హుజూరాబాద్ …మామా అల్లుళ్లకు సవాల్

తెలంగాణలో మాట్లాడుకోవాల్సిన ముచ్చట్లు ఎన్ని ఉన్నా జనమైనా, రాజకీయ నాయకులైనా ఇప్పుడు మాట్లాడుకునే ముచ్చట ఒక్కటే. అదే హుజూరాబాద్ ఉప ఎన్నిక. మామూలుగా ప్రతిపక్షాలను తేలిగ్గా తీసిపారేసి మాట్లాడే ముఖ్యమంత్రి ఎన్నికలొస్తే మాత్రం ప్రతిపక్షాల…

తెలంగాణలో మాట్లాడుకోవాల్సిన ముచ్చట్లు ఎన్ని ఉన్నా జనమైనా, రాజకీయ నాయకులైనా ఇప్పుడు మాట్లాడుకునే ముచ్చట ఒక్కటే. అదే హుజూరాబాద్ ఉప ఎన్నిక. మామూలుగా ప్రతిపక్షాలను తేలిగ్గా తీసిపారేసి మాట్లాడే ముఖ్యమంత్రి ఎన్నికలొస్తే మాత్రం ప్రతిపక్షాల కదలికలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. జనరల్ ఎలక్షన్స్ కావొచ్చు, ఒక్క ఉప ఎన్నిక కావొచ్చు … రెండింటిని కూడా సీరియస్ గానే తీసుకుంటారు కేసీఆర్.

ఆయన దృష్టిలో సాధారణ ఎన్నికలకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో, ఉప ఎన్నికకు అంతే ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని ఉప ఎన్నికలను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా అలాంటిదే. ఇది ఒక ఎమ్మెల్యే చనిపోవడంవల్ల లేదా మరో కారణంతోనో జరుగుతున్న ఉప ఎన్నిక కాదు. ఈ ఉప ఎన్నికను కేసీఆర్ ఏరికోరి తెప్పించారు. 

ఈటల మీద ఎప్పుడైతే వేటు వేశారో అప్పుడే ఉప ఎన్నిక వస్తుందని ఆయనకు తెలుసు. అందుకే ఈటల మీద వేటు వేసినప్పటి నుంచే సీఎం వ్యూహ రచన మొదలు పెట్టి ఉంటారు. ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం ప్రధానం కాదు. 

కేసీఆర్ ఆయన్ని బీజేపీ అభ్యర్థిగా చూడటం లేదు. తన శత్రువుగా చూస్తున్నారు. తనకు ద్రోహం చేసిన వ్యక్తిగా చూస్తున్నారు. ఈటలను టార్గెట్ చేసే పనిని మొదటి నుంచి తన మేనల్లుడు కమ్ మంత్రి అయిన హరీష్ రావుకే అప్పగించారు కేసీఆర్. ఉప ఎన్నిక బాద్యతను కూడా పూర్తిగా హరీష్ కే అప్పగించారు. తాను పైనుంచి సూపర్ వైజ్ చేస్తున్నారు.

వ్యూహ రచన మొత్తం కేసీఆర్ చూసుకుంటున్నారు. ఆయన ఏ రోజుకా రోజు నివేదికలు తెప్పించుకుంటున్నారు. హుజూరాబాద్ పార్టీ నేతలతో తానే నేరుగా మాట్లాడుతున్నారు. వారిని ప్రగతి భవన్ కు పిలిపించుకొని మంతనాలు జరుపుతున్నారు. యాభై మంది ఓటర్లకు ఒక ఇంచార్జిని పెట్టాలని అనుకుంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కృష్ణా జలాల వివాదానికి కూడా ఈ ఉపఎన్నికే కారణమంటున్నారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అప్పటి ఉప ముఖ్యమంత్రి కమ్ ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్యను పదవి నుంచి తీసేశారు. అందుకు కారణాలేమిటో ఇప్పటికీ సరిగ్గా ఎవరికీ తెలియదు. కానీ పదవి తీసేయగానే రాజయ్య గమ్మున ఉండిపోయాడు. దాంతో ఆయనకు మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే అయ్యాడు.  

ఈటల కూడా గమ్మున ఉంది ఉంటే ఎలా ఉండేదో. కానీ తిరుగుబాటు చేశాడు. ధిక్కరించాడు. కేసీఆర్ దృష్టిలో ద్రోహిగా మిగిలాడు. అతను ఉప ఎన్నికలో మటాష్ అయిపోవాలన్నదే కేసీఆర్ లక్ష్యం. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నిక మామా అల్లుళ్లకు సవాలే.