తాము చెబితే నమ్మరు.. ఏం రాసినా ఎవ్వరూ పట్టించుకోరు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల విషయంలో పచ్చపత్రికలకు ఉన్న విశ్వసనీయత ఆ స్థాయిది! ఇది ఇన్నేళ్లలో సంపాదించుకున్న ఇమేజ్. ఇలాంటి నేపథ్యంలో.. ఏదోలా తాము ద్వేషించే పార్టీలో కలకలం రేపాలనే టార్గెట్ కు అనుగుణంగా ప్రశాంత్ కిషోర్ పేరుతో పచ్చ కలాలు రెచ్చిపోతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో ఏకంగా సగానికి సగం ఎమ్మెల్యే సీట్లలో అభ్యర్థులు మారిపోతారని, ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ రిపోర్టులు వచ్చాయంటూ పచ్చ మీడియా ఒక ప్రచారానికి తెగబడింది. ఏ పార్టీలో అయినా ఎన్నికలకూ, ఎన్నికలకూ అభ్యర్థులు మారిపోతూ ఉంటారు. ఇదేమంత పెద్ద ఆశ్చర్యం కాదు. 2014 లో గెలిచిన అభ్యర్థుల్లో కూడా 2019లో జగన్ చాలా మందిని పక్కన పెట్టారు! 67 మంది గెలిచినప్పుడే వారిలో ఇరవై శాతం మంది అభ్యర్థిత్వాలు గల్లంతయ్యాయి. అలాంటిది 150 మంది గెలిచారంటే.. ఈ సారి కూడా ఏ ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారడం పెద్ద విడ్డూరం కాదు కూడా!
అయితే తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం ఏకంగా 50 శాతం అని అంటోంది. మారిస్తే మార్చుకున్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. తెలుగుదేశం, జనసేన కలిసి వస్తాయని ఎలాగూ పచ్చమీడియా చెబుతోంది కాబట్టి.. జగన్ నిర్లక్ష్యపూరితంగా కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడనే అనుకోవాలి!
అయితే ఎటొచ్చీ.. ఏదో మాటవరసగా సగం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు అనేసి ఉంటే అదో లెక్క. కానీ నియోజకవర్గాల పేర్లు రాయడం కామెడీగా మార్చింది ఈ వ్యవహారాన్ని. అన్నం ఉడికిందా లేదో చూడటానికి ఒక మెతుకును చూసినా చాలన్నట్టుగా.. ఈ అభ్యర్థుల మార్పు వ్యవహారంలో పూర్వ అనంతపురం జిల్లా పరిధిలో పేర్కొన్న నియోజకవర్గాల పేర్లను గమనిస్తే.. పుట్టపర్తి, శింగనమల, కల్యాణదుర్గం, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో.. అభ్యర్థులను మార్చబోతున్నారని పచ్చ మీడియా ప్రకటించింది.
విశేషం ఏమిటంటే.. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండో లీడర్ లేరు! పుట్టపర్తిలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఆయనను కాదని ఇద్దామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరు. ఒక డాక్టర్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఆశిస్తున్నారు కానీ, ఆయనది ఆశ మాత్రమే! జనాల్లో ఆ మేరకు పరిచయాలు కానీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పొలోమని ఓట్లు పడటానికి తగ్గ ప్యాడింగ్ కానీ ఆయనకు లేదు. ఆర్థిక బలం కూడా లేదు!
ఇక శింగనమలలో శమంతకమణి, యామినిబాల లతో కూడా రాజీ చేసుకుని పార్టీలోకి చేర్చుకున్నారు జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి సానుకూల స్థితి ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడి ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా సన్నిహితుడు కూడా. పద్మావతి దంపతులపై తీవ్ర వ్యతిరేకత కూడా ఏమీ లేదు. ఏ రకంగా చూసినా శింగనమలలో అభ్యర్థి మార్పు అసంభవం లాగుంది.
మరో నియోజకవర్గం అనంతపురం అర్బన్. ఇక్కడ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కి క్లీన్ రికార్డు ఉంది. ప్రజల్లో తిరగడం లో కూడా మిగతా వారితో పోలిస్తే ఆయన చాలా ముందున్నారు. కరోనా సమయంలో అయినా, ఇతర సందర్భాల్లో అయినా అనంత ప్రజల మన్నన పొందుతున్నారు వెంకట్రామిరెడ్డి. ఇక్కడ ఇప్పటికిప్పుడు ఆయనను తప్పించేసి వేరే వాళ్లకు టికెట్ ఇచ్చేయాలేనంత వ్యతిరేకత కానీ, ఆ మేరకు ప్రత్యామ్నాయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు!
ఇక కల్యాణదుర్గంలో బీసీ అభ్యర్థి ఉన్నారు. ఆమెను ఇటీవలే జగన్ మంత్రిని కూడా చేశారు! ఈ ప్రాంతంలో కురుబల జనాభా గణనీయంగా ఉంటుంది. కురుబ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఈ సమీకరణాలను మిస్ కారు. ఆమెను మంత్రిని చేసి మరీ టికెట్ ను నిరాకరించే అవకాశం ఉంటుందా? అనే తర్కాన్ని ఆలోచించుకోవచ్చు!
ఇదీ వరస. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మారిపోతున్నారు అంటూ పచ్చమీడియా ప్రచారం చేస్తున్న చోట్లలో కొన్నింటిని పరిశీలించినా ఈ పరిస్థితి కనిపిస్తుండటం గమనార్హం.