అసలే హిట్ లు అన్నవి కరువై కిందామీదా అవుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. అదృష్టం కొద్దీ హిందీ డిజిటల్ మార్కెట్ వుంది కాబట్టి నడచిపోతొంది. లేదూ అంటే ఈపాటికి చాలా మంది చిన్న, మీడియం హీరోల మాదిరిగా స్ట్రగుల్ అయి పోయే పరిస్థితి. ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ చేతిలో వున్న ఒకే ఒక సినిమా రాక్షసుడు.
హీరో హవీష్ కోనేరు నిర్మాణ రంగంలోకి దిగి, వేరే హీరోతో చేస్తున్న సినిమా. రమేష్ వర్మ దర్శకుడు. ఈ సినిమాను జూలై 18న విడుదల చేయాలని ముందే అనుకున్నారు. అదే సమయంలో ఇస్మార్ట్ శంకర్ యూనిట్ తో కూడా డిస్కస్ చేసినట్లు బోగట్టా. అందరూ అనుకునే ఇస్మార్ట్ శంకర్ 12న రావాలని, 18న రాక్షసుడు రావాలని డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి టైమ్ లో రాక్షసుడు యూనిట్ తో మాట్లాడకుండానే చార్మి వన్ సైడ్ డెసిషన్ తీసుకుని 18న వస్తున్నట్లు ప్రకటించేసారు. దీంతో రాక్షసుడు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. వారానికి ఓ సినిమా అని ముందే అనుకుని, అందరం డేట్ లు వేసుకున్నాక, చార్మి ఇలా చేయడం సరైనదేనా? అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం చార్మిని రాక్షసుడు డిస్ట్రిబ్యూటర్లు అడిగితే, అనివార్య కారణాల వల్ల చేయాల్సి వచ్చిందని, తానేం చేయలేనని బదులు వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంమీద ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు సినిమాల్లో ఏది ఎలా వుంటుంది? అన్నది పక్కన పెడితే, రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడడం వల్ల రెండింటికీ సమస్యే. మాస్ సినిమా కావడం వల్ల ఇస్మార్ట్ శంకర్ తో రాక్షసుడికి కాస్త ఎక్కువ సమస్యే.