తమ పార్టీ ఎమ్మెల్యేలకు భారతీయ జనతా పార్టీ 20 నుంచి 25 కోట్ల రూపాయల మనీని ఆఫర్ చేస్తోందంటూ ఆరోపిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడకొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని, బీజేపీ వాటిని చేపట్టిందని, ఒక్కో ఎమ్మెల్యేపై 20 నుంచి 25 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టేందుకు కమలం పార్టీ వెనుకాడం లేదని ఆప్ ఆరోపిస్తోంది.
ఎవరైనా ఎమ్మెల్యే తనే వెళ్లి బీజేపీ వైపు మొగ్గితే 20 కోట్ల రూపాయలట, అదే తనతో పాటు మరో ఎమ్మెల్యేను తీసుకు వస్తే.. 20 ప్లస్ రెండో ఎమ్మెల్యేను తెచ్చినందుకు బోనస్ గా ఐదు కోట్ల రూపాయలను బీజేపీ ఆఫర్ చేస్తోందని ఆప్ నేతలు అంటున్నారు. ఇలా 20 నుంచి 25 కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చు పెట్టి అయినా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆప్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు!
మరి రాజకీయంగా చూస్తే.. రాష్ట్రానికి తక్కువ, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎక్కువ అన్నట్టుగా ఉండే ఢిల్లీలోనే ఒక్కో ఎమ్మెల్యే పై 20 నుంచి 25 కోట్ల రూపాయల రేటు అంటే రాజకీయంగా ఇదంతా గొప్ప ప్రగతేనేమో! ధనిక రాష్ట్రాలు, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలు, ఎన్నికల ఖర్చులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చినా 25 కోట్ల రూపాయలంటే మంచి ధరే!
ఎన్నికల ఖర్చు దండిగా ఉన్న రాష్ట్రాల్లో.. ఇలా ప్రభుత్వాలను కూల్చే తరుణంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలకు 50 కోట్ల రూపాయల ఆఫర్ ఉందని వినికిడి! కర్ణాటక, మహారాష్ట్రల్లో.. ఎమ్మెల్యేలు ఇదే రేటు పలికారని అక్కడ ఆ సమయాల్లో టాక్ వినిపించింది. వారితో పోలిస్తే ఢిల్లీలో ఎమ్మెల్యేల రేటు కాస్త తక్కువే అయినా, ఎన్నికల ఖర్చు తక్కువ కాబట్టి.. గిట్టుబాటు ధరేనేమో అది కూడా!