వయసు మీద పడిన తరవాత చేతి కర్ర ఎవరికైనా అవసరమే. అలాగే సీనియర్ హీరో లు అయిపోతే పక్కన మరో హీరో తోడు అవసరం అని డిసైడ్ అయినట్లున్నారు మెగాస్టార్ చిరంజీవి.
నిజానికి ఇది కొత్త ఫార్ములా కాదు. గతంలో దగ్గుబాటి వెంకటేష్ ప్రయత్నించినదే. ఆయన వదిలేసారు చిరంజీవి పట్టుకున్నారు అంతే తేడా. ఆప్పటికే ఆచార్య (రామ్ చరణ్), గాడ్ ఫాదర్ (సల్మాన్), వాల్తేర్ వీరయ్య (రవితేజ) అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచార్యలో రామ్ చరణ్ తో కలిసి డ్యాన్స్ చేసి పాట పాడారు. లూసిఫర్ లో అవకాశం లేకపోయినా సల్మాన్ తో కలిసి డ్యాన్స్ చేసి పాట పాడారు.
ఇప్పుడు అదే ఫార్ములాను వాల్తేర్ వీరయ్యలో కూడా అమలు చేయాలనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజ-చిరు ఇద్దరూ సవతి సోదరులుగా నటిస్తున్నారని ఈ సినిమా గతంలో వచ్చిన మణిరత్నం ఘర్షణ టైపు సినిమా అని వినిపిస్తూనే వుంది. ఇలాంటి పాత్రలు అయినపుడు ఆ ఇద్దరి మధ్య పాట, డ్యాన్స్ ఎలా సాధ్యమవుతుంది. అదే అసలు సిసలు సమస్య.
కానీ ఏదో ఒకటి చేసి, ఇలాంటి సిట్యువేషన్ ను క్రియేట్ చేయమని డైరక్టర్ బాబీ ని మెగాస్టార్ వత్తిడి చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మెగాస్టార్ తో తనకు డ్యాన్స్ వుంటే బాగుంటుందని రవితేజ కూడా చెబుతున్నారని బోగట్టా.
ఇద్దరు హీరోలు కోరుతున్నారు కనుక, దర్శకుడు బాబికి తప్పకపోవచ్చు. వీలయినంత వరకు నో అంటున్నారు కానీ ఏదో ఒక టైమ్ లో ఎస్ అనకతప్పదు అని వినిపిస్తోంది. ఇలాంటి అవసరం వస్తుందనే మ్యూజిక్ డైరక్టర్ కూడా ఓ ట్యూన్ రెడీ చేసి పెట్టేసుకున్నారని కూడా తెలుస్తోంది.