Advertisement

Advertisement


Home > Politics - Gossip

కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం బాబేనా?

కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం బాబేనా?

అధికారం అనుభవించిన వాళ్లు, అధికారం రుచి చూసినవాళ్లు అయిదు నిమిషాలు కూడా దానికి దూరంగా వుండలేరు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. అయితే అలా అని ఆయన ఇప్పుడు అర్జెంట్‌గా అధికారం కోసం అర్రులు చాచడంలేదు. అయిదేళ్లు తరువాత పరిస్థితి ఏమిటి? అని కంగారు పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, మాట్లాడుతున్న మాటలు, కనిపిస్తున్న చేతలు అలా వున్నాయి. ఇదే తీరు కొనసాగితే అయిదేళ్ల తరువాత తెలుగుదేశం పార్టీకి కష్టం అన్న మాటలు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్నాయి.

అందుకే 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా నాలుగున్నరేళ్లకు పైగా దూరం వుంది కదా? ఇప్పటి నుంచి పావులు కదపడం ఎందుకు? అన్న క్వశ్చను రావచ్చు. కానీ జగన్‌-మోడీ మైత్రీబంధం ప్రస్తుతం అధికారికం కాదు. పైగా జగన్‌ ప్రత్యేకహోదా నినాదం వదలడం లేదు. ఇది ఎప్పటికైనా భాజపాకు ఇబ్బందే. డిప్యూటీ స్పీకర్‌ పదవి పార్టీకి ఇస్తామంటే జగన్‌ తీసుకోలేదు. అదే విధంగా అధికారం పంచుకునే ఆలోచనతో కూడా లేరు. అలాంటపుడు వచ్చే ఎన్నికల వేళకు పరిస్థితి ఎలా వుంటుందో ఎవరికీ తెలియదు.

ఈ పరిస్థితిని వాడుకోవాలని చంద్రబాబు నడుం బిగించినట్లు కనిపిస్తోంది. అందుకోసం అయిన వారంరోజుల ముందే ముందస్తు జాగ్రత్తగా ఓ స్టేట్‌మెంట్‌ పడ్నేసి, దాన్ని తన అను'కుల' మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చేసారు. 'తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ యూపీఏకు దగ్గరగా లేదని, ఎన్డీఎ-యూపీఏలకు సమానదూరం పాటించిందని, మాయావతి, అఖిలేష్‌ లాంటి వాళ్లు సైతం ఇప్పుడు మౌనంగా వున్నందున, తెలుగుదేశం పార్టీ కూడా తటస్థ విధానం అనుసరిస్తుందని' చంద్రబాబు చెప్పేసారు. అప్పుడే మీడియా కూడై కూసింది బాబుగారు యూటర్న్‌ తీసుకుంటున్నారని.

నిజానికి బాబుగారికి యూటర్న్‌ తీసుకోవడం, తీసుకుని అవతలి వాళ్లను ఒప్పించడం కొత్త కాదు. మోడీని విమర్శించిన ఆయనే మళ్లీ మోడీ పంచన చేరారు. మళ్లీ ఆయనే మోడీని ప్రపంచంలో ఎవరూ అనని మాటలు అన్నారు. ఢిల్లీ-యూపీ-తమిళనాడు-బెంగుళూరు-బెంగాల్‌ల మధ్య తిరిగి, మోడీని ఎలాగైనా కిందకు దింపేయాలన్నంత కసితో పనిచేసారు. కానీ ఆ ప్రయత్నాలు అన్నీ వమ్ము అయిపోయాయని.. మరోపక్క బాబు అను'కుల' దినపత్రికలన్నీ మోడీని ఓ రావణాసురిడి మాదిరిగా ఆంధ్రజనాల ముందు నిలబెట్టాయి.

2024లో భాజపాతో పొత్తు స్మూత్‌గా సాగిపోవడం కోసం ఇప్పటి నుంచి రంగం సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో బిసిలను చేరదీసే పని పెట్టుకున్నారు. ముందుగా తనకు కీలకమైన, నమ్మకస్తులైన సుజనా, సీఎంరమేష్‌ లాంటి వారిని భాజపాలోకి ఎగుమతి చేసే పని పెట్టుకున్నారు. వారికి కూడా అదే కావాలి. ఎందుకంటే వాళ్ల వ్యాపారాలు, కేసులు వుండనే వున్నాయి. తన వాళ్లు అంతా భాజపాలో వుంటే అక్కడ ఏం జరుగుతోంది? భాజపా పెద్దలను ఎలా దారికి తెచ్చుకోవాలి అన్న విషయాలు సులువు అవుతాయి. అవసరం వచ్చినపుడు వీళ్లంతా ఇటు పొత్తుకే మొగ్గుచూపుతారు తప్ప, జగన్‌ వైపు కాదు.

మరోపక్క పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని బీసీలకు ఇచ్చే ప్రయత్నం స్టార్ట్‌ చేసారు. ఇప్పటికే అచ్చెంనాయుడుకు డిప్యూటీ లీడర్‌ పదవి ఇచ్చి, తన పక్కనే వుంచుకుని, తరచు అతనికే ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అదే సమయంలో కాపులను ఇక పక్కనపెట్టినట్లే అనుకోవాలి. ఎందుకుంటే 2024లో అన్నీ బాగుంటే పవన్‌తో పొత్తు కచ్చితంగా వుంటుంది. అందువల్ల ఆ ఓటు బ్యాంక్‌ ఆయన చూసుకుంటారు. తాము బీసీల సంగతి చూసుకుంటే, భాజపా కలిసి వస్తే గెలుపు సులువు అవుతుంది అన్నది బాబుగారి కొత్త స్క్రీన్‌ప్లే.

బాబుగారి అనుమతి, ప్రొద్బలం లేకుండా బొండా ఉమా లాంటివాళ్లు విజయవాడ నుంచి గోదావరి జిల్లాకు వచ్చి కాపులతో మంతనాలు సాగించరు. కాపుల తెదేపాను వీడి భాజపాలోకి వెళ్లకుంటే బీసీలు తేదేపాకు దగ్గర కారు. అదీ బాబుగారి స్ట్రాటజీ. ఎన్ని పిల్లి మొగ్గలు వేసి, ఎందరిని చేర్చుకున్నా భాజపా 2024లో కూడా ఆంధ్రలో అధికారంలోకి ఒంటరిగా రాలేదు. అది వాస్తవం.

అందుకే బాబుగారి డీల్‌ వేరుగా వుంటుంది. తెలంగాణలో భాజపాకు తెదేపా మద్దతు, ఆంధ్రలో తెదేపాకు భాజపా మద్దతు. ఇదీ స్ట్రాటజీగా అనుకోవాలి. కానీ తెలంగాణ భాజపా జనాలు బాబును దగ్గరకు రానివ్వరు. ఆంధ్రలో కూడా నిన్నటి వరకు అదే పరిస్థితి వుంది. అందుకే తన జనాలను ఆ పార్టీలోకి పంపి, అక్కడ మార్గం సుగమం చేసుకోవాలన్నది బాబుగారి ఐడియా.

నిజానికి బాబుగారు ఐడియా వేసినా వేయకున్నా జనాలు వుండరు. అయిదేళ్లు ఏదో ప్రాపకం కావాలి. వైకాపా, తెరాస, భాజపా ఏ అండాలేకుండా వ్యాపారాలు సాగించడం ఎలా? అందుకేవాళ్లు జంపింగ్‌లకు రెడీ. అందుకే ఆ జంపింగ్‌ జపాంగ్‌లను తనకు అనుకూలంగా వాడుకోవడానికి బాబుగారి స్క్రీన్‌ప్లే ఇది. అందుకే వెళ్తున్న వాళ్లని బాబు ఏమీ అనడంలేదు. పైగా వాళ్లను సముదాయించకుండా కేడర్‌ను సముదాయిస్తున్నారు. వెళ్తున్నవాళ్లు కూడా మోడీ సారథ్యం అవసరం అన్నట్లు మాట్లాడుతున్నారు.

అంతా బాగానే వుంది. కానీ మోడీకి ఈ విషయాలను అన్నీ తెలియవా? ఊహించలేరా? బాబుగారు ఎన్నికల ముందు చేసిన యాగీ అప్పుడే మరిచిపోయారా? అంటే అస్సలు సమస్యే లేదు. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ డోర్లు మూసేయరు. అలా వుంటుంది వుండనీ, అని వేచి చూసే టైపు. పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో? అని ఆలోచించే వ్యవహారం. అదే ఇప్పుడు చంద్రబాబుకు వరం. ఇప్పుడు కాలు లోపలపెట్టే స్థలం ఇస్తే చాలు 2024 నాటికి మొత్తం దూరిపోవచ్చు.

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?