సిగ్గు లేక‌పోతే స‌రి…అవ‌గాహ‌న‌ట‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ద్య విమోచ‌న ప్ర‌చార క‌మిటీకి అస‌లు సిగ్గుందా? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. తిరుప‌తిలో ఇవాళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం- మ‌ద్య విమోచ‌న ప్ర‌చార క‌మిటీ నేతృత్వంలో మ‌త్తు పానీయాల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు, క‌ళాజాత నిర్వ‌హించ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ద్య విమోచ‌న ప్ర‌చార క‌మిటీకి అస‌లు సిగ్గుందా? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. తిరుప‌తిలో ఇవాళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం- మ‌ద్య విమోచ‌న ప్ర‌చార క‌మిటీ నేతృత్వంలో మ‌త్తు పానీయాల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు, క‌ళాజాత నిర్వ‌హించ త‌ల‌పెట్టాయి. మ‌ద్యం త‌దిత‌ర మ‌త్తు పానీయాల‌ను సేవించ‌కూడ‌ద‌ని, వాటి దుష్ప్ర‌రిణామాల‌పై పలువురు వ‌క్త‌లు చైత‌న్య‌ప‌రుస్తార‌ట‌!

మ‌త్తు పానీయాల‌ను విక్ర‌యించేది ప్ర‌భుత్వ‌మే. మ‌ళ్లీ వాటిని తీసుకోకూడ‌ద‌ని అవ‌గాహ‌న క‌ల్పించేది అదే. ఇదెక్క‌డి విడ్డూర‌మ‌ని మ‌హిళా సంఘాలు, పౌర సంఘాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఊరూరా తిరుగుతూ ఏమ‌న్నారంటే….

“2019 ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. నిషేధం కూడా మూడు దశల్లో అమలు చేస్తాం. మొదటి దశలో బానిసలైన మందుబాబులు మ‌ద్యం తాగ‌డం మానేలా ప్రతి నియోజకవర్గంలోనూ డి-అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం.రెండోది, అందుబాటులో లేని స్ధాయిలో మద్యం ధరలను భారీగా పెంచుతాం. ఇక, మూడో ద‌శ‌లో సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొస్తా. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసిన తర్వాతే 2024 ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు అడగటానికి వస్తా” అని జ‌గ‌న్ న‌మ్మ‌బ‌లికారు.

తానిచ్చిన హామీకి జ‌గ‌న్ క‌ట్టుబడిన దాఖ‌లాలున్నాయా? మ‌ద్యం ఆదాయం లేనిదే ప్ర‌భుత్వం న‌డ‌వ‌లేని ద‌య‌నీయ స్థితి. అవ‌గాహ‌న స‌ద‌స్సుల పేరుతో ఎవ‌రిని మ‌భ్య పెట్ట‌డానికి ప్ర‌భుత్వం, దాని అనుబంధ మ‌ద్య విమోచ‌న ప్ర‌చార క‌మిటీ చేస్తున్నాయ‌ని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. కనీసం మౌనంగా ఉంటే గౌర‌వ‌మ‌న్నా ద‌క్కుతుంద‌ని, కంటి తుడుపు ప‌నులెందుక‌ని పౌర స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. నిన్న‌టికి నిన్న క‌ర్నూలు జిల్లా కోడుమూరులో మ‌ద్యానికి బానిసైన ఓ వ్య‌క్తి… భార్య‌ను కొట్టి పిల్ల‌ల‌ను తీసుకెళ్లి అర్ధ‌రాత్రి వెళ్లి నిర్జ‌న ప్రాంతంలో వ‌దిలేయ‌డం తీవ్ర దుమారం రేపుతోంది.

ఇలాంటి అమాన‌వీయ ఘ‌ట‌న‌ల‌కు మ‌ద్యం కార‌ణం కాదా? దాన్ని అమ్ముతున్న ప్ర‌భుత్వానికి ఆ పాపంలో భాగ‌స్వామ్యం లేదా? చేత‌నైతే మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేయాలి. అంతే త‌ప్ప‌, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల పేరుతో ప‌రువు పోగొట్టుకోవ‌డం ప్ర‌భుత్వానికి మంచిది కాదు.