జగన్ నీపై కేంద్రానికి ఫిర్యాదు చేసి, ఒక ఆట ఆడిస్తూ చూస్తూ వుండు అని జనసేనాని పవన్‌కల్యాణ్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. పవన్ ఆలోచన చేసే లోపే, వైసీపీ విమర్శిస్తున్నట్టుగా ఆయన దత్త తండ్రి చంద్రబాబునాయుడు ఆచరణలోకి దిగడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందంటూ చంద్రబాబు 9 పేజీల లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు రాయడం చర్చనీయాంశమైంది.
పవన్ ఆలోచనల్ని చక్కగా చంద్రబాబు కాపీ కొట్టి, తనతో పాటు ఇతరత్రా అంశాలపై భారీ ఫిర్యాదును చంద్రబాబు చేయడం గమనార్హం. జగన్ సర్కార్ హింస, నిరంకుశత్వం, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థ, కేంద్ర సంస్థలపై దాడులకు పాల్పడుతోందని ఫిర్యాదులో చంద్రబాబు పేర్కొనడం విశేషం.
తన పాలనలో ఏవైతే చంద్రబాబు పాటించరో, వాటి గురించే ఆయన తెగబాధపడి పోవడం గమనార్హం. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ పదుల సంఖ్యలో కూలీలను కాల్చి పడేసిన ఘన చరిత్ర చంద్రబాబు పాలనకే దక్కుతుంది. విద్యుత్ ఉద్యమ కారులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి, ఇద్దరి కార్మికుల చావుకు కారణమైన చంద్రబాబు కూడా హింస, నిరంకుశత్వం, రాజ్యాంగం, మానవ హక్కుల ఉల్లంఘనలపై నీతులు చెబుతుంటే నోర్మూసుకుని అందరూ వినాల్సిన దుస్థితి ఏర్పడింది.
వైసీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని నలుగురైదుగురికి కులాల ప్రాతిపదికన మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్రబాబు కూడా జగన్ పాలనలో రాజ్యాంగ సంస్థలు, న్యాయ వ్యవస్థ విధ్వంసాల గురించి మాట్లాడుతున్నారంటే, అంతా ప్రజాస్వామ్యం గొప్పతనమని సరిపెట్టుకోవాలి. కమీషన్ పెంచాలని నడిరోడ్డుపై అడిగిన పాపానికి తోకలు కత్తిరిస్తానని నాయీ బ్రాహ్మణులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన చంద్రబాబు ప్రజాస్వామ్య విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటే, ఔరా అని ముక్కున వేలేసుకోవాలి.
తన పాలనలో ఎప్పుడైనా ప్రజాస్వామ్య వ్యవస్థల విలువను పెంచేలా చంద్రబాబు వ్యవహరించి వుంటే, ఆయన తర్వాత వచ్చిన వారు అనుసరించేవారు. అబ్బే, అలాంటివి పొరపాటున కూడా చంద్రబాబు పాటించరు. కానీ ఆయన గౌరవించని, ఏ మాత్రం పాటించనవి తాను ప్రతిపక్షంలో మాత్రం ఉండాలని కోరుకోవడం చంద్రబాబు మార్క్ రాజకీయానికి నిదర్శనం. బాబు లేఖపై రాష్ట్రపతి, ప్రధాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.