ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి సంక్షేమ పథకాలకు సంబంధం లేని బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇటీవల ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ కౌంటర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకుంది. గతంలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే బటన్ నొక్కి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేసేవారు.
ఆ తర్వాత జనంలోకి వెళ్లడం మొదలైంది. ఇంత వరకూ అలాంటి సభల్లోనే జగన్ పాల్గొంటూ, దుష్టచతుష్టయం అంటూ ప్రత్యర్థులు, ఎల్లో మీడియాపై జగన్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
ఇవాళ మాత్రం సంక్షేమానికి సంబంధం లేని సభలో జగన్ ప్రసంగించనున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి జగన్ వెళ్లనున్నారు. చీమకుర్తిలో బూచేపల్లి కల్యాణ మండపం వద్ద దివంగత వైఎస్సార్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు.
ఇటీవల జనసేనాని పవన్‌కల్యాణ్ పదేపదే జగన్‌పై విమర్శలు, వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనడం, అలాగే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కలకలం తదితర అంశాలపై జగన్ దీటైన కౌంటర్ ఇస్తారా? అనే చర్చ జరుగుతోంది.
సంక్షేమ పథకాలకు సంబంధం లేని సమావేశం కావడంతో అనేక రాజకీయ అంశాలు మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. తనను గద్దె దించడమే లక్ష్యంగా పవన్ హెచ్చరించడంపై జగన్ ఎలాంటి సమాధానం చెబుతారో తెలుసుకోవాలనే ఉత్కంఠ రేపుతోంది.