ఇల్లలకనే పండుగ కాదనే సామెత చందాన కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగానే వైసీపీ ఏదో సాధించిందనే భ్రమ నుంచి బయటపడాలి. చంద్రబాబు పని అయిపోయిందనే ప్రచారాన్ని వైసీపీ ఊదరగొడుతోంది. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం అధికార పార్టీకి జోష్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇదే సందర్భంలో టీడీపీ వెన్నులో వణుకు పుట్టించింది. అయితే ఇవేవీ శాశ్వతం కావు.
శత్రువును తక్కువ అంచనా వేస్తే, అంతకు మించిన తప్పిదం మరొకటి వుండదు. గతంలో కడపలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించిన టీడీపీ, కడపలోనే జగన్ చిన్నాన్నను మట్టి కరిపించామని, ఇక వైసీపీ పని అయిపోయిందని గొప్పలు పోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. కుప్పంలో స్థానిక సంస్థల విజయాన్ని కూడా ఆ కోణంలోనే చూడొచ్చు. గతంలో టీడీపీ చేసిన తప్పిదమే వైసీపీ చేస్తోందా? అనే అనుమానం కలుగుతోంది. ఇవాళ్టి నుంచి చంద్రబాబు కుప్పం నియోజక వర్గంలో మూడో రోజుల పాటు పర్యటించనున్నారు.
కుప్పం మున్సిపాల్టీ, సర్పంచ్, మండ పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులతో పాటు ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన మాట నిజమే. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబును భయం వెంటాడుతున్న మాట కూడా నిజమే. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. దీన్ని వైసీపీ నుంచి చూడాలి. నాణేనికి రెండో వైపు ఏం జరుగుతున్నదో తెలుసుకోడానికి, అర్థం చేసుకోడానికి స్థానిక వైసీపీ నాయకులు నిరాసక్తి చూపుతున్నారు.
కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు మేల్కొన్నారు. కుప్పంలో తనకు ఎదురే లేదనే చోట వ్యతిరేకత రావడానికి కారణాలేంటో ఓటమి ద్వారా తెలుసుకునే అవకాశం చంద్రబాబుకు కలిగింది. 1989 నుంచి తిరిగి లేని విజయం సాధిస్తున్న తనకు శత్రువులెవరో, మిత్రులెవరో కళ్లెదుట నిలిపిన ఘనత కుప్పం ఓటమికే దక్కుతుంది. ఇది చంద్రబాబుకు వైసీపీ చేసిన పరోక్ష సహకారమని చెప్పాలి. దీంతో సార్వత్రిక ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై బాబుకు స్పష్టత వచ్చింది.
కుప్పం స్థానిక సంస్థల్లో విజయానికి అనుసరించిన మార్గాన్నే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని వైసీపీ అనుకుంటే, అంతకు మించిన తప్పిదం మరొకటి వుండదు. పిడుక్కు, బియ్యానికి ఒకే మంత్రమా? అన్నట్టు…చంద్రబాబును ఓడించడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాలనే అమలు చేయాలని అనుకుంటే వైసీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. కుప్పంలో చంద్రబాబును సీఎం అభ్యర్థిగా అక్కడి ప్రజలు చూస్తారు. ఇది టీడీపీకి దోహదం చేసే అంశం. మరీ ముఖ్యంగా ఓ ప్రముఖ నాయకుడిని ఎన్నుకుంటున్నామన్న ఫీలింగ్ అక్కడి ప్రజల్లో వుంటుంది.
చంద్రబాబును కాదని మరొకరికి ఓటు వేయాలంటే బలమైన కారణం వుండాలి. వైసీపీ అభ్యర్థిగా భరత్‌ను సీఎం ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబుకు దీటుగా భరత్ తనకు తాను ఆవిష్కరించుకోవాలి. ఇందుకు అధికార పార్టీ అభ్యర్థిగా అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎటూ వైసీపీ ప్రభుత్వం కుప్పానికి ఏం చేయడానికైనా సిద్ధంగా వుంది. దీన్ని మరింత మందిని పార్టీ వైపు ఆకర్షితులయ్యేందుకు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కుప్పం వైసీపీ నేతలపై ఆధారపడి వుంది. కానీ కుప్పం వైసీపీ నేతల తీరు ఎలా వుందంటే… కొత్త వాళ్లు వస్తే తమకెక్కడ ప్రాధాన్యం తగ్గుతుందనే భయం కనిపిస్తోంది. ఈ ధోరణి పార్టీకి నష్టం కలిగిస్తుంది.
మరోవైపు వైసీపీ పెట్టిన భయం వల్ల చంద్రబాబు అప్రమత్తమై రెండు నెలలకు ఒకసారి సొంత నియోజకవర్గానికి వెళుతున్నారు. బాబును చూసి వైసీపీ నవ్వు కోవడం కాదు, గుణపాఠం నేర్చుకోవాలి. 14 ఏళ్ల పాటు సీఎంగా, అలాగే సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నాయకుడిగా, టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన నాయకుడే …తనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిసి, రెండడుగులు వెనక్కి తగ్గి తనే స్వయంగా పర్యటిస్తున్నారు. బాబుతో పోల్చుకుంటే కుప్పం వైసీపీ నాయకులు పాలెగాళ్లేమీ కాదు.
క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ బాబును ఎందుకు ఓడించాలో, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వల్ల పేదలకు కలుగుతున్న ప్రయోజనాలు ఏంటో, అలాగే మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏంటో వివరించాల్సి వుంది. విజయం ఊరికే రాదు. శ్రమ మీ ఆయుధం అయితే విజయం బానిస అవుతుందనే స్ఫూర్తిదాయక సందేశాన్ని కుప్పం వైసీపీ నేతలు ఒంటబట్టించుకోవాల్సి వుంది. స్థానిక సంస్థల విజయం మత్తు నుంచి వైసీపీ నేతలు ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం వుండదు.