తెలుగుదేశం పార్టీ తీరు తమాషాగా ఉంటుంది. ఆ పార్టీ నిజంగా సమావేశం జరిపిందో లేక ,లీక్ వార్త వచ్చిందో తెలియదు కాని, పత్రికలలో వచ్చిన ఆ వార్త చదివితే ఆశ్చర్యం కలిగిస్తుంది.
కొన్ని ప్రదాన పత్రికలలో వచ్చిన శీర్షిక ఏమిటంటే..శ్రీశైలం ను ఖాళీ చేస్తుంటే లేఖలతో కాలక్షేపమా? నీటి హక్కు కాపాడలేని జగన్ పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్నారని ధ్వజం..దీనితో పాటు అఖిలపక్షాన్ని డిల్లీ తీసుకు వెళ్లండి.. టిడిపి నేతల డిమాండ్ అన్నది కూడా ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని తోడుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల విలువైన నీరు సముద్రం పాలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతా బాదపడవలసిందే. తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై ఆందోళన చెందడం తప్పు కాదు. కాని పత్రికలలో వచ్చిన వార్త చూస్తే, ఇదంతా ఎపి ముఖ్యమంత్రి జగన్ ఏదో తప్పు చేస్తే జరిగిన పరిణామంలా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు కనబడుతుంది.
అసలు సమస్యను పక్కదారి పట్టించి, ప్రభుత్వంపై ప్రజలలో దురభిప్రాయం కలిగించడానికి తంటాలు పడుతున్నట్లుగా ఉంటుంది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు ఉంది. ఆయన పార్టీ పక్షాన అయినా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయినా, ఎదుటి వారిపై విమర్శలు చేయడానికి లీకుల పద్దతిని ప్రవేశపెట్టారు. గతంలో కాంగ్రెస్ హయాంలో లీక్ అంటే సొంత పార్టీలో జరిగే పరిణామాలపై ఎవరైనా ఆఫ్ ద రికార్డు చెబితే వాటిని కధనాలుగా ఇచ్చేవారు. ఎదుటిపార్టీవారిని నేరుగానే విమర్శించేవారు.
కాని చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ఆ తీరు మారిపోయింది. ఆయన వ్యూహాత్మకంగా తన పి.ఆర్.ఓ.లను ఉపయోగించుకుని ఎదుటి పార్టీ వారిని ఉద్దేశించి ఇలా అన్నారు..అలా అన్నారు అని లీక్ ఇచ్చి రాయించుకునేవారు. లేదంటే ముఖ్యనేతల సమావేశం అని కామన్ పాయింట్ ఉండేది. కొన్నిసార్లు అక్కడ ఎవరూ లేకపోయినా ఇదో డైలాగ్ ఉండేది. దాని ప్రకారం మీడియా అంతటా వార్తలు ఇస్తుండేది. ఇప్పుడు కూడా అలా చేశారా?లేదా అన్నది తెలియదు కాని, కొన్ని పత్రికలలో ఆ వార్త చదివితే ఈ విషయం గుర్తుకు వచ్చింది.
ఈ సంగతి పక్కనపెడితే, అసలు విషయానికి వద్దాం. డిల్లీకి నీటి సమస్యపై అఖిలపక్షాన్ని తీసుకు వెళదాం అని చెప్పడం వరకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం కూడా దీనిని పరిశీలించవచ్చు. అయితే ఇదే చంద్రబాబు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ ఎంతటి పెద్ద సమస్య అయినా, ఉదాహరణకు ప్రత్యేక హోదా వంటి వాటిపైన అయినా అఖిలపక్షం తీసుకు వెళ్లేలేదు. పైగా ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించడానికి ముందు అఖిలపక్షాన్ని పిలవలేదు. అలా చేస్తే ఆయన ఇబ్బందులు వస్తాయని అనుకుని ఉండవచ్చు.
కాకపోతే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాక మాత్రం అఖిలపక్షం అనో, మరొకటనో హడావుడి చేశారు. అది ఎన్నికలలో రాజకీయ ప్రయోజనం ఆశించి చేసిన వైనం అన్న సంగతి అందరికి తెలుసు.
పుట్టిన గడ్డకు ఎవరు ద్రోహం చేస్తున్నారన్న చర్చకు వస్తే, పోతిరెడ్డిపాడు వద్ద కాల్వలను వెడల్పు చేసి, కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పదకం ప్రవేశపెట్టాలని తాపత్రయపడుతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేసినట్లు ఎలా అవుతుందో టిడిపివారే చెప్పాలి. అలాంటి ఆలోచన చేయని చంద్రబాబు ద్రోహం చేసినట్లు అవుతుందా? కాదా? ఆ ఆలోచన రానంతమాత్రాన ద్రోహం అని అనజాలం. కాని ఒక కొత్త స్కీమును ఆలోచించి తీసుకు వచ్చిన జగన్ ను ఉద్దేశించి అలా వ్యాఖ్యానించినందున దానికి ఇది సమాధానం అవుతుంది.
ఇంతకీ రాయలసీమ ఎత్తిపోతల పధకం ఉండాలా?వద్దా అన్నదానిపై తెలుగుదేశం పార్టీకాని, ఆ పార్టీ అధినేతగా చంద్రబాబుకాని ఇంతవరకు నిర్దిష్ట వైఖరి ఎందుకు ప్రకటించలేదు? దానిని ద్రోహం అంటారా? లేక మరేమంటారు? కృష్ణా జలాలపై ఎపి హక్కును కాపడలేకపోతున్నారని జగన్ పై విమర్శ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో కనీస నీటి మట్టం లేకుండా, జలవిద్యుత్ ను ఆరంభించిన వెంటనే అభ్యంతరం చెప్పింది జగన్ కాదా? ప్రధాన మంత్రి మోడీకి, కేంద్ర మంత్రి షెకావత్ కు లేఖలు రాసింది జగన్ కాదా? కృష్ణా జలాల బోర్డుకు పిర్యాదు చేయలేదా? ఇందులో జగన్ చేయగలిగినదంతా చేయకపోతే తప్పుపట్టవచ్చు. లేదా పలానా విధంగా కూడా పోరాటం చేయండని సలహా ఇవ్వవచ్చు. ఆ పని చేయని టిడిపి వారు ,తమ ప్రకటనలలో ఎక్కడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీరును తప్పు పట్టడం లేదు. కెసిఆర్ చేస్తున్నది తప్పు అని చెప్పకుండా జగన్ పై విమర్శలు చేస్తే జాతీయ పార్టీ అని చెప్పుకునే టిడిపికి సరిపోతుందా?
ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఏమైనా రెండు కళ్ల సిద్దాంతం తోనే ఉన్నారా? చంద్రబాబు ఇప్పటికీ హైదరాబాద్ లోనే ఉంటున్నందున ,తెలంగాణ వారు విద్యుత్ ఉత్పత్తి చేయడం తప్పు లేదని అనుకుంటున్నారా? అదే సమయంలో ఎపికి వచ్చి ఆ రాష్ట్రం హక్కులను కాపాడలేకపోయిందని అంటున్నారా?
ఏది ఏమైనా ఓటుకు నోటు కేసు తర్వాత జరిగిన పరిణామాల జనం మర్చిపోయారని టిడిపి నేతల ఉద్దేశం కావచ్చు.వారు పద్దతిగా మాట్లాడకుండా,కువిమర్శలు చేసినంత కాలం జనం ఆ విషయాలను గుర్తు చేసుకుంటూనే ఉంటారన్న సంగతి గమనించాలి.
ఇక గాలేరు-నగరి, హంద్రీ-నీవా స్కీముల కింద చిత్తూరు జిల్లాలో రిజర్వాయిర్లు నిర్మాణ ప్రతిపాదన చేస్తే,దానిని అడ్డుకునే విదంగా కొందరు రైతుల పేరుతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ లు వేసింది. తెలుగుదేశం కు మద్దతు ఇచ్చే పత్రిక ఒకటి వారిని రైతులుగా రాయడం ద్వారా తెలుగుదేశం కు సంబందం లేదన్న పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించింది కాని, ఇతర మీడియాలో అసలు విషయం బయటకు వచ్చేసింది కదా?అలా పిటిషన్ వేసినవారు టిడిపి నేతలని తేటతెల్లమైంది. సొంత జిల్లా అయిన చిత్తూరులో ఈ స్కీములకు అడ్డం పడవద్దని చెప్పవలసిన బాద్యత చంద్రబాబుకు లేదా? అలా చేయకపోతే ద్రోహం అని అంటారన్న సంగతి ఆయనకు తెలియదా?
ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేయడం వల్లే గత ఎన్నికలలో చంద్రబాబు పార్టీ పరాజయం చెందింది. ప్రత్యేకించి రాయలసీమలో అయితే 52 సీట్లకు 49 సీట్లను వైసిపి గెలుచుకుని, టిడిపికి మూడు సీట్లే దక్కాయి. అయినా ఇప్పటికీ అదే దోరణిలో టిడిపి వెళ్లడం దురదృష్టకరం.
ముచ్చుమర్రి ప్రాజెక్టులో మిగిలిన పనులు ఎందుకు పూర్తి చేయలేదని చంద్రబాబు లేదా టిడిపి నేతలు ప్రశ్నించారని కూడా రాశారు.మరి ఇదే పత్రికలో ముచ్చుమర్రి స్కీమును పూర్తికాకుండా జాతికి అంకితం చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారే.ఆ విషయాన్ని అప్పట్లో ఇదే పత్రిక ప్రముఖంగా ఇచ్చిన విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
రాయలసీమకు ఎవరు ఎంత ఖర్చు చేశారన్నది టిడిపి మరో ప్రశ్న కావచ్చు.వాటన్నిటికి ప్రభుత్వం తగు టైమ్ లో సమాదానం ఇవ్వవచ్చు. కాని పుట్టినగడ్డకు జగన్ ద్రోహం చేస్తున్నారన్న పిచ్చి ఆరోపణలు చేయడం వల్ల టిడిపికి నష్టం తప్ప లాభం ఏమి ఉండదు.
చంద్రబాబు కు నిజానికి భారీ ప్రాజెక్టులపై అంత నమ్మకం లేదు. అవి పూర్తి కావడానికి చాలా కాలం పడుతుందని భావించేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఆ విషయం దాచుకునేవారుకాదు.ఆయన ఆ అభిప్రాయం తో ఉండడం తప్పుకాదు.కాని ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ఒక గేటు భిగించి,మొత్తం పూర్తి అయిపోయిందన్న చందంగా మాట్లాడడం, తన జీవితాశయం పోలవరం అని,తన కల నెరవేరిందని చెబితే వినేవారికి ఆశ్చర్యం కలుగుతుంది. పోని ఆ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఉంటే మంచి పేరే వచ్చేది. ఆ పని చేయకుండానే జయము,జయము చంద్రన్న అంటూ పాటలు పాడించుకుని అప్రతిష్టపాలయ్యారు.
ముచ్చుమర్రి గురించి ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే పులివెందులకు నీరు ఇచ్చానని గతంలో ప్రచారం చేసుకునేవారు.అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్ ఒక మాట అనేవారు.తన తండ్రి హయాంలో దాదాపు పూర్తి అయిన ప్రాజెక్టులకు లష్కర్ మాదిరి గేట్లు ఎత్తి తానే చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు. అందులో పూర్తి వాస్తవం ఉండవచ్చు.లేదా కొంత ఉండవచ్చు. కాని గండికోట ప్రాజెక్టుకు కేవలం మూడు టి.ఎమ్.సిల నీటిని టిడిపి ప్రబుత్వం తరలిస్తే ,ఇప్పుడు ఈ ప్రభుత్వం 27 టి.ఎమ్.సిల నీటిని తరలించిందా?లేదా?అలా చేసినవారు ద్రోహం చేసినట్లు అవుతుందా? పైగా ఇంత ఘనాపాటి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం కు ఎందుకు నీటిని ఇవ్వలేకపోయారు? ఇప్పుడు జగన్ ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? దానిని బట్టే పుట్టినగడ్డకు ఎవరు మేలు చేశారు? ఎవరు ద్రోహం చేశారన్నది విశ్లేషించుకోవచ్చు.
ఇక వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా టిడిపి విమర్శించింది. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో వైఎస్ ఆర్ కు, ఇతరులకు ఏ మాత్రం పొంతన లేదన్న సంగతి వారికి కూడా తెలుసు.ఇంకా అంతో,ఇంతో అలనాడు ఎన్.టి.ఆర్.కొత్త ప్రాజెక్టులు చేపట్టారు.ఆ తర్వాత అంతకన్నా మంచి పేరు వచ్చింది రాజశేఖరరెడ్డికే.ఇప్పుడు తండ్రిని మించి పేరు తెచ్చుకోవాలని జగన్ వివిధ ప్రాజెక్టులను చేపట్టారు.వాటిని ఆయన సకాలంలో పూర్తి చేయగలిగితే ఆయన జీవితం ధన్యం అవుతుంది.
కొమ్మినేని శ్రీనివాసరావు