మెట్రోరైలు… హైదరాబాద్ వాసులకు ఓ అద్భుత అవకాశం. కానీ ఈ మెట్రోరైలు రూపకల్పనలో చాలా తెలివిగా, నిర్మాణ సంస్థ, ప్రభుత్వం కొన్ని విషయాలను పక్కదారి పట్టించినట్లు కనిపిస్తోంది. దీని ఫలితం ఇప్పుడు జనాలు అనుభవించాల్సి వస్తోంది. ట్రాఫిక్ ఇబ్బందులతో జనం నానా బాధలు పడాల్సి వస్తోంది.
విషయం ఏమిటంటే, ప్రతి రెండు కిలోమీటర్లకు ఓ స్టేషన్ ఏర్పాటు చేసారు. నిజంగా ఇది మంచి సదుపాయం. అయితే మెట్రో రైల్వే వ్వవస్థ ఏర్పాటుకు రోడ్డు మధ్య డివైడర్ ను వాడుకున్నారు. అందువల్ల స్థల సేకరణ లాంటి ఖర్చు లేదు. ఎక్కడో తప్పని సరి అయిన చోట్ల మాత్రమే ప్రయివేట్ భవనాలు తీసుకుని, కూలగొట్టి, నష్టపరిహారం చెల్లించారు. అయితే ప్రతి స్టేషన్ నిర్మాణానికి కూడా ప్రయివేటు భవనాలు తీసుకోవాల్సి వుంది. ఎందుకంటే డివైడర్ కు కుడి వైపు, ఎడమవైపు స్టేషన్ విస్తరించి వుంటుంది. ఎస్కలేటర్లు, లిఫ్ట్ లు, స్టయిర్ కేస్ ఏర్పాటు చేయాలి. ఇవి వీలయినంత దూరంగా ఏర్పాటు చేసి వుంటే ట్రాఫిక్ ఇబ్బందులు వుండవు.
కానీ అలా చేయాలి అంటే ప్రయివేటు భవనాలు చాలా ఎక్కువగా సేకరించాలి. అందువల్ల మెట్రో రైలు కార్పొరేషన్ కు భారీ పెట్టుబడులు అవసరం అవుతాయి. ఎందుకంటే స్టేషన్ల సంఖ్య తక్కువేమీ కాదు. అందుకే వీలయినంత వరకు రోడ్డు పక్కన వున్న మార్జిన్ స్థలాలలోనే స్టేషన్ లు ఏర్పాటు చేసారు. మార్జిన్ అన్నది ప్రభుత్వం స్థలం కావడంతో పరిహారం అక్కరేలేదు. అంతవరకు బాగానే వుంది.
కానీ ఇప్పుడు ఏమవుతోంది? ప్రతి స్టేషన్ కింద బాటిల్ నెక్ పరిస్థితి ఏర్పడుతోంది. స్టేషన్ వచ్చేసరికి ట్రాఫిక్ ఫ్రీ ప్లో వుండడం లేదు. అదే సమయంలో మెట్రో కారిడార్ పొడవునా సిగ్నళ్లు తీసేసారు. నిర్ణీత కిలోమీటర్ల లెక్కలో యు టర్న్ లు ఏర్పాటుచేసారు. ఇవి దాదాపు ప్రతి కిలోమీటర్ కు వున్నాయి. దాంతొ ప్రతి యు టర్న్ దగ్గరా ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా తలెత్తుతున్నాయి.
కొన్ని స్టేషన్ల వద్ద అయితే బాటిల్ నెక్ పరిస్థితి మరీ ఘోరంగా వుంటోంది. అక్కడ ఏదయినా ప్రార్థనా స్థలం లేదా ఆలయం లాంటివి వుండడం కారణం. లేనిపోని వివాదాలు తలెత్తి, ప్రాజెక్టు లేటు కాకుండా, మెట్రో వ్యవస్థ ఏం చేసింది అంటే ఎక్కడ అలా వుంటే అలాగే అడ్జస్ట్ చేసి కట్టేసారు. దాంతో ఆయా ప్రదేశాల్లో నార్మల్ టైమ్ లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇవన్నీ ఇలా వుంటే మెట్రో వచ్చిన తరువాత రోడ్డు పక్క వ్యాపారాలను కూడా అలాగే వదిలేసారు. రాజకీయ ప్రయోజనాలు, సమస్యలు వస్తాయి కనుక వాటి జోలికి వెళ్లడం లేదు. దాంతో మరింత ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. నిజానికి ఇవి పరిష్కరించడం సులువే. కానీ రాజకీయ వ్యవహారాల కారణంగా వాటి జోలికి వెళ్లడం లేదు. ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట, ఇలా ఒకచోట అని కాదు చాలా చోట్ల ఈ సమస్య వుంది. చిత్రమేమిటంటే చాలా చోట్ల మెట్రో ఏర్పాటు చేసిన పేవ్ మెంట్ వ్యవస్థ కూడా ఈ చిరువ్యాపారుల సముదాయాల్లో చేయకుండా వదిలేసారు. అలా చేయాలంటే వారిని తప్పించాలి. అది సాధ్యం కాదు.
గతంలో వర్షం పడినపుడు ట్రాఫిక్ సమస్యలు మామూలే. కానీ ఇప్పుడు వర్షానికి ఈ మెట్రో సమస్యలు తోడై మరింత అగచాట్లు పడాల్సి వస్తోంది. ఈ కష్టాలు ఇప్పట్లో తీరేవి కాదు. పోలీసులు మెట్రో ఎక్కడ వుంటే అక్కడ రోడ్డును వీలయినంత విస్తరించాల్సి వుంది. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సి వుంది. అలాగే కీలక డివైడర్ల వద్ద అయినా పోలీసు ఫోర్స్ ను నియమించాల్సి వుంది. మెట్రో పొడవునా ట్రాఫిక్ నిపుణులతో సర్వే చేయించి, సమస్యల పరిష్కారిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి వుంది.
లేదూ అంటే మెట్రో వ్యవస్థ మోదం కాదు. ఖేదం అవుతుంది.