కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో టాలీవుడ్ ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ భేటీపై జూనియర్ ఎన్టీఆర్ ఆత్మీయుడు, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్‌కు బలమైన రాజకీయ నేపథ్యం ఉండడమే చర్చకు దారి తీసింది. నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ప్రయోజనం లేదనుకుంటే నిమిషం కూడా ఎవరితోనూ మాట్లాడరన్నారు.
బీజేపీని విస్తరించే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీకి ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఉపయోగించుకునేందుకే అమిత్‌షా సమావేశం అయ్యారని భావిస్తున్నట్టు కొడాలి నాని తెలిపారు.
ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలోపేతం చేసుకోడానికి అమిత్‌షా ప్రయత్నిస్తున్నారన్నారు. పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని ఆయన కీలక కామెంట్ చేశారు.
చంద్రబాబుతో ప్రయోజనం లేకే ఢిల్లీ వెళ్లినా మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని కొడాలి అన్నారు. అమిత్‌షాతో తన ఆప్తుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంపై కొడాలి నాని స్పందించడం విశేషం. కొడాలి, వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్ ఎంతో సన్నిహితులని అందరికీ తెలుసు. ఆ మధ్య నారా భువనేశ్వరిపై వల్లభనేని ఘాటు వ్యాఖ్యలు చేసినప్పుడు మిత్రుడికి ఎందుకు హితవు చెప్పలేదని కొందరు టీడీపీ సీనియర్ నాయకులు నిలదీశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ నోరు మెదపలేదు.
కొడాలి నాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లడం వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనే ప్రచారాన్ని కొట్టి పారేయలేం. మిత్రుడి రాజకీయ అడుగులపై కొడాలి స్పందించడం వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే చర్చకు తెరలేచింది.