శేఖర్ కమ్ముల-నాగ్ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ వార్తను ముందుగా గ్రేట్ ఆంధ్ర బయటపెట్టిన సంగతి తెలిసింది. ఆ తరువాత శేఖర్ కమ్ముల ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టును ఆపేసారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో లేటెస్ట్ అప్ డేట్. శేఖర్ కమ్ముల ఇప్పుడు అర్జెంట్ గా చైతూ కోసం మరో కొత్త కథ తయారుచేయలేదని తెలుస్తోంది.
కొత్త వాళ్లతో చేయడం మొదలుపెట్టి, రెండు సెట్ లు వేసి, ఆపేసిన ఆ సినిమానే ఇప్పుడు చైతన్యతో తీస్తున్నారని బోగట్టా. వాస్తవానికి ఇప్పటకే శేఖర్ కమ్ముల ఆపేసిన సినిమాలో హీరో డ్యాన్సర్. బాగా డ్యాన్స్ చేయడం వచ్చిన హీరోనే కావాలని శేఖర్ కమ్ముల వెదికి వెదికి కొత్త అబ్బాయిని తీసుకువచ్చారు.
డివివి దానయ్య కొడుకు చేయాలని సరదా పడినా, ఈ డ్యాన్స్ కారణంగానే వేరే హీరోని వెదికారు.కానీ ఇప్పుడు అక్కడా శాటిస్ ఫాక్షన్ రాలేదు. దాంతో ఆ ప్రాజెక్టు ఆపేసారు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ను తెలివిగా, హీరో డ్యాన్సర్ అనేదానికి బదులు, హీరోయిన్ డ్యాన్సర్ అన్నట్లు మార్చి, దానికి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి, చైతూ-సాయిపల్లవి తో తీయబోతున్నట్లు తెలుస్తోంది.
డ్యాన్సర్ క్యారెక్టర్ కావడంతో సాయిపల్లవి వెంటనే ఓకె అన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫిదాలో తన డ్యాన్స్ తో సాయిపల్లవి జనాలను ఫిదా చేసిన సంగతి తెలిసిందే. సో, ఇప్పుడు ఆ పాత స్క్రిప్ట్ ను హీరో, హీరోయిన్ క్యారెక్టర్లను అటు ఇటు చేసి కొత్తగా చేయడంలో శేఖర్ కమ్ముల బిజీగా వున్నట్లు తెలుస్తోంది.