గుండు వెనక్కి తన్ని గుండు పగులుతోంది

ఒకటి కాదు రెండు కాదు.. ట్రిగ్గర్ నొక్కాక ప్రతీ బులెట్టు ముందుకి పోకుండా వెనక్కి తన్నడం తెదేపా నాయకత్వానికి జరుగుతోంది.  Advertisement మొన్నటికి మొన్న గోరంట్ల మాధవ్ ఉదంతాన్ని చాలా పెద్ద రాజకీయం చేయాలని…

ఒకటి కాదు రెండు కాదు.. ట్రిగ్గర్ నొక్కాక ప్రతీ బులెట్టు ముందుకి పోకుండా వెనక్కి తన్నడం తెదేపా నాయకత్వానికి జరుగుతోంది. 

మొన్నటికి మొన్న గోరంట్ల మాధవ్ ఉదంతాన్ని చాలా పెద్ద రాజకీయం చేయాలని చూసారు. కానీ అదేంటో తాము తీసిన గోతిలో తామే పడ్డట్టు అది కాస్తా కమ్మ-కురుబ కులాల గొడవకి దారి తీసేసరికి అసలుకే ఎసరవుతోందని సైలెంటయ్యారు. 

ఇలా కాదని మరొకసారి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కారు. ఎవరి మీదంటే ఏకంగా అమిత్ షా మీద. ఆయన తెలంగాణా పర్యటనలో చంద్రబాబుని కలవబోతున్నారంటూ సొంత పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు రాయించుకున్నారు. ఢిల్లీల్లో భాజపా నీడలో ఉన్న కొందరు మాజీ తెదేపా నాయకులు ఆ వార్తల్ని పట్టుకెళ్లి చూపించి అమిత్ షాతో, “ఇలా ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది సర్. ఒకసారి ఫార్మల్ గా బాబుగార్ని కలిసేస్తే సరిపోతుంది..ఆయన గౌరవం కోసం. మనకు ఎప్పటికైనా పనికిరావొచ్చు” అని చెప్పారట. 

అయినా ఇలాంటి మెట్టరాజకీయాలు అమిత్ షా దగ్గరా? ఈ ఎలిమెంటరీ స్కూల్ తెలివితేటలకి మనసులోనే నవ్వుకుని సింపుల్ గా వచ్చి చంద్రబాబుకి వ్యతిరేకుడైన జూ ఎన్.టి.ఆర్ ని కెలిసి తెదేపా నాయకత్వాన్ని వెర్రివెంగళాయల్ని చేసాడు. డైరెక్టుగా ఢిల్లీలో ఉన్న తెదేపా ఏజెంట్లకి, ఇండైరెక్టుగా పచ్చ మీడియాకి, అల్టిమేట్ గా చంద్రబాబుకి అమిత్ షా జెల్ల పీకాడన్నమాట.  

అసలు చంద్రబాబు గౌరవం కోసం అమిత్ షా ఎందుకు కలుస్తాడు? చంద్రబాబు ఏమైపోయినా అమిత్ షాకి, మోదీకి ఏం పడుతుంది. ఢీల్లీ వెళ్లి ప్రదక్షిణాలు చేసినా అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్లు హైద్రాబాదొచ్చి బాబుని కలుస్తారా? అసలా ప్రతిపాదన చేసిన ఢిల్లీ ఏజెంట్ల మూర్ఖత్వాన్ని అనాలి. వాళ్లకి బాబు ఇంకా అవతార పురుషుడు కావొచ్చేమో కానీ, ఆయనగారి అవతార పరిసమాప్తి జరిగి చాలా కాలమయ్యిందన్న సత్యం మిగతా లోకానికి తెలుసు. 

ఆ విధంగా తెదేపా నాయకత్వం పేల్చిన రెండో బులెట్ కూడా వెనక్కి తన్ని బుర్ర పగలగొట్టింది.

సొంత పత్రికలున్నాయని ఏది పడితే అది రాయించుకోవడం తర్వాత భంగపడడం తెదేపాకి అలవాటైపోయిన కృత్యం. ఎక్కడా తెలివిని వాడడం కానీ, కనీసం కామన్ సెన్స్ ని ఉపయోగించడం కానీ ఉండదు. అంతా కాలం చెల్లిన 1990ల నాటి రాజకీయంలోనే ఉన్నాడు బాబుగారు. 

ఈయన సంగతి పక్కన పెడదాం. కనీసం ఈయనగారి దత్తపుత్రుడినైనా కలిసాడా అమిత్ షా? అబ్బే లేదు. పైకి చెప్పుకోవడానికి మాత్రం జనసేనకి భాజపా మిత్రపక్షం. కనీసం ఊసులో కూడా లేకుండా పోయాడు పవన్ కళ్యాణ్. 

అటు చేసి ఇటు చేసి పవన్ ని ఆటలో అరటిపండు చేస్తోంది కేంద్ర బీజేపీ నాయకత్వం. పవన్ కి అటు తెదేపానో, ఇటు భాజపానో అండ లేకపోతే అడుగు కూడా వెయ్యలేని నీరసం. ఎంతసేపూ జగన్ మీద విమర్శనబాణాలు వేస్తూ కూర్చుంటే జనం రగిలిపోయి జనసేనకి ఓట్లేసేస్తారన్న భ్రమలో ఉంటాడు పాపం. పైగా చంద్రబాబు చేసిన హిప్నాటిజం నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఎప్పటికైనా బాబుని సీయం చేయలనే ఆలోచన తన మైండ్లో ఉంది తప్ప తాను సీయం కావాలన్న విషయం మరిచిపోయాడు. అలా మరిచిపోయేలా హిప్నాటైజ్ చేసి ఉంచాడు బాబు గారు. 

కులం గురించి మాట్లాడిన వాడికి చెప్పు చూపించాలన్నాడు చంద్రబాబు. గతంలో తాను “ఎవరూ కోరుకుని ఎస్సీలుగా పుట్టారు” అన్నా మరొకటన్నా… ఇప్పుడు జ్ఞానోదయమైనట్టుంది..కనుక తాజాగా ఈ స్టేట్మెంటిచ్చాడేమో అనుకున్నారు చాలామంది. 

కానీ అలా స్టేట్మెంటిచ్చి ఒక్క రోజయ్యిందో లేదు తన దత్తపుత్రుడు కడప పర్యటనలో మొత్తం కులాలగురించే మాట్లాడాడు. 

లోకానికి నీతులు చెప్పే ముందు తన దత్తపుత్రుడికి చెప్పు చూపించి క్రమశిక్షణలో పెట్టుకోవాలి కదా! రాష్ట్రంలో 90% పజలు నమ్మేది ఒక్కటే. పవన్ ఏ స్పీచ్ ఇచ్చినా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందని. అలాంటప్పుడు దత్తుడ్ని చక్కబెట్టుకుని కదా నీతులు చెప్పాలిసింది.  

ఏతావాతా చెప్పేదేంటంటే తెదేపా అధిష్టానం ఎవరి మీద గురిపెట్టి పేల్చినా గుండు వెనక్కి తన్ని గుండు పగులుతోంది. 

-శ్రీనివాసమూర్తి