తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఆమెపై మీడియా, సోషల్ మీడియాలో ఎవరూ విమర్శలు చేయవద్దని సివిల్ కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆమెపై ఆరోపణలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడినట్టే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర వుందంటూ ప్రధానంగా కవితపై బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజింధర్ ఘాటు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుపుతోందని, త్వరలోనే వివరాలు వెల్లడవుతాయని బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో కవితకు సంబంధాలున్నాయంటూ బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా విమర్శలకు పదును పెట్టింది. మరోవైపు తన పరువుకు భంగం కలిగించేలా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆమె పరువు నష్టం కేసు కూడా వేశారు.
మరోవైపు తనపై ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలను నిలువరించాలని, అందుకు కారణమైన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆమె ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆమెపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అలాగే బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజింధర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.