మోదీకి నచ్చితే మంత్రి.. నచ్చకపోతే గవర్నర్

మోదీకి నచ్చిన వాళ్లు మంత్రి పదవుల్లో ఉంటారు, నచ్చకపోతే గవర్నర్లుగా వెళ్లిపోతారు. ఇదీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్. అవును.. ఆమధ్య తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ పెద్దాయన పొలిటికల్ హవాకి చెక్…

మోదీకి నచ్చిన వాళ్లు మంత్రి పదవుల్లో ఉంటారు, నచ్చకపోతే గవర్నర్లుగా వెళ్లిపోతారు. ఇదీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్. అవును.. ఆమధ్య తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ పెద్దాయన పొలిటికల్ హవాకి చెక్ పెట్టేందుకు ఆయన్ను పేద్ద పదవిలోకి బలవంతంగా పంపించారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇద్దరు కేంద్ర మంత్రుల్ని అట్నుంచి అటే గవర్నర్లుగా పంపించేశారు.

కేంద్ర మంత్రి మండలి విస్తరణకు ఒకరోజు ముందు థావర్ చంద్ గహ్లాత్ కు గవర్నర్ పదవి ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. పరోక్షంగా ఆయన మంత్రి పదవి ఊడిందనే సంకేతం పంపారు. కేబినెట్ విస్తరణ తర్వాత కాస్త నొచ్చుకున్న ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని తాజాగా తమిళనాడు గవర్నర్ గా నియమించారు. దీంతో మోదీకి నచ్చకపోతే గవర్నర్లుగా పంపిస్తారనే విషయం తేలిపోయింది.

రాజ్యాంగ పదవులతో రాజకీయ క్రీడ..

రాజకీయ నాయకులకు గవర్నర్ పోస్టులు ఇవ్వడం కాంగ్రెస్ తోనే మొదలైంది. గతంలో రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్న నాయకులను గవర్నర్లుగా నియమించేవారు. మర్రిచెన్నారెడ్డి మాత్రం పొలిటికల్ ఫామ్ లో ఉండగానే గవర్నర్ గా వెళ్లారు, ఆ తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు, మళ్లీ గవర్నర్ గా వెళ్లారు. 

ఇలా ఆయన రాజకీయ, రాజ్యాంగ పదవుల్ని సైమల్టేనియస్ గా అలంకరించి సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. దానికి కారణం ఇందిరా గాంధీ రాజకీయమేనని వేరే చెప్పక్కర్లేదు. ఆ తర్వాత మాత్రం రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నవారినే గవర్నర్ పదవులు వరించేవి. మోదీ జమానాలో అది పూర్తిగా రివర్స్ అయింది.

ఎన్డీఏ తొలి విడతలో బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రిగా తప్పించి వెంటనే గవర్నర్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీఏ-2లో ఏకంగా ఇద్దరు కేంద్ర మంత్రులకు ఉద్వాసన పలికి నేరుగా గవర్నర్ పోస్ట్ లు కట్టపెట్టారు. గతంలో రాజకీయ పదవికి, రాజ్యాంగ పదవికి మధ్య కాస్త గ్యాప్ అయినా ఉండేది. ఇప్పుడు మోదీ అలాంటి మోహమాటాలకు పోవడంలేదు. మంత్రి పదవి నుంచి దింపెయ్, గ్యాప్ లేకుండా గవర్నర్ గా పంపెయ్ అంటున్నారు.

ఇలాంటి ఫక్తు రాజకీయ నాయకులు గవర్నర్ లుగా వెళ్తున్నారు కాబట్టే.. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సీఎం ఆఫీస్ కి రాజ్ భవన్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మోదీ కొత్త సంప్రదాయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.