‘‘జైలుకు వెళ్లి వచ్చిన వాడిని ఎన్నుకుంటారా?’’ అంటూ వైఎస్ జగన్ ను ఉద్దేశించి… గతంలో తెలుగుదేశం నాయకులు పదేపదే రెచ్చిపోయారు. ఏ నేరమూ నిరూపణ కాని జైలు జీవితం గురించి.. రాక్షసంగా అభివర్ణించారు. అయితే ఆనాడు నోరు పారేసుకున్న వారిలో ఇవాళ జైలుకు వెళ్లబోతున్నది ఎంతమంది? గత అయిదేళ్ల పాలన కాలంలో ఎడాపెడా అవినీతికి పాల్పడినందుకు మూల్యం చెల్లించబోతున్నది ఎందరు? అనే విషయాలు ఇప్పుడు అమరావతి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి.
అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని జగన్ తొలినుంచి అంటూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో టెండర్ల వ్యవహారంలో అనేక అరాచకాలు చోటుచేసుకున్నాయని, ఇప్పటిదాకా మొదలుకాని పనులను ఆపేయడం, టెండర్లను సమీక్షించడం, రివర్స్ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాచేయడం వంటి నిర్ణయాలను కూడా ప్రకటించారు. తాజాగా ఇంజినీరింగ్ అధికార్లతో సమావేశం అయినప్పుడు కూడా.. అవినీతి కాంట్రాక్టుల గురించి జగన్ ప్రధానంగా ప్రస్తావించడం విశేషం.
కేవలం పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాకుండా, గృహనిర్మాణశాఖ, ఇతర శాఖల్లో జరిగిన అవినీతిని కూడా వెలికి తీయాలని ఆయన స్పష్టంగా పురమాయించారు. తొలిదశలో ఇంజినీరింగ్ కాంట్రాక్టుల సంగతి నిగ్గుతేలుస్తారు. ఆ తర్వాత ఇతర శాఖల అవినీతి మీద కూడా దృష్టి పెట్టనున్నారు. ప్రాథమికంగా అంచనాల పెంపు, నామినేషన్ మీదనే పనులు కేటాయించడం తదితర రూపాల్లో వేలకోట్ల రూపాయల అవినీతికి విచ్చలవిడిగా తెగబడ్డారని కూడా జగన్ నిగ్గుతేల్చారు.
ఇప్పుడు రాజకీయ చర్చ ఏంటంటే.. అధికారుల ద్వారానే గతంలో జరిగిన కాంట్రాక్టుల్లో అవినీతిని లెక్క తీయిస్తున్నారు. ఏతావతా… సదరు అవినీతికి మూలకారకులెవ్వరో తేలుస్తారు. జరిగిన అవినీతిని సరిదిద్ది, ప్రభుత్వానికి వాటిల్లిన నష్టాన్ని పూడ్చేందుకు వారిమీద కేసులు పెడతారు. అంతిమంగా గత ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, పలువురు నాయకులు జైలుకు పోక తప్పకపోవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.
అవినీతి మూలాలు తవ్వుకుంటూ వెళితే గనుక.. చాలామంది జైలుకు వెళ్లాల్సి వస్తుందని… వారిలో పలువురు మంత్రులు కూడా తప్పక ఉంటారనే చర్చ జరుగుతోంది. నిర్మాణాలు , ప్రాజెక్టులతో సంబంధం ఉన్న పలువురు అధికార్లు కూడా ఇరుకున పడతారనే ప్రచారం జరుగుతోంది.