టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై అదే పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి గురించి అసలు తన దగ్గర మాట్లాడొద్దని మీడియాకు సూచించడం విశేషం. కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కోమటిరెడ్డి ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కిషన్‌రెడ్డిని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.
తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి ఖిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవి రాని నేపథ్యం లో కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి కొనసాగడంపై అనుమానాలు వ్యక్తం అవుతుండడం, మరోవైపు బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలవడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను కాంగ్రెస్‌లోనే ఉంటాననని స్పష్టం చేశారు. పార్టీ మారే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. తన దృష్టిలో పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్థమైన నేత లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ చిన్నపిల్లవాడని, ఆయన గురించి తన దగ్గర మాట్లాడొద్దని మీడియా ప్రతినిధులను కోరారు.
మల్కాజ్‌గిరిలో 40 డివిజన్లలో పార్టీ డిపాజిట్ కోల్పోయిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నియోజకవర్గ స్థాయి నేతలు తప్ప.. వైఎస్సార్ లాంటి నేతలు లేరని ఆయన అనడం గమనార్హం. రాజకీయాలపై మాట్లాడనని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన కోరారు.
ప్రజాసమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతానని ఆయన అన్నారు. తెలంగాణ వ్యక్తిగా కిషన్‌రెడ్డికి భువనగిరి కోట విశిష్టత తెలుసునన్నారు. ప్రత్యేక తెలంగాణలో రాష్ట్ర సర్కార్ కోట అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు. దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో కలిసిపోయాయని అన్నారు. ఇప్పటికైనా పట్టించుకోకుంటే భువనగిరి కోట కూడా అలాగే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.