భారతీయ జనతా పార్టీ వాళ్లు నోరుతెరిస్తే విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు. కట్టుకునే బట్టలు కూడా సంప్రదాయబద్ధంగా, విలువలతో కూడుకుని ఉండాలని కమలనాథులు చెబుతూ ఉంటారు. అయితే వారి వ్యవహరణ తీరులో మాత్రం విలువలు, నైతికత అనేవి లేకుండా పోతూ ఉన్నాయి. అన్నింటా భారతీయ విలువలు ఉండాలని చెప్పుకొచ్చే కమలనాథులు, తమ రాజకీయంలో 'నైతికత' లేకుండా పోతున్న వైనం ప్రజలు ఎవరూ గమనించడం లేదనే భావనలో ఉన్నారు.
ఇప్పుడు రాజకీయంగా వారి టైమ్ నడుస్తోంది కాబట్టి.. రాజకీయ 'వ్యభిచారం' చేయడానికి కూడా కమలం పార్టీ వెనుకాడటం లేదని పరిశీలకులు అంటున్నారు. ఫిరాయింపులను ఇలా ప్రోత్సహించడం అంటే.. దాన్ని ఏమనాలో కమలనాథులే చెప్పాలి. అందులోనూ వారు ఫిరాయింపజేస్తున్నది పరమ పుణీతులను ఏమీ కాదు!
ఆల్రెడీ సీబీఐ, ఈడీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారిని. అందులోనూ బ్యాంకులకు లోన్లను ఎగ్గొట్టడం అనే పని ద్వారా కేసులను ఎదుర్కొంటున్న వాళ్లను బీజేపీ వాళ్లు ఏరి కోరి చేర్చుకున్నారు. ఐదేళ్ల పాటు అడ్డంగా దోచుకున్న వారికి ఇప్పుడు మళ్లీ అధికారం ఇచ్చింది బీజేపీ!
అంతే కాదట.. ఇప్పుడు అలాంటి వారికే ఏపీలో బీజేపీ పగ్గాలు కూడా అప్పగించనున్నారట! ఫిరాయింపు ఎంపీల్లో ఒకరికి ఏపీ బీజేపీ పగ్గాలు దక్కుతాయని.. ఇక నుంచి వారే ఏపీలో బీజేపీ రాజకీయాన్ని శాసిస్తారని ప్రచారం జరుగుతూ ఉంది. మొత్తానికి కమలం పార్టీ గొప్ప రాజకీయమే చేస్తూ ఉంది. బహుశా చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదేనేమో. బీజేపీ పగ్గాలు తన వారి చేతిలో ఉండటమే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నది. కమలం పార్టీ కూడా అదే చేయబోతున్నట్టుగా ఉంది.