నువ్వు అతిగా ఎవరినైతే ద్వేషిస్తావో.. నువ్వు చివరకు వారిలాగే తయారవుతావు.. అనేది ఒక సామెత! సైకాలజిస్టులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. మరి కాంగ్రెస్ ను, కాంగ్రెస్ విధానాలను, కాంగ్రెస్ పాసిజాన్ని అతిగా ద్వేషించిన కమలం పార్టీ ముఖ్య నేతలు చివరకు అదే కాంగ్రెస్ విధానాలను ఫాలో కావడం కూడా పై విశ్లేషణకూ, సామెతకూ మద్దతుగా నిలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీలో ఇలా చెప్పులో మోసే సంస్కృతి ఉండేది. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కొందరు మొహమాట పడేవాళ్లుకూడా! అలాంటి వారిలో కొందరు సీఎంలయ్యారు. మరి కొందరు రాజ్యసభ సభ్యత్వాలను పొందారు. బెంగళూరు సిటీలో సీకే జాఫర్ షరీఫ్ రోడ్డు అని ఒకటి ఉంటుంది. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తే సిటీ మధ్యలో జాఫర్ షరీఫ్ రోడ్డు వస్తుంది. ఇంతకీ ఈ జాఫర్ షరీఫ్ ఎవరంటే.. ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర మంత్రి.
అంతకు పూర్వం ఆయన బెంగళూరులో ఒక హోటల్ లో బేరర్. సదరు హోటల్లో కొందరు నేతలు సమావేశమై కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూల్చేకుట్రను పన్నుతుండగా.. ఈ సమావేశం వివరాలను ఢిల్లీలో కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ కు అందించారట జాఫర్. ఆ పనికి మెచ్చి ఆ తరువాతి కాలంలో ఇందిర ఆయనను ఎంపీని చేసింది. ఆ పై కేంద్రమంత్రి అయ్యారయన.
ఇక సంజయ్ గాంధీ చెప్పుల మోతలో నారాయణ్ దత్ తివారీ, నాటి ఏపీ కాంగ్రెస్ నేత, కేంద్రమంత్రి రఘురామయ్య ల పేర్లు వినిపిస్తాయి. వీరు సంజయ్ గాంధీ చెప్పులు మోశారనే పేరుంది. వీరిలో తివారీ ఆ తర్వాత ఎన్నో ఉన్నత పదవులను చేపట్టారు.
మరి నయా కాంగ్రెస్ పార్టీ తరహాలో తయారైన బీజేపీలో ఇప్పుడు చెప్పులు మోసే నేతలు వీడియోలకు చిక్కుతున్నారు. ఈ తరహాలో వార్తల్లోకి ఎక్కిన తెలంగాణ బీజేపీ చీఫ్ ఈ దెబ్బతో ముఖ్యమంత్రి అభ్యర్థి అయిపోయినట్టే అనే టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకూ బండి సంజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలో ఏవైనా సందేహాలు ఉన్నా.. ఇక వాటిని విస్మరించవచ్చని, అమిత్ షా చెప్పులు మోతతో ఆయన సీఎం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అమిత్ షా ను ఈ రేంజ్ లో ప్రసన్నం చేసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు లేరని, ప్రస్తుతం కమలం పార్టీ రాజకీయాలను బట్టి బండి సంజయ్ కు అవకాశాలు చాలా మెరుగయ్యాయని కమలం పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. తాము కూడా సీఎం రేసులో అనుకున్న నేతలు, ఇప్పుడు బండి సంజయ్ పట్ల కుతకుతలాడుతున్నారు. అయితే చెప్పుల మోతతో పార్టీ పరువు పోయే విషయాన్ని మాత్రం కమలం పార్టీ నేతలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు!