బాలీవుడ్ లో యశ్ రాజ్ ఫిల్మ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చే వాళ్లకు అదే పెద్ద సానుకూలాంశం! యశ్ రాజ్ సినిమాలంటే భారీతనం వాటిల్లో ఉట్టిపడుతుంది. వాటి ప్రమోషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. వాటిల్లో స్టార్లకు కొదవ ఉండదు. అలాంటి సినిమాల ద్వారా ఎంట్రీ అనేది సినిమాల్లో నటించాలనుకునే వారికి అదృష్టం అనేది చిన్నమాట!
తమ సినిమాల్లో అనామకులకు, ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని వారికి అవకాశాలను ఇవ్వడంలో కూడా యశ్ రాజ్ బ్యానర్ సర్వత్రా సిద్ధంగా ఉంటుంది. స్టార్లతో సినిమాలు చేస్తూనే సినీనేపథ్యం లేని కుర్రాళ్లను హీరోలుగా, అనామక అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఉంటుంది ఈ నిర్మాణ సంస్థ. అయితే ఆ సంస్థ తమ ద్వారా పరిచయం అయ్యే వారికి ప్రధానంగా ఒక కండీషన్ పెడుతుంది. తొలి సినిమా అవకాశం ఇస్తూనే.. ఆ తర్వాతి రెండు సినిమాల్లో ఆ బ్యానర్ మీదే నటించాలి. ఇదే యశ్ రాజ్ సంస్థ పెట్టే ప్రధానమైన కండీషన్.
ఈ షరతు మేరకు ఈ బ్యానర్ ద్వారా ఇంట్రడ్యూస్ అయిన వారు పని చేస్తారు. అనుష్కా శర్మ, రణ్ వీర్ సింగ్ కూడా ఈ షరతులకు లోబడి పని చేశారు. వీరికి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చినా.. ఆ తర్వాత వీరు షరతులకు కట్టుబడి యశ్ రాజ్ సినిమాల్లోనే నటించారు. ఇలాంటి వారిల్లో ఒకరు వాణీ కపూర్ కూడా! ఎప్పుడో దశాబ్దం కిందటే ఈమెను యశ్ రాజ్ వాళ్లు ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇప్పటి వరకూ వాణీ స్టార్ కాలేకపోయింది!
విశేషం ఏమిటంటే.. ఈమెను యశ్ రాజ్ వారు ఇప్పటికీ వదలడం లేదు! మొదటి సినిమా శుద్ధ్ దేశీ రొమాన్స్, ఆ తర్వాత ఆహాకల్యాణం, ఆ పై బేఫిక్రే ఈ సినిమాలతో దాదాపు వీరి కాంట్రాక్ట్ పూర్తి అయ్యింది. వీటిల్లో మూడో సినిమాలో వాణీ రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. అయినా ఫలితం దక్కలేదు పాపం!
విశేషం ఏమిటంటే ఈమె స్టార్ కాలేకపోయినా ఆదిత్య చోప్రా మాత్రం వదలడం లేదసలు. మూడు సినిమాల కాంట్రాక్ట్ కాస్తా ఐదు సినిమాలను పూర్తి చేసుకుంది. వార్, ఆ పై ఇటీవలి షంషేరా సినిమాలతో యశ్ రాజ్ బ్యానర్ పైనే ఐదు సినిమాలు పూర్తి చేసుకుంది వాణి. అయితే ఐదో సినిమా డిజాస్టర్ అయ్యింది. బయటి బ్యానర్లపై ఒకటీ రెండు అవకాశాలు వచ్చాయి. అవి కూడా ఈమెను స్టార్ ను చేయలేకపోయాయి.
అయితే ఆదిత్య చోప్రా మాత్రం వాణీని వదిలేలా లేడు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే టాక్ కూడా గతం నుంచి ఉన్నదే. ఆదిత్య రెండో పెళ్లి తర్వాత కూడా వాణీతో డేటింగ్ అనే టాక్ ఉంది. హిట్లు, కాంట్రాక్ట్ తో సంబంధం లేకుండా వాణీకి ఆదిత్య ప్రోత్సాహం ఇలా కొనసాగుతూ ఉన్నట్టుంది!