విముక్త పార్టీ అధినేత ..విడ్డూర వ్యాఖ్య‌లు!

దేశ వ్యాప్తంగా రాజ‌కీయాలు ఆరోగ్య‌క‌రంగా లేవు. ఇందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అతీతం కాదు. సంస్కార‌వంత‌మైన‌ రాజ‌కీయాల‌ను అంద‌రూ కోరుకుంటున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలంటే మొహ‌మెత్తుతున్న ప‌రిస్థితి. రెండు పార్టీలూ దొందు దొందే అనే అభిప్రాయాలే ఎక్కువ‌.…

దేశ వ్యాప్తంగా రాజ‌కీయాలు ఆరోగ్య‌క‌రంగా లేవు. ఇందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అతీతం కాదు. సంస్కార‌వంత‌మైన‌ రాజ‌కీయాల‌ను అంద‌రూ కోరుకుంటున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలంటే మొహ‌మెత్తుతున్న ప‌రిస్థితి. రెండు పార్టీలూ దొందు దొందే అనే అభిప్రాయాలే ఎక్కువ‌. సంస్కార‌వంత‌మైన మూడో ప్ర‌త్యామ్నాయం కావాల‌ని మెజార్టీ ప్ర‌జానీకం కోరుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పెట్టి, కొంద కాల‌మైనా న‌డ‌ప‌లేక కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పోల్చితే గుడ్డిలో మెల్ల అన్న‌ట్టు చిరంజీవే ఎంతో బెట‌ర్ అనిపిస్తున్నారు. చిరంజీవి అమాయ‌కుడు కాబ‌ట్టే కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం క‌నీసం తాను కూడా గెల‌వ‌లేకపోయినా… వ్యాపారాన్ని మాత్రం చేసుకోవ‌చ్చ‌ని పార్టీని కొన‌సాగిస్తున్నారనే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. 25 ఏళ్ల రాజ‌కీయం అంటూ కబుర్లు చెబుతూ త‌న వెనుక ఉన్న సొంత సామాజిక వ‌ర్గ ఓట్లు కొన్ని, అలాగే అభిమానుల ఓట్ల‌ను టీడీపీకి చూపుతూ సొమ్ము చేసుకోడానికి వ్యూహం ర‌చిస్తున్నారు.

రానున్న ఎన్నిక‌ల్లో ఎవ‌రితో క‌లుస్తామో స్ప‌ష్టం చేయ‌డం లేదు. గ‌తంలో చెప్పిన మూడు ఆప్ష‌న్ల‌ను మ‌ళ్లీమ‌ళ్లీ గుర్తు చేయ‌డం, అంతా వ్యూహాత్మ‌కంగా ఎన్నిక‌ల్లో న‌డుచుకుంటామ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం వెనుక ఏదో ఉంద‌ని వూహిస్తే పొర‌బ‌డిన‌ట్టే. తాను లేక‌పోతే మ‌ళ్లీ జ‌గ‌నే వ‌స్తాడ‌నే భ‌యాన్ని క్రియేట్ చేసి, త‌మ‌తో సాధ్య‌మైనంత ఎక్కువ వ్యాపారం చేసుకోడానికే ప‌వ‌న్ వ్యూహం వెనుక వున్న అస‌లు ఎజెండాగా టీడీపీ అనుమానిస్తోంది.

ప‌వ‌న్ బిజినెస్ డిమాండ్ జ‌గ‌న్ పేరే. కనీసం జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించ‌డం కూడా ఇష్టం లేదంటున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… వ్యాపారం ద‌గ్గ‌రికొచ్చే స‌రికి త‌మ నాయ‌కుడి పేరునే వాడుకుంటున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. టీడీపీ నేత‌ల వాద‌న కూడా అదే. మ‌ళ్లీ జ‌గ‌నే అధికారంలోకి వ‌స్తాడేమో అనే భ‌యాన్ని సృష్టిస్తూ, త‌న డిమాండ్‌ను పెంచుకుంటున్నార‌నే అనుమానం టీడీపీని వెంటాడుతోంది.

ఇది చాల‌ద‌న్న‌ట్టు బీజేపీని కూడా ఎలాగోలా తీసుకొస్తాన‌ని ప‌వ‌న్ టీడీపీకి ఆఫ‌ర్ చేస్తున్న‌ట్టు ఆ పార్టీ ముఖ్య నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వైసీపీ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే కొత్త రాగాన్ని ప‌వ‌న్ మొద‌లు పెట్టారు. ఇవ‌న్నీ టీడీపీని ప‌వ‌న్‌ ఆక‌ర్షించే ప‌థ‌కాలే అని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. 2019లో జ‌న‌సేన పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గాలు ఎన్ని? గెలిచిన స్థానాలు ఎన్ని?  కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క చోట గెలిచిన జ‌న‌సేన‌ను ఏనాడో ఏపీ ప్ర‌జానీకం విముక్త పార్టీగా తేల్చేసింది. 

అలాంటి విముక్త పార్టీకి అధ్య‌క్షుడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… భారీ డైలాగ్‌లు కొట్ట‌డం వెనుక ఎవ‌రి క‌ళ్ల‌లో ఆనందం చూసేందుకో తెలియ‌నంత అమాయ‌కులా జ‌నం! తాను చెబితే జ‌నం పోలోమ‌ని జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఓట్లు వేసి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దులు దాటిస్తార‌ని జ‌న‌సేనాని అనుకోవ‌డం ఆయ‌న అజ్ఞానం త‌ప్ప మ‌రేమీ కాదు.