సాధారణంగా పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవులు (పార్టీ పదవి కావొచ్చు, ప్రభుత్వ పదవి కావొచ్చు) అలంకరించాలనే ఆసక్తీ ఉంటుంది. దీనికి వయసుతో సంబంధం ఉండదు. కొద్దిమంది మాత్రం పెళ్లి, పదవుల పట్ల ఆసక్తి చూపించరు. ఆ కోవలోకే వస్తాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ. ఆయనకు పెళ్లి మీద అనాసక్తి ఎందుకు కలిగిందనేదానిపై అనేక పుకార్లు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో నిజానిజాలేమిటో తెలియదు. ఆయన ఏదో దేశం అమ్మాయిని ప్రేమించాడని, కానీ వారి పెళ్ళికి సోనియా గాంధీ ఒప్పుకోలేదని కథనాలు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన పెళ్లి ఊసు ఎత్తలేదని అంటారు. అసలు కారణం మాత్రం కరెక్టుగా తెలియదు.
ఇక ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై కూడా ఆయన ఆసక్తి చూపించడంలేదు. ఆయన పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడా అంటే అలాంటిదేమీలేదు. కానీ అధ్యక్ష కిరీటం పెట్టుకోవడానికి పూర్తిగా విముఖంగా ఉన్నాడు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయిందనే కారణంతో ఉన్న అధ్యక్ష పదవినే వదిలేశాడు. ఆ తరువాత ఇక దాని జోలికి పోలేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశాడు. ఎంతమంది చెప్పినా వినలేదు. ఆ తరువాత ఆయనకు కిరీటం పెట్టాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గత్యంతరం లేక ఆరోగ్యం బాగా లేకపోయినా సోనియా గాంధీయే అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడిని ఎన్నుకునే సమయం వచ్చింది.
కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి ఎన్నికలు ఏముంటాయి? గాంధీ కుటుంబాన్ని కాదని ఎవరూ పోటీ చేయడానికి సాహసించరు కదా. సోనియా కుటుంబంలోనే ఎవరో ఒకరు కిరీటం పెట్టుకోవాలి. ప్రస్తుతం సోనియాకు ఆరోగ్యం బాగాలేదు. పైగా బాధ్యతలు నిర్వహించే వయసు కూడా లేదు. అంటే వయసు మీద పడిందన్నమాట. పార్టీలో మెజారిటీ నాయకులు రాహుల్ గాంధీనే కోరుకుంటున్నారు. కొంతకాలంగా పార్టీలో యాక్టివ్ గా ఉంటున్న ప్రియాంక గాంధీ పేరు కూడా పరిశీలనకు వస్తోంది. కానీ ఆమెకు యూపీ ఎన్నికల్లో వైఫల్యం చెందిందనే మైనస్ పాయింట్ ఒకటి ఉంది. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి కొత్త పేరు తెరపైకి వచ్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈ పదవి చేపడతారని. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనకు ఆ పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, దీనిపై గహ్లోత్ స్పందించారు. 'మీడియా ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. వివరాలేమీ తెలియదు. నాకు కేటాయించిన విధుల్ని నేను నిర్వర్తిస్తున్నాను. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుతం నేను ఆ రాష్ట్ర పరిశీలకుడిగా ఉన్నాను. రాజస్థాన్‌లో నా బాధ్యతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. మిగిలిన విషయాలు అన్నీ మీడియా నుంచే వింటున్నాను' అంటూ ఆ వార్తలను తోసిపుచ్చారు.
ఇటీవల సోనియా.. గహ్లోత్‌తో సమావేశమై, అధ్యక్ష పదవి చేపట్టాలని కోరినట్లు తెలుస్తోంది. ఆ పదవికి ఈయన పేరు వినిపిస్తున్నప్పటికీ.. ఎలాంటి ధ్రువీకరణ మాత్రం లేదు. ఈ సీనియర్ నేత గాంధీల కుటుంబానికి విశ్వాసపాత్రుడు. అలాగే ఆయనకున్న రాజకీయ అనుభవం ఈ ఎంపికలో కీలకం కానుందనే అభిప్రాయం ఉంది. మరోవైపు.. గాంధీయేతరులు పార్టీ బాధ్యతలు తీసుకుంటే, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పదవిని చేపడితే ఉండే కష్టనష్టాల గురించి ఆయనకు బాగా తెలుసునని కొందరు నాయకులు చెబుతున్నారు.
అలాగే రాజస్థాన్‌లో అధికారాన్ని వదులుకొని, దానిని మరో కీలక నేత సచిన్ పైలట్‌కు అందించేందుకు ఈయన ఏమాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పదవికి అంతా రాహుల్ గాంధీ పేరునే ఏకగ్రీవంగా ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట గహ్లోత్ కూడా దీనిపై మాట్లాడారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టాలని తాము కోరుకుంటున్నట్లు గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు పార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాహుల్ బాధ్యతలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాహుల్ నిరాకరిస్తే కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారు. కానీ ఆయన మాత్రం పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకురావడం లేదని వార్తలు వచ్చాయి. వచ్చే నెల సెప్టెంబర్ 20 లోగా పార్టీ సారథి ఎన్నిక పూర్తవుతుందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.
ఈ క్రమంలో రాహుల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు, ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి సారథ్య పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేరు. ఇదిలా ఉండగా.. అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ పేరు కూడా తెరపైకి వస్తోంది. గాంధీ కుటుంబమే పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని కాంగ్రెస్‌లో అత్యధికులు భావిస్తున్నారు. దీంతో రాహుల్ ఒప్పుకోకపోతే ఆమె పేరును ప్రతిపాదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక వైఫల్యాల దృష్ట్యా ఆమెకు పగ్గాలు అప్పగించే అవకాశాలు లేకపోవచ్చని సమాచారం.
దీంతో పార్టీ తదుపరి అధ్యక్షులు ఎవరనే దానిపై సందిగ్ధత వీడట్లేదు. సాధారణంగా పార్టీ అధ్యక్ష పదవి అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ రాహుల్ ఇందుకు విరుద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ అధికారంలోకి రాదనే అప నమ్మకం ఆయనకు ఉన్నట్టుంది. అదే జరిగితే తనకు చెడ్డపేరు వస్తుందని, పార్టీ మనుగడ సాగించే అవకాశం ఉండదని భావిస్తున్నాడేమో. మరి కాంగ్రెస్ పార్టీకి ఎవరు దిక్కవుతారో చూడాలి.