విషం కక్కే అతివాదులకు సస్పెన్షన్లు చాలవు!

వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుమోసిన రాజాసింగ్ రేపిన కలకలానికి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా ఒక్కసారిగా కలవరపడింది. ఇప్పటికే నూపుర్ శర్మ వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలతో దేశంలో మతకలహాలు సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్న…

వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుమోసిన రాజాసింగ్ రేపిన కలకలానికి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా ఒక్కసారిగా కలవరపడింది. ఇప్పటికే నూపుర్ శర్మ వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలతో దేశంలో మతకలహాలు సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్న అపకీర్తిని మూటగట్టుకున్న కమలనాధులు.. అసలే మతకలహాల పరంగా ఎంతో సునిశిత ప్రాంతమైన హైదరాబాదులో.. తమ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల దుమారం వారిని మరింతగా భయపెట్టింది. 

అసలే తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావాలని.. దక్షిణాదిలో కూడా తమ పార్టీకి దిక్కూ మొక్కూ ఉంటుందని నిరూపించుకోవాలని భారతీయజనతా పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అలాంటి నేపథ్యంలో రాజాసింగ్ మాటలు.. ఇక్కడ కొత్త రచ్చను పుట్టిస్తే.. మతకలహాలకు కారణం అయితే.. చాలా సంవత్సరాలుగా ఈ కోణంలోంచి ప్రశాతంగా ఉన్న తెలంగాణ ప్రజలందరూ తమను ఛీత్కరించుకుంటారని భారతీయ జనతా పార్టీకి అర్థమైంది. 

నూపుర్ శర్మ విషయంలో స్పందించిన దానికంటె చాలా వేగంగా పార్టీ స్పందించింది. రాజాసింగ్ ను పార్టీనుంచి సస్పెండ్ చేసింది. 

కానీ.. పాలకుండలో విషం చుక్క వేసే ఇలాంటి నాయకులకు సస్పెన్షన్లు సరిపోతాయా? అనేది పెద్ద ప్రశ్న. రాజకీయా పార్టీలు.. ఎవ్వరైనా సరే.. తమ నేతల్ని పార్టీనుంచి సస్పెండ్ చేయడం అనేది పెద్ద ప్రహసనంగా, డ్రామాగా ప్రజల్లో గుర్తింపు ఉంది. ఒక నాయకుడి గురించి వివాదం రేగినప్పుడు సస్పెండ్  చేయడం.. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా తిరిగి పార్టీలో చేర్చేసుకోవడం.. తిరిగి అందలాలు ఎక్కించడం అనేది రివాజు అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో నూపుర్ శర్మ మీదైనా, రాజాసింగ్ మీదైనా కేవలం సస్పెన్షన్లు విదించడం ద్వారా కమలదళపతులు.. భారతీయ సమాజానికి  ఎలాంటి నమ్మకం కలిగించగలుగుతారు?.. అనేది అనుమానమే. 

చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. అనే పడికట్టు వాక్యం వాడి ఊరుకుంటే కూడా సరిపోదు. రాజకీయ పార్టీ అనేది ప్రజల ఓట్ల మీద ఆధారపడి బతుకుతుంటుంది గనుక.. ప్రజలకు వారు నమ్మకాన్ని కలిగించాలి. భరోసా ఇవ్వాలి. ఇలాంటి విషం కక్కే అతివాదులను కేవలం సస్పెండ్ చేయడం కాదు, పార్టీనుంచి డిస్మిస్ చేసి ఇక ఎప్పటికీ పార్టీలోకి రానివ్వబోం అని కూడా ప్రకటించాలి. అలా చేస్తే తప్ప అతివాదుల్లో భయం పుట్టదు. 

భారతీయ జనతా పార్టీ హిందువుల ఓట్లను మాత్రమే నమ్ముకుని బతుకుతుండవచ్చు గాక.. కానీ.. జాతీయ స్థాయిలో అధికారం చెలాయిస్తున్న, ఆ అధికారాన్ని సుస్థిరంగా మార్చుకోవాలని కోరుకుంటున్న పార్టీగా.. మిగిలిన అన్ని మతాల వారిలో భయాన్ని పుట్టిస్తామంటే కుదరదు. 

ముస్లింల ఓట్లు అక్కర్లేదని వారు అనుకోవచ్చు.. అలాగని ముస్లింలను భయపెట్టే పరిస్థితి క్రియేట్ చేసే హక్కు వారికి లేదు. ఆ మేరకు బిజెపి ఢిల్లీ పెద్దలు.. దేశంలోని ముస్లిముల్లో నమ్మకం కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి.