రాయలసీమ ఎప్పటికీ ఎడారిగా ఉండేందుకు టీడీపీ కుట్రలకు తెరలేపింది. ఇందుకు తాజాగా సీఎం వైఎస్ జగన్కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖే నిదర్శనం. ఇలాంటి చర్యలతో తమ పార్టీకి సీమలో శాశ్వత సమాధి కడతారని ఆ ప్రాంత టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
చంద్రబాబునాయుడికి తెలియకుండా సీమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా సీఎంకు లేఖ రాసే అవకాశమే లేదని రాయలసీమ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ లేఖతో సీమలో టీడీపీకి ఇక శాశ్వత సమాధే అని హెచ్చరిస్తున్నారు
రాయలసీమ ఎత్తిపోతలపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొత్త సమస్యను క్రియేట్ చేసేందుకు కుట్రలకు తెరలేపారు. ఇందులో భాగంగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేయడంపై రాయలసీమ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్కు లేఖ రాశారు.
‘శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ, సీమ ఎత్తిపోతల వల్ల జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుంది. పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్పైనే ఆధారపడ్డాయి. శ్రీశైలం నిండకుండా ప్రాజెక్టులు కడితే మా పరిస్థితేంటి? గుంటూరు ఛానల్ దగ్గుబాడు వరకు పొడిగించి పొలాలకు నీళ్లివ్వాలి. రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంపు విషయంలో పునరాలోచించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
కొన్ని శతాబ్దాలుగా రాయలసీమ పొలాలు సాగునీటికి నోచుకోలేదు. ఆ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు, కరవు రక్కసిని పారదోలేందుకు చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించేందుకు చంద్రబాబు సరికొత్త ఎత్తులు వేశారని రాజకీయ ఉద్యమకారులు మండిపడుతున్నారు.
తాను రాయలసీమకు నీళ్లు తీసుకురాకపోగా, తెలంగాణ వాదనకు బలం చేకూర్చేలా ప్రకాశం జిల్లాలోని తన పార్టీ ఎమ్మెల్యేలతో లేఖలు రాయించడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది.