భారతీయ జనతా పార్టీ విధానాలే హిందుత్వవాదం అనుకుంటే, ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకే తలపోటుగా మారుతున్నారు కొంతమంది కాషాయధారులు. ఎంతలా అంటే.. చివరకు బీజేపీనే వీరిని భరించలేక సస్పెన్షన్ వేటు వేస్తోంది. బీజేపీ నేతలింతే ఇలానే మాట్లాడతారు… అని జనాలే సర్దుకుపోతున్న వేళ బీజేపీ మాత్రం ఎంతో కొంత దిద్దుబాటు చర్యలకు దిగుతుండటం గమనార్హం.
ఇటీవలే నుపూర్ శర్మ వ్యవహారంలో అంతర్జాతీయ స్థాయి ఒత్తిళ్లను ఎదుర్కొంది కేంద్ర ప్రభుత్వం. ఆమె చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నుపూర్ వ్యాఖ్యల అనంతర పరిణామాల పట్ల సుప్రీం కోర్టు కూడా ఆమెకు చీవాట్లు పెట్టింది. ఆమెకు రక్షణ కల్పించాలని చెబుతూనే, ఆమె వ్యాఖ్యల వల్ల కొందరు అమాయకుల ప్రాణాలు పోయాయంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక నుపూర్ ను బీజేపీ సస్పెండ్ చేసింది. అదే వేడిలో అదే తరహా వ్యాఖ్యలు చేసిన మరో నేతపై కూడా వేటు వేసింది. ఇక ఇప్పుడు రాజాసింగ్ వంతు. ఈ గోషామహల్ ఎమ్మెల్యే ఉద్రిక్తతలను రేపేలా మాట్లాడటం కొత్తం కాదు. ఇది వరకే రాజాసింగ్ వ్యవహారంలో బీజేపీ నేతల మద్దతు కరువైంది. రాజాసింగ్ తన మానాన తను వీరలెవల్లో రెచ్చిపోతూ వచ్చారు.
చివరకు ఆయనను సస్పెండ్ చేసి కమలం పార్టీ బరువు దింపుకుంది. ఒకవైపు సస్పెండ్ చేస్తూనే మరోవైపు వివరణ ఇచ్చుకునే అవకాశం అయితే ఇచ్చినట్టుగా ఉన్నారు. అయితే తీవ్రఅతివాద కాషాయవాదం ద్వారా తమకు నష్టం జరుగుతోందని కమలం పార్టీ అధిష్టానం కొంత స్పష్టతతోనే ఉన్నట్టుంది.
నుపూర్ విషయంలో అయినా, రాజాసింగ్ విషయంలో అయినా ఒకే తరహా నిర్ణయం తీసుకుంది. మరి వీరలెవల్లో రెచ్చిపోయే కాషాయధారులు ఇక కాస్త కంట్రోల్ అవుతారేమో!