ఇక వీళ్ళు మారరా…?

మిర్చి సినిమా క్లైమాక్స్ లో హీరో ప్రభాస్ విలన్ తో మనుషుల మధ్య కక్షలు, ద్వేషాలు వద్దని. ప్రేమగా ఉందామని, ప్రేమని పంచుదామని అంటూ ఛీ …ఇక మీరు మారరా ? …అంటూ సుదీర్ఘంగా…

మిర్చి సినిమా క్లైమాక్స్ లో హీరో ప్రభాస్ విలన్ తో మనుషుల మధ్య కక్షలు, ద్వేషాలు వద్దని. ప్రేమగా ఉందామని, ప్రేమని పంచుదామని అంటూ ఛీ …ఇక మీరు మారరా ? …అంటూ సుదీర్ఘంగా డైలాగులు చెబుతాడు. ఛీ… ఇక మీరు మారరా ? అనే మాట మన పాలకులకు బాగా సరిపోతుంది. దేశంలోని పాలకులందరూ అటూ ఇటుగా ఇలాగే ఉంటారనుకోండి. ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణా పాలకుల గురించి చెప్పుకోవాలి.

ఎందుకంటే కరోనా ప్రమాదాన్ని గురించి అసలు పట్టించుకోవడంలేదు. కరోనా నియంత్రణ పట్ల వీరికొక విధానం లేదు. కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతోనే బళ్ళు, కాలేజీలు సహా విద్యా సంస్థలన్నీ మూసేశారు కదా. పరీక్షలు పెట్టకుండా అందరినీ గుండుగుత్తగా పాస్ చేశారు కదా. అనేక ప్రవేశ పరీక్షలు వాయిదాల మీద వాయిదాలు వేశారు కదా. ఇవన్నీ ఎందుకు చేశారు ? కరోనా పెరిగిపోతుందనే భయంతోనే కదా. కరోనా అనేక రూపాల్లో దాడి చేస్తూనే ఉంది. అనేక వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి.

ఇప్పుడు డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ చాలా దేశాలను వణికిస్తున్నాయి. కొత్తగా జికా  వైరస్ కేరళను అతలాకుతలం చేస్తోంది. కరోనాకు ఇప్పుడు టీకా కనిపెట్టారుగాని ఈ జికా వైరస్ కు ఇప్పటివరకు టీకా లేదు. ఇప్పుడు ఫ్రాన్స్ లో పరిశోధనలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది చాలా ప్రమాదకరమైన అంటు వ్యాధని చెబుతున్నారు. 

ఇక బ్లాక్ ఫంగస్ కర్ణాటకలో విజృంభిస్తోంది. ఇవన్నీ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పాకడం పెద్ద కష్టం కాదు. దీనికి తెలంగాణా మినహాయింపు ఏమీ కాదు. టీఆరెస్ మంత్రులు, నాయకులు రోజూ సీఎం కేసీఆర్ భజన చేసినంత మాత్రాన కరోనా భయపడుతోందా ? ముఖ్యమంత్రిని  దైవాంశ సంభూతుడిగా కీర్తించినంత మాత్రాన కరోనా దయ తలుస్తుందా?

కానీ కరోనా తెలంగాణను ఏమీ చేయలేదని గులాబీ పాలకులు అనుకుంటున్నారు. సెకండ్ వేవ్ నుంచి మనం బయట పడిపోయామని ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు నిన్న చెప్పాడు. ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం  కరోనా పాజిటివ్ కేసులను, మరణాలను చాలా తక్కువగా చూపిస్తోంది. ప్రతి రోజూ ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్ లో కేసులు వెయ్యి లోపలే ఉంటున్నాయి. ఇందుకు భిన్నంగా ఆంధ్రాలో చాలా ఎక్కువ కేసులు చూపిస్తున్నారు. ఏ ప్రభుత్వం చెప్పేది నిజం ? తెలంగాణలో విద్యా సంస్థలు మినహా అన్ని ఓపెన్ చేశారు.

గుళ్ళు గోపురాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఎక్కడా కరోనా నిబంధనలు కనబడటంలేదు. కరోనా మూడో వేవ్ పొంచివుందని , మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తుకుంటోంది. కరోనా వ్యాప్తికి సామూహిక కార్యక్రమాలే కారణమని, అలాంటివి నిర్వహించొద్దని చెబుతోంది. కానీ ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. వానా కాలం వచ్చిందంటే పండుగలు షురూ అవుతాయి కదా. ఇప్పుడు మొదలయ్యాయి. బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది.

ఆషాఢ బోనాలు మొదలయ్యాయి. ఇవి గోల్కొండ బోనాలు. మరో రెండుసార్లు బోనాలు జరుగుతాయి. ఇవి కాకుండా ఇంకా చిన్నా చితక పండుగలు చాలా ఉన్నాయనుకోండి.  ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు, లష్కర్ బోనాలు బాకీ ఉన్నాయి. మొదటి బోనాల్లోనే లక్షమంది పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ బోనాలు జరుపుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా  అలాంటి పరిస్థితి కనబడలేదు. పైగా బోనాలు చాలా ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని మంత్రులు చెబుతున్నారు. మరి ఘనంగా చేయాలన్నప్పుడు కరోనా నిబంధనలు ఎలా అమలు జరుగుతాయి ?

ఈ ఏడాది ఉత్సవాల కోసం ప్రభుత్వం 90 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా గొప్పగా చెప్పాడు. ఇక వినాయక చవితి ఉత్సవాల కోసం అప్పుడే వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇక అడుగడుగునా వినాయక పందిళ్లు వెలుస్తాయి. పాలకులు ఒకటే చెబుతున్నారు. పోయిన ఏడాది కరోనా వల్ల ఉత్సవాలు రద్దు చేశాం కాబట్టి ఈ ఏడాది  ఘనంగా నిర్వహించాలని అంటున్నారు . అంటే రాష్ట్రంలో కరోనా మాయమైపోయిందని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఉగాది వరకు యేవో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అన్ని ఘనంగా నిర్వహిస్తారు.

ఈ కారణంగా కరోనా కేసులు మళ్ళీ పెరగవని కచ్చితంగా చెప్పగలమా? ఈ ఏడాది కూడా ఉత్సవాలు రద్దు చేస్తే నష్టమా? ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ చెప్పినప్పుడు జనం, నాయకులు ఆగుతారా ? అసలు ఉత్సవాలను ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి చేయించడం ఏమిటో అర్ధం కాదు. తెలంగాణా పండుగలను, ఉత్సవాలను ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోలేదట. అందుకని ఘనంగా చేస్తున్నారట. నిజమే …ఘనంగా చేసుకోవచ్చు. కానీ పరిస్థితి కూడా చూడాలి కదా. అదంతా ఏమీ అక్కరలేదు. వారి రాజకీయ ప్రయోజనాలు నెరవేరితే చాలు. ఛీ …ఇక మీరు మారారా ?