జనసేన పార్టీకి ఎన్ని స్థానాల్లో బలముంది?

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు -బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తు ఉందా? కేవలం ఏపీలోనే ఉందా? తెలియడంలేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికీ వారే ప్రకటనలు…

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు -బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తు ఉందా? కేవలం ఏపీలోనే ఉందా? తెలియడంలేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికీ వారే ప్రకటనలు చేస్తున్నారు. 

తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రభుత్వాన్ని ఓడించే శక్తి బీజేపీకే ఉందని అన్నారు. బీజేపీ -జనసేన కూటమి ఓడిస్తుందని అనలేదు. అంటే పొత్తు లేనట్లు అర్థం చేసుకోవాలా? పవన్ కూడా ఎన్నికలకు సంబంధించి మాట్లాడినప్పుడు బీజేపీ ప్రస్తావన లేకుండానే మాట్లాడతాడు. పొత్తు ఉందో లేదో ఆ రెండు పార్టీలు ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేదు. 

సరే … ఆ విషయం అలా పక్కనుంచితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ తాజాగా చెప్పాడు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేద్దామని తన పార్టీ నాయకులు కోరినా తాను వద్దని చెప్పానని అన్నాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీ చేస్తుందని అన్నాడు. దీన్నిబట్టి తెలంగాణలో జనసేన ఇంకా సజీవంగానే ఉందనుకోవాలా?

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నాయకులు జనసేన మద్దతు అడిగినట్లు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ను ప్రచారం చేయాల్సిందిగా కూడా కోరలేదు. గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లోనే పవన్ పార్టీ పోటీకి దిగినప్పుడు బీజేపీ బలవంతంగా మాన్పించింది. అప్పట్లో పవన్ కు కోపం కూడా వచ్చింది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ ఎందుకు చెప్పాడో అర్థం కావడంలేదు. 

ఇన్నేళ్ళలో రాష్ట్రంలో జనసేన కార్యకలాపాలు, కార్యక్రమాలు జరిగిన దాఖలాలు లేవు. సభలు, సమావేశాలు జరిపినట్లు లేదు. పవన్ కూడా తెలంగాణ సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై గళమెత్తలేదు. ఆయనకు ఏపీలో అధికారంలోకి రావాలనే యావ ఉందిగానీ తెలంగాణ మీద ధ్యాస లేదు. కానీ తెలంగాణ అసెంబ్లీలోనూ పార్టీ ప్రాతినిధ్యం ఉండాలనుకుంటున్నాడేమో.

అందుకే పోటీ చేస్తానంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి బలం లేదని పవన్ కు తెలుసు. అందుకే బలం ఉన్న స్థానాల్లో పోటీ చేస్తామంటున్నాడు. పార్టీకి బలమున్న నియోజకవర్గాలేమిటో ఆయన చెప్పగలడా? మాటవరసకు అన్నాడేమో. తెలంగాణలో పుట్టి పెరిగిన టీడీపీయే కనుమరుగైపోయి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు జనసేన పార్టీ పోటీ చేసి గెలవగలదా? టీడీపీ కీలకమైన నాయకులంతా ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ కొన్ని ప్రాంతాల్లో కేడర్ ఇప్పటికీ బలంగానే ఉంది. టీడీపీ మీద అభిమానం మిగిలివుంది. 

అయినప్పటికీ ఆ పార్టీకి దిక్కు లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కూడా పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో జనసేనకు ఎలాగూ బీజేపీతో పొత్తు లేదు కాబట్టి టీడీపీ -జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాయా? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కాబట్టి దేన్నీ కాదనలేం.