ ఎదుర్కున్న తొలి ఎన్నిక అది. అంతకుముందు పక్కదారిలో ఎమ్మెల్సీ అయి, మంత్రి అయ్యారు. పార్టీకి జనరల్‌ సెక్రటరీగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉన్నారు. ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పుకున్న రాజధాని ప్రాంతంలో నిలబడ్డారు. అయినా ఓడిపోయారు. ఒకవేళ బాబు లోకేశ్‌నే ముఖ్యమంత్రి చేద్దామనుకుంటే అతన్ని బాగా సానబట్టాలి. బాబు అనేకమందిని చక్కటి నాయకులుగా మార్చారు. గట్టిగా పూనుకుంటే లోకేశ్‌ను మార్చవచ్చు. లోకేశ్‌ తల్లీ తండ్రీ ఇద్దరూ తెలివైనవారే. భార్యకూడా..! ముగ్గురూ రోజూ కాస్త కాస్త టైము కేటాయిస్తే, లోకేశ్‌ను సానబట్టడం పెద్ద పనేంకాదు. బద్ధకం వదుల్చుకుంటే, యాటిట్యూడ్‌ మార్చుకుంటే అతనూ రాణించవచ్చు.

అతని ప్రధాన లోపం కమ్యూనికేషన్‌. ఓ ఆర్నెల్లపాటు తెలుగు, ఇంగ్లీషులో వక్తృత్వ క్లాసులకు వెళ్లాలి. ట్విటర్‌లో ఘోస్ట్‌ రైటర్స్‌ ఉన్నారేమోనన్న అనుమానం రాకుండా కౌన్సిల్‌ మెంబర్‌గా ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతూ ప్రసంగాలు చేయాలి. తర్వాత కేటీయార్‌లాగ జాతీయ ఛానెళ్లలో ఇంగ్లీషులో డిబెట్స్‌లో పాల్గొనాలి. పార్టీ అధికార ప్రతినిథిగా మారి, తరచుగా ప్రెస్‌మీట్స్‌ పెడుతూ జర్నలిస్టులు వేసే ఇబ్బందికరమైన ప్రశ్నలకు చెణుకులతో సమాధానం చెప్పాలి.

నిజానికి బాబు కూడా వక్త కాదు. ఎంతసేపు మాట్లాడాలో తెలియదు. మాట్లాడేటప్పుడు మొహం ప్రసన్నంగా ఉండదు. లోకేశ్‌ తనలో ఈ లోపాలు లేకుండా చూసుకోవాలి. అంతేకాదు, వీలైతే శారీరకంగా మంచి షేప్‌లో ఉండాలి. బాబు ఎప్పుడు చూసినా చువ్వలా చురుగ్గా ఉంటారు. ఇతను లెయిడ్‌-బ్యాక్‌ అన్నట్లు తోస్తాడు. పల్లెటూళ్లల్లో 'దత్తుడుబాబు' అనే కారెక్టర్లు ఉంటూంటారు – సునీల్‌ కొన్ని సినిమాల్లో అలాంటి పాత్రలు వేశాడు. ఇతన్ని చూస్తే నాకు వాళ్లు గుర్తుకువస్తారు. తన ఒళ్లు తగ్గడం గురించి లోకేశ్‌ ఒకసారి మాట్లాడుతూ 'నాకు మా తాతగారు ఎన్టీయార్‌ పోలిక వచ్చింది. ఆయనలాగే నేనూ భోజన ప్రియుణ్ని' అన్నాడు.

ఎన్టీయార్‌ భోజన ప్రియుడు మాత్రమేకాదు, తెల్లవారు ఝామున రెండు గంటలకు లేచి, కసరత్తు, యోగా చేసి ఆ తిండి అరక్కొట్టేవాడు. ఇతను అది గుర్తు పెట్టుకోవాలి. శారీరకంగా స్మార్ట్‌గా కనిపిస్తేనే, మెంటల్‌గా కూడా స్మార్ట్‌ అనే భావన కలుగుతుంది. 36 ఏళ్లకే అంత స్థూలకాయం శోభ నివ్వదు. జగన్‌ గెలుపులో అతని స్టామినా కూడా దోహదపడిందని గ్రహించాలి. వేల కిలోమీటర్లు నడవడం మాటలు కాదు. అతని కంటె 11 ఏళ్లు చిన్న అయిన తనకూ ఎంతోకొంత స్టామినా ఉందని లోకేశ్‌ లోకానికి చూపుకోవాలి.

ఒకవేళ ఏడాది లోపున లోకేశ్‌ ఆశించిన మేరకు రూపుదిద్దుకోకపోతే, బాబు అప్పుడు ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని తయారు చేసుకోవాలి. అతను కమ్మకులానికి చెందిన వ్యక్తి కాకుండా ఉంటే పార్టీకి మంచిది. ఎందుకంటే ఇటీవలి కాలంలో పార్టీపై పూర్తిగా కమ్మ ముద్ర పడిపోయి, ఇతర కులాలన్నీ దూరమయ్యాయి. పగ్గాలన్నీ కమ్మ నాయకత్వంలో ఉంటే ఉండవచ్చు కానీ బయటకు చూపడానికైనా ఏ బీసీయో ఉండడం రాజకీయంగా లాభదాయకం. బాబు గట్టిగా పూనుకుని ఈ దిశగా ఆలోచించాలే కానీ వీటికన్నా మరిన్ని అద్భుతమైన ఆలోచనలు తడతాయి. ఆయన పైపై మార్పులతో సరిపెట్టకుండా సమూలమైన మార్పులు చేపడితే టీడీపీ అభిమానుల్లో, క్యాడర్‌లో ఆశలు నిలబడతాయి. వాళ్లలో ఏ చిన్న అనుమాన భూతం మెదలినా దాన్ని ఇంతకింత చేసి బ్రహ్మరాక్షసిగా తయారు చేయడానికి, తమవైపు గుంజుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని గ్రహించాలి.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2019)
[email protected]