పార్టీ ఫిరాయింపుల గురించి తెలుగుదేశం నాయకులు ఇవాళ భోరున విలపిస్తున్నారు. ఫిరాయింపుల రూపంలో కాదు కదా… ఏకంగా విలీనం రూపంలోనే రాజ్యసభ ఎంపీలు కమల తీర్థం పుచ్చుకోవడం వారికి మింగుడు పడడంలేదు. న్యాయపోరాటం చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని బీరాలు పలుకుతున్నారు. ఇంత జరుగుతుండగా… గతంలో విచ్చలవిడిగా ఇదేతరహా అరాచకాలకు పాల్పడిన తాము ఆక్రోశంతో విలపించే ముందు కాస్త సిగ్గు కలిగి ఉండాలనే స్పృహ కూడా వారికి ఉన్నట్లు లేదు.
తెలుగుదేశం పార్టీలో ఈ ముసలం పుట్టే సమయానికి చంద్రబాబు దేశంలో లేకపోవడం తమాషా. పార్టీ పతనాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజెబుతున్న ఈ సందర్భంలో మీడియా ముందుకు వచ్చి.. తనలోని ఆవేదనను దాచుకుంటూ, ప్రశ్నించే మీడియా ప్రతినిధుల మీదికి గుడ్లురుముతూ, అగ్రహిస్తూ.. రకరకాల హావభావ విన్యాసాలతో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం చంద్రబాబుకు లేకుండా పోయింది.
పార్టీలో ప్రస్తుతానికి మిగిలిన నాయకులు చంద్రబాబు ఇంట్లో సమావేశమై, అమెరికాలోని అధినేతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ఆగ్రహాన్ని చూపించేశారు. ఇది ముమ్మాటికీ ఫిరాయింపే అని బల్లగుద్ది తేల్చేశారు. న్యాయపోరాటం చేస్తాం అని హుంకరించారు.
కానీ, కచ్చితంగా జరిగేది ఏంటంటే కోర్టుకు వెళ్లడం జరగదు.. తాము నెగ్గేది లేదని వారికి స్పష్టంగా తెలుసు. రేపు తెల్లారేసరికి అంతా చల్లారిపోవడం గ్యారంటీ. నిన్నటిదాకా తాము చేసినవి అన్నీ ఇలాంటి అరాచకాలు అయినప్పటికీ, ఇవాళ ఇలా విలపించడం తమ సిగ్గుమాలిన తనాన్ని బయటపెడుతుందని వారికి ఆలోచనే రావడంలేదు ఎందుకో మరి!!