చీమకుర్తి బహిరంగ సభలో ఆసక్తికర, సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దివంగత వైఎస్సార్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించడానికి జగన్ వెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్టుండి పరుగు తీయడం, వేదికపై ఉన్న వాళ్లు లేచి నిలబడడం, నవ్వడం లాంటి సరదా సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రసంగిస్తూ దివంగత వైఎస్సార్‌ను పాట రూపంలో కీర్తించడం మొదలు పెట్టారు. “ఎక్కడున్నావు రాజశేఖరన్నా, మంచి మనసున్న రాజశేఖరన్నా, మళ్లీ ఎప్పుడొస్తావు రాజశేఖరన్నా, మంచి గుణమున్న వాడా, చందమామ రూపు ఉన్నవాడా” అంటూ పాట పాడారు. అయితే సమయం లేకపోవడంతో పాటను ఆపాలని ఓ వ్యక్తి ఆమెకు దగ్గరగా వెళ్లి సూచించారు.
అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో జగన్ చెబుతున్నారని, అటు వైపు చూడాలని వెంకాయమ్మకు సదరు వ్యక్తి సూచించారు. ఇక పాట ఆపాలని జగన్ నవ్వుతూ సైగ చేశారు. అయినా ఆమె పాటను కొనసాగించారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే లేచి వేగంగా ఆమె దగ్గరికి వెళ్లి ఆత్మీయతతో దగ్గరికి తీసుకున్నారు.
అమ్మా ఇక పదమ్మా అంటూ వెంట పెట్టుకుని తన సీటు వద్దకు తీసుకెళ్లి కూచోపెట్టారు. ఈ సరదాను అందరూ ఎంజాయ్ చేయడం విశేషం.