రాధేశ్యామ్..ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా. కనీసం ఓ అప్ డేట్ ఇవ్వండి బాబూ అని ప్రభాస్ ఫ్యాన్స్ దీనంగా సోషల్ మీడియాలో వేడుకునేలా చేస్తున్న సినిమా. కానీ అటు నిర్మాతలు కానీ ఇటు డైరక్టర్ కానీ పెదవి విప్పితే ఒట్టు.
హీరో ప్రభాస్ సంగతి సరేసరి. రాధేశ్యామ్ ను పక్కన పెట్టి కొత్త సినిమాలు చేసుకుంటున్నారు. అసలు ఇంతకీ ఏమిటి ఈ రాధేశ్యామ్ పరిస్థితి. అసలు ఈ ఏడాది విడుదల వుంటుందా?
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం రాధేశ్యామ్ షూటింగ్ ఇంకా కనీసం మరో పది రోజులు వుంది. ఈ పదిరోజుల షూట్ కూడా హీరో ప్రభాస్ కు సంబంధించినదే. ఈ పది రోజుల షూట్ ఈ నెలాఖరులోగానా, ఆగస్టు నెలాఖరులోగానా అన్నది తేలాల్సి వుంది. అక్కడితో షూట్ పార్ట్ అవుతుంది. అసలు కథ వుంది.
రాధేశ్యామ్ సినిమా కు బోలెడు విఎఫ్ఎక్స్ వర్క్ కీలకం. సినిమా అంతా దీని మీదే ఆధారపడి వుంటుంది. ఇప్పటికి యాభై శాతం మాత్రమే విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. అంటే ఇంకా యాభై శాతం వర్క్ వుంది. మరి దీనికి ఎంత సమయం పడుతుందన్నది ఓ సమస్య.
వర్క్ సంగతి అలా వుంచితే విడుదల డేట్ అన్నది ఇంకా పెద్ద సమస్య. బాలీవుడ్-టాలీవుడ్ సినిమాల విడుదలలు చూసుకుంటూ డేట్ వేసుకోవాలి. టాలీవుడ్ లో అంటే ఓకె. కానీ బాలీవుడ్ లో డేట్ దొరకడం అంత వీజీ కాదు. అక్కడ చాలా రూల్స్ వ్యవహారాలు వుంటాయి.
ఇవన్నీ చూస్తుంటే 2021 లో రాధేశ్యామ్ వస్తుందా? అన్నది చిన్న అనుమానం.