కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టాలీవుడ్ ప్రముఖ హీరో, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. ఈ భేటీ వెనుక ఏమీ లేదని తెలంగాణ బీజేపీ చెబుతుండగా, ఏపీ బీజేపీ మాత్రం సంచలనం జరుగుతుందని హెచ్చరిస్తోంది. ఏపీలో రాజకీయ మార్పునకు వీళ్లిద్దరి కలయిక నాంది పలుకుతుందని ఏపీ బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
ఈ భేటీని దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేన పార్టీలను ఏపీ బీజేపీ నేతలు గిల్లుతున్నారు. ఈ విషయమై తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీలో రాజకీయ ప్రస్తావన లేకుండా వుంటుందా? అని ప్రశ్నించారు. కేవలం సినిమా కోసమే వాళ్లిద్దరూ మాట్లాడి వుంటారని తాను అనుకోవడం లేదన్నారు.
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని వేరే పార్టీ వాళ్లు ఎలా అంటారని జీవీఎల్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఆ పార్టీల భయాన్ని సూచిస్తోందని ఆయన అభిప్రాయ పడ్డారు. నిజాల కంటే ఊహలే బాగుంటాయని బీజేపీ భావిస్తోంది. అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీలో ఏం చర్చించారో తెలియదంటూనే, మరోవైపు తప్పక రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చి వుంటాయనడం గమనార్హం. దీన్నే గిల్లడం అంటారు.
అనుమానాలు రేకెత్తించి, బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని టీడీపీ, జనసేన పార్టీలు గుర్రుగా ఉన్నాయి. ఎన్టీఆర్ వారసుడిని దగ్గరికి తీసుకోవడం ద్వారా టీడీపీ, జనసేన పార్టీలకు ఓ హెచ్చరికను పంపినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా ఈ భేటీ పర్యవసానాలు రానున్న రోజుల్లో తప్పక వుంటాయని బీజేపీ నేతల నర్మగర్భ వ్యాఖ్యలు చెబుతున్నాయి.