తెలంగాణలో బీజేపీ ప్రత్యర్థులకు తాజాగా దొరికిన ఆయుధం పాదరక్షలు (చెప్పులు). మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడో షెడ్యూల్ రాకుండానే, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ క్షేత్రస్థాయిలో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నాయి. ప్రతి చిన్న అవకాశాన్ని కూడా గెలుపునకు వాడుకుంటున్నాయి. ప్రత్యర్థులను బద్నాం చేసేందుకు ఏ చిన్న అంశం దొరికినా ఉతికి ఆరేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్కు బీజేపీ తాజాగా ఓ ఆయుధాన్ని అందించింది. ఆ ఆయుధమే పాదరక్ష అయిన చెప్పు.
మునుగోడుకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం వచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అమిత్ షా దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన అమిత్‌షాకు బండి సంజయ్ పాదరక్షలు అందించారు. ప్రస్తుతం ఇదే తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వీడియో ప్రత్యర్థులకు చిక్కింది. ఇక సోషల్ మీడియా వేదికగా ఆత్మాభిమానం నినాదంతో బీజేపీని టీఆర్ఎస్, కాంగ్రెస్ చెడుగుడు ఆడుకుంటున్నాయి. అమిత్‌షాకు బండి సంజయ్ చెప్పులు అందించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ముందుకు తెచ్చి బీజేపీని ఓ రేంజ్లో విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందన ఏంటంటే…
‘ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని- తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉంది. జై తెలంగాణ!’అని ఆయన ట్వీట్ చేశారు. అలాగే సదరు వీడియోను కూడా పోస్టు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ బానిస రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని మండిపడ్డారు. అమిత్ షా చెప్పులను బండి సంజయ్ మోశారన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ, షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బానిసత్వాన్ని బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ఇదే అంశాన్ని రానున్న కాలంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధాన ఎన్నికల అస్త్రంగా వాడుకోనున్నాయి. తెలంగాణ ఆత్మాభిమాన నినాదం తప్పకుండా ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.