భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ మతతత్వ పార్టీగా పేరుంది. వచ్చిన పేరు చచ్చినా పోదంటారు. ఆ విధంగా దానికా పేరు పోవడంలేదు. వాళ్ళు తమది మతతత్వ పార్టీ కాదని లౌకిక పార్టీ అని చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకున్నట్లే బీజేపీలో ముస్లిం నాయకులున్నారు. ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం ఓటర్లూ ఉన్నారు. విచిత్రమేమిటంటే యూపీలో ముస్లింలకు ఒక్క సీటూ కేటాయించకుండా అధికారంలోకి వచ్చిన సందర్భం ఉంది.
బీజేపీ మతతత్వ పార్టీ అని నిజం చేసేలా ఆ పార్టీలోని కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అవి పెద్ద వివాదానికి దారి తీస్తుంటాయి. కొందరు ఆవేశంలో తెలియక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తే కొందరు కావాలనే, వివాదాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే కామెంట్స్ చేస్తుంటారు. దీంతో బీజేపీకి మతతత్వ పార్టీ అనే ముద్ర పోవడంలేదు.
ఈమధ్య బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వల్ల గతంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో మతకలహాలు జరిగాయి. మతకలహాలు చెలరేగాయంటే అది మామూలుగా ఉండదు. కొన్ని రోజుల కిందట నుపుర్ శర్మ కామెంట్స్ అంర్జాతీయంగా సంచలనం కలిగించడమే కాకుండా, ఉగ్రవాద సంస్థలు భారత్ పై బెదిరింపులకు కూడా పాల్పడ్డాయి.
నుపుర్ శర్మను హత్య చేస్తామని బెదిరించాయి. అప్పుడు నుపుర్ శర్మను బీజీపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు రాజాసింగ్ విషయంలోనూ అదే జరిగింది. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. రాజాసింగ్ వ్యాఖ్యలను పొరుగు దేశం పాకిస్థాన్ తప్పుబట్టింది. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా బీజేపీ నేతలు చేస్తున్న వరుస కామెంట్లను అడ్డుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.
“మహ్మద్ ప్రవక్తపై మూడు నెలల వ్యవధిలో బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ పౌరులతో పాటు, ప్రపంచంలోని కోట్లాది ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి” అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాజాసింగ్‌పై పార్టీ తీసుకున్న క్రమశిక్షణా చర్యలపైనా పాక్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారని విమర్శించింది. బీజేపీ తీసుకున్న చర్యలు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎదుర్కొన్న బాధను తగ్గించలేవని చెప్పుకొచ్చింది. రాజాసింగ్‌ను అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే బెయిల్‌పై విడుదల చేయడాన్ని ఖండించింది. దీనిపై తక్షణమే, కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజాసింగ్‌ను భాజపా నుంచి పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ రాజ్యాంగానికి, నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినందుకు ఈ చర్యలు తీసుకుంది. మూడు నెలల క్రితం బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ ఇలాంటి వివాదంలోనే చిక్కుకోగా.. అప్పుడు సైతం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. నుపుర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇస్లామిక్ దేశాలు నుపుర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి.
మతమనేదే చాలా సున్నితమైన విషయమని బీజేపీ నాయకులకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు కామెంట్స్ చేయడం? అటు ప్రభుత్వానికి ఇబ్బంది కలగడమే కాకుండా దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుంది.