చంద్రబాబునాయుడు అంటే.. గోబెల్స్ ను నమ్ముకున్న నవతరం రాజకీయ నాయకుడు. గోబెల్స్ తరహాలో… ఒక విషయాన్ని పదేపదే ప్రచారంలో పెడితే ప్రజలు దానిని నమ్ముతారని… తన పబ్బం గడుస్తుందని అనుకునే వ్యక్తి. ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే, అదే అబద్ధాన్ని పదిసార్లు పదిమందితో చెప్పిస్తే.. ప్రజలు దాన్ని నమ్మితీరుతారనేది ఆయన విశ్వాసం. ఆ గోబెల్స్ సిద్ధాంతంతో ఆయన కొన్ని సక్సెస్ లు సాధించారు. ఇప్పుడు ఆ గోబెల్స్ ఫార్ములా దెబ్బతిన్నా కూడా.. ఆయన పచ్చ శ్రేణులు పాఠాలు నేర్చుకోవడం లేదు.
ప్రజలు తెలివిపరులయ్యారని, తన వక్రప్రచారాలను నమ్మడం లేదని.. చంద్రబాబునాయుడుకు ఈ ఏడాది ఎన్నికల ఫలితాలతోనే అర్థమైపోయి ఉండాలి. కానీ వాస్తవాన్ని అంగీకరించకుండా, ఆత్మవంచన చేసుకుంటూ ఎదుటివారిని నిందిస్తూ బతికేయడం తెలుగుదేశానికి అనాదిగా ఉన్న అలవాటు. గత అయిదేళ్లలో రాష్ట్రాభివృద్ధి విషయంలో తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మలేదు. ఈ పాఠం నుంచి కాస్త ఫెయిర్ గా మాట్లాడడం గురించి చంద్రబాబు, ఆయన పచ్చ శ్రేణులు నేర్చుకుని ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు.
ప్రజావేదిక విషయంలో ప్రభుత్వం ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే.. రాద్ధాంతం చేయడానికి తెలుగుదేశానికి నోరెలా వచ్చిందో అర్థంకావడం లేదు. ప్రజావేదిక అనేది తన నివాసం పక్కనే ఉన్నది గనుక.. అక్కడ జగన్ హవా పొలకువ కనిపిస్తే సహించలేమనే భయంతో.. చంద్రబాబు దానిని తనకే దఖలు పర్చాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దాన్ని పట్టించుకోకుండా సర్కారు స్వాధీనం చేసుకుంది.
‘ఇది దారుణం’ అంటున్నాయి పచ్చశ్రేణులు. ప్రజావేదిక భవనంలోని తెదేపా రాష్ట్ర కార్యాలయ భవన నమూనాని బయటపెట్టేశారని ఆక్రోశిస్తున్నారు. అసలు సందేహం ఏంటంటే… అసలు ఆ నమూనాను లోపల ఎందుకు పెట్టారు? ఏ అధికారంతో పెట్టారు? ప్రభుత్వం ఆస్తి అయిన ఆ భవనంలో పార్టీకి చెందిన వస్తువులు ఎందుకు ఉన్నాయి? అయినా తాము అందరమూ కలిసి గోబెల్స్ సిద్ధాంతం ప్రకారం గోల చేస్తే.. ప్రభుత్వం అరాచకాలు చేస్తున్నట్లుగా ప్రజలు నమ్ముతారనే భ్రమల్లో తెదేపా ఉంది.
ఆ రోజులు పోయాయి. ప్రజావేదిక విషయంలో ఎంత ఎక్కువ రచ్చ చేస్తే అంతగా ఆ పార్టీ పరువే పోతుందని, ప్రజలు మరింతగా ఛీకొట్టే ప్రమాదం ఉందని వారు తెలుసుకుంటే మంచిది.