బీజేపీకి నాలుగైదు శాతం ఉన్న కమ్మ వాళ్లేనా? దాదాపు 14% శాతం ఓటు బ్యాంక్ కలిగిన కాపులు వద్దా? అనే చర్చకు తెరలేచింది. జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా భేటీ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనసేనాని పవన్‌కల్యాణ్ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా కాపాడుకుంటామని ఏపీలోని పలు కాపు, బలిజ సామాజిక వర్గ సంఘాలు బహిరంగంగానే ప్రకటించాయి. 2024 ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పార్టీ జనసేనకే తమ సంపూర్ణ మద్దతు వుంటుందని ఆయన సామాజిక వర్గ సంఘాలు తేల్చి చెప్పాయి.
బీసీల తర్వాత ఏపీలో అత్యధిక ఓటు బ్యాంకు ఎవరిదంటే… అది పవన్ సామాజిక వర్గమే. జనసేనను కాపులను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. రాయలసీమలో వారిని బలిజలంటారు. వారంతా జనసేనను సొంత పార్టీగా భావిస్తారు. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. వైసీపీని రెడ్డి, టీడీపీని కమ్మ సామాజిక వర్గాలు సొంతం చేసుకున్నట్టే, మెజార్టీ కాపులు కూడా అదే రీతిలో ఆలోచిస్తున్నారు.
అయితే సామాజిక వర్గంలో అధికారంపై నమ్మకాన్ని కలిగించడంలో పవన్ ఫెయిల్ అయ్యారు. అందుకే ఆయనకు ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. ఇప్పటికీ కాపుల్లో భయం అదే. పవన్‌పై వ్యక్తిగతంగా అభిమానం ఉన్నప్పటికీ, చంద్రబాబుకు తాకట్టు పెడతారనే ఆందోళన బలంగా ఉంది. జనసేనను అధికారంలోకి తెచ్చుకోవాలనే ఆకాంక్ష కంటే, వైసీపీ అధినేత జగన్‌ను గద్దె దించాలని, అలాగే చంద్రబాబును సీఎం సీటులో చూడాలనే పట్టుదల పవన్‌లో కనిపిస్తోందన్నది నిజం.
ఈ ధోరణే పవన్ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందనేది జగమెరిగిన సత్యం. పవన్‌తో పొత్తు పెట్టుకుంటే ఆయన సామాజిక వర్గ, సినీ అభిమానుల ఓట్లు కలిసొస్తాయని బీజేపీ భావించింది. అయితే పవన్ నాయకత్వంపై బీజేపీకి రోజురోజుకూ నమ్మకం సడలుతోంది. దీంతో ఆయన్ను పట్టించుకోవడం తగ్గించారు. కనీసం బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్ కూడా దొరకడం కష్టమైంది.
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ కావడం పలు రకాల చర్చకు దారి తీసింది. మునుగోడులో ఉప ఎన్నికలో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, అలాగే కమ్మ సామాజిక వర్గ నేతల మద్దతు పొందొచ్చని బీజేపీ భావనగా ప్రచారం జరుగుతోంది. గతంలో మంచు మోహన్‌బాబు ఫ్యామిలీని కూడా ప్రధాని అభిమానంగా దగ్గర తీసుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినీ ప్రముఖులకు మాత్రం విపరీత ప్రాధాన్యం ఇస్తూ, మిత్రపక్షంగా ఉన్న పవన్‌ను మాత్రం అసలు పట్టించుకోవడం ఏంటని ఆయన సామాజిక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తమపై బీజేపీ అగ్రనాయకత్వ వివక్షను గమనిస్తున్నామని, కేవలం రాష్ట్ర నాయకత్వ బాధ్యతల్ని అప్పగించి, మిగిలిన విషయాల్లో అవమానించేలా వ్యవహరించడం ఏంటనే నిలదీత ఎదురవుతోంది. రాజకీయాలన్నీ కులాల సమీకరణలు అయిన నేపథ్యంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారనేది నిజం.