ఉన్నదున్నట్టు మాట్లాడే సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈసారి టాలీవుడ్ హీరోలపై సెటైర్లు వేశారు. టాలీవుడ్ లో జనరేషన్ మారిన ప్రతిసారి టెక్నాలజీ మారుతోంది కానీ, హీరోల్లో మాత్రం మార్పు కనిపించడం లేదన్నారు. వస్త్రధారణ మారుతోంది కానీ జ్ఞానం మాత్రం రావడం లేదంటూ పంచ్ లేశారు.
“ఇప్పటి హీరోలకు సాధన తక్కువైంది, వాదన ఎక్కువైంది. హీరోలకు జ్ఞానం పెరగాలి. విజ్ఞానం పెంచుకుంటున్నారు, జ్ఞానం పోగొట్టుకుంటున్నారు. మైక్ పట్టుకుంటే ఒక్కడు కూడా తెలుగులో మాట్లాడడు. గౌరవ మర్యాదలు ఇవ్వడం తగ్గించేశారు. అప్పటికీ ఇప్పటికీ వేసుకునే బట్టల్లో మార్పొచ్చింది కానీ జ్ఞానం మాత్రం పెరగలేదు. డబ్బులున్న ప్రతి ఒక్కడు హీరో అయిపోతున్నాడు. నటించాలనే కసి మాత్రం ఉండడం లేదు.”
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై మరోసారి స్పందించారు కోట. అసోసియేషన్ లో గొడవలు నిన్నమొన్న స్టార్ట్ అవ్వలేదంటున్నారు. గతంలో తను ట్రెజరర్ గా పనిచేసినప్పుడే గొడవలు జరిగాయని, అప్పుడే ఓ నమస్కారం పెట్టి ఆ పోస్ట్ నుంచి తప్పుకున్నానని, తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. 'మా'లో గొడవలు ఎప్పుడూ ఉంటాయని, అంతమాత్రానికి మీడియాకెక్కడం సరికాదన్నారు.
“మా అసోసియేషన్ ఎన్నికలు దేశానికి సంబంధించిన వ్యవహారం కాదు. మహా అయితే 450 మంది సభ్యులు ఓటేస్తారు. వాళ్ల కోసం మైక్ పట్టుకొని మాట్లాడ్డం ఏంటి? ఏదైనా మాట్లాడాలనుకుంటే అధ్యక్షుడికి ఉత్తరం రాయాలి. మీటింగ్ లో మాట్లాడాలి. అంతేతప్ప ప్రెస్ మీట్ పెట్టి టీవీలో మాట్లాడితే, అసోసియేషన్ లో కష్టాల్ని టీవీలు తీరుస్తాయా?”
ఒకప్పుడు చిత్ర పరిశ్రమ తల్లి పాలతో సమానమని, ఇప్పుడు డబ్బా పాలుతో సమానమని అన్నారు కోట. ఇండస్ట్రీలో ఎవరికి వారు తమ స్వార్థం చూసుకుంటే, అతి త్వరలోనే రాష్ట్రంలో సినిమా హాళ్లన్నీ కల్యాణ మండపాలుగా మారిపోతాయని హెచ్చరించారు.