ఆయన స్టాన్ స్వామి కావచ్చు, కాకపోవచ్చు. జెస్యూట్ ఫాదర్ కావచ్చు; బౌధ్ధ భిక్షువు కావచ్చు; సన్యసించిన హిందువు కావచ్చు. ఎవరయనా కావచ్చు. ఈ దేశ పౌరుడు. సాటి పౌరుల మధ్య జీవించాడు. వాళ్ళు సౌకర్యాల మధ్య జీవించిన పౌరులు కారు. చదవనేర్చిన పౌరులు అసలే కారు. ఈ దేశపు మట్టినీ, ఇక్కడి మొక్కనూ నమ్ముకున్న వారు. అనాదిగా నివాసముంటున్నవారు. ఆదివాసులని అందరిచేతా అనిపించుకుంటున్నవారు. అనే వాళ్ళూ గౌరవిస్తూ అనవచ్చు. అగౌరవిస్తూ అనవచ్చు. ఎలా అన్నా అందరి కన్నా ముందు పుట్టిన వారూ, ముందే ఈ మట్టిని తాకిన వారూ ఖరారు చేసినట్లే.
జార్ఖండ్ ఇప్పుడు రాష్ట్రం. ఎప్పుడూ ఆదివాసుల పుట్టినిల్లే. ఎవడి ఇంటినుంచి వాడిని పొమ్మంటే ఎలా వుంటుంది. ఆదివాసికి ఆడవే ఇల్లు. కానీ అక్కడికి, తుపాకులతో వచ్చేవాళ్ళు కొందరూ; తవ్వకపు యంత్రాలతో వచ్చే వారు కొందరూ. మావోయిస్టులూ వస్తారు, వాళ్ళని వెతుక్కుంటూ పోలీసులూ వస్తారు. ఈ ‘తుపాకుల’ వాళ్ళు, వాళ్ళ వాళ్ళ యుధ్దాలు వారు చేసుకుంటారు. అందుకు అడవిని యుధ్ధభూమిగా మారుస్తారు. ఈ ‘తుపాకుల’తో మాట్లాడారని వారూ, ఆ ‘తుపాకుల’ వారితో మాట్లాడారనీ వారూ, ఆదివాసుల గడ్డమీద కెళ్ళి పంచాయితీలు పెడతారు.
‘ఇన్ఫార్మర్’ అనో, ‘సానుభూతి పరుడనో’ అనుమానంతో దొరికిన ఆదివాసీనీ, దొరికినట్లు మట్టుపెట్టేవాళ్ళొకరూ, పట్టుకుపోయి జైళ్ళపాలు చేసే వారొకరు. ఇరువరి వల్లా వాళ్ళకీ ఇన్నేళ్ళలో ఒరిగిందేమీ లేదు. ఆదివాసీ తల్లులకు పుత్రశోకాలు తప్ప. ఇక ‘త్రవ్వకాల’ వాళ్ళొస్తారు. ఆదివాసీ ఇళ్ళ కింద నేలను డొల్లచేస్తాడు. ఖనిజాలనో, గ్రానైట్లనో, రంగురాళ్ళనో తవ్వుకు పోతారు. ‘తుపాకుల’ వారు గుండెలకు గురి పెడితే, ‘తవ్వకాల’ వారు కడుపుకు గురిపెడతారు.
ఇటు తుపాకీ లేకుండా, అటు తవ్వకపు పనిముట్టూ లేకుండా లేకుండా, రిక్తహస్తాలతో వచ్చిన ఒకానొక సామాన్యుడు ఫాదర్ స్టాన్ స్వామి. అడవి అడవిలా, అమ్మ అమ్మలా ఎందుకు లేదూ..? ఇదే ఆయన ప్రశ్న? ఇది తీవ్రాదులూ, మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు తీవ్రవాదులూ, ఇంకా ముఖ్యంగా మావోయిస్టులూ మాత్రమే వేస్తారని ఎవరికి ముందు అనిపించిందో తెలియదు కానీ, ఆయనకు కేసులు ఎదురొచ్చాయి. అందులో అతి పెద్దగా ‘ఎల్గార్ పరిషత్ కేసు’ అదే ‘భీమాకోరెగావ్’ హింస కేసు కూడా. ఈ కేసు పెట్టే సరికే ఆయనకు 80 ఏళ్ళు దాటిపోయాయి.
అప్పటికే ఈ కేసు మహరాష్ట్ర పోలీసుల సాక్షిగా పలు మలుపులు తిరిగింది. కానీ పెనుమలుపు మాత్రం కేంద్ర పరిశోధక సంస్థ ఎన్.ఐ.ఎ ప్రవేశం తో(24 జనవరి, 202న) జరిగిపోయింది. కేసు ఎంత పెద్దదో కోర్టులు తేలుస్తాయి కానీ, ఈ కేసులో వారు తయారు చేసి అభియోగ పత్రం మాత్రం 10 వేల పేజీలు. అందులో ఫాదర్ స్టాన్ స్వామి కూడా ముద్దాయిగా చేరిపోయాడు. స్టాన్ స్వామి మీద పెట్టిన అభియోగం: ‘కేంద్రంలో వున్న ఫాసిస్టు ప్రభుత్వాన్ని’ కూలద్రోయటానికి, దళిత, ముస్లిం శక్తులను దగ్గరకు చేర్చటానికి ప్రయత్నం చెయ్యటం. అంతే కాదు. ఫాదర్ స్టాన్ స్వామి మావోయిస్టులతో సంబధాలు కూడా వున్నాయని ఆరోపించారు. ఇంకేముంది, ఆయన్ని కోర్టుకు హాజరు పరచటమూ, ఆయన్ని ‘న్యాయ నిర్బంధం’ పేరు మీద జైలుకు పంపటం చకచకా జరిగిపోయాయి.
స్టాన్ స్వామికి అప్పటికే ఆరోగ్యం క్షీణించింది. ఆయనా తనపనులు తాను చేసుకోవటానికి ప్రయత్నించేవాడు. రాను, రాను నడవలేని స్థితికి చేరుకున్నాడు. అంతేకాదు. అప్పటికే ఆయనకి రెండు హెర్నియా సర్జరీలు అయ్యాయి. పార్కిన్సన్ వ్యాధి కారణంగా చేతులు నిరవధికంగా వణుకుతుంటాయి. నీళ్ళు గ్లాసుతో తీసుకుని తాగబోతే, గొంతులో పడవు. దానికి తోడు గుటక కూడా వెయ్యలేడు. కేవలం సిప్పర్ తో మాత్రమే తాగగలడు. ఈ స్థితిలో ఆయన (నవంబరు 2020లో) స్ట్రాతో పాటు సిప్పర్ అడిగారు. అడిగిన 20 రోజులకు ఎన్.ఐ.ఎ ‘ఇవ్వలేమ’ని కోర్టు కు చెప్పేసింది.
ఇక ఈ ఏడాది (2021) మే లో ఆయన వున్న తలోజా జైలులో కోవిద్ పరీక్షలు నిర్వహించారు. అప్పటికి ఆయనకు ‘నెగెటివ్’(లేదని) వచ్చింది. కానీ ఆరోగ్య స్థితి మరింత దిగ జారింది. జెజె ఆసుప్రతికి చూపించినట్లు చూపించి, తిరిగి జైలుకు తెచ్చేశారు. ఈలో ‘అనారోగ్య కారణం’గా తనకు మధ్యంతర బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ‘ఇవ్వకూడదంటూ, ఎన్.ఐ.ఎ వాదనలను వినిపిస్తూనే వుంది. ఆయన మీద ‘అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షెన్ యాక్టు( చట్టవ్యతిరేక కలాపాల నిరోధక చట్టం’ యుఎపిఎ) కింద కేసు వుండటానికి కారణంగా చూపిస్తూ బెయిలును అడ్డుకుంటూనే వున్నారు.
ఇక 2 మే నాడు నేరుగా బొంబాయి హైకోర్టు జోక్యం చేసుకుని, ఆయనను ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించాలని కోరినప్పుడు ఆయనను ‘హోలీ ఫ్యామిలీ హాస్పటల్’లో చేర్పించారు. అప్పటికే ఆయనకు ‘కోవిడ్’ ‘పాజిటివ్’ (వున్నట్లు) పరీక్షలో తేలింది. జూ 4ను పరిస్థితి విషమించటంతో ఆయనను వెంటిలేటర్ మీద వుంచారు. ఆ తర్వాత ఆయన గుండె పోటుకు గురయ్యారు. 5 జులై మధ్యాహ్నం 1.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
ఆయన మీద కేసు రాష్ట్ర పోలీసులు పెట్టవచ్చు; లేదా కేంద్ర పోలీసులు పెట్టవచ్చు. కానీ జార్ఖండ్ అడవుల్లో ఏం పనులు చేశారు? ఎవరికి కష్టం కలిగించారు? ఆదివాసుల పక్షాన నిలిచి ఆయన కొన్ని విషయాలకు చట్టబధ్దమైన పరిష్కారాలు కోరారు. ఆదివాసుల లేదా గిరిజన తెగల రక్షణ, సంక్షేమం, అభివృధ్ధి అనేవి చెయ్యటానికి వాళ్ళ కోణం నుంచి చూడాలి.
ఇందుకు భారత రాజ్యాంగం అయిదవ షెడ్యూలు లో ‘తెగల సలహా మండలి’ని ఏర్పాటు చేయలని చెబుతోంది. కానీ ఒక్క ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఆది ఆయన అడిగాడు. అలాగే ‘లాండ్ బ్యాంక్’ అని పేరు పెట్టి, అటవీ ప్రాంతంలోని భూములను ‘కార్పోరేట్ సంస్థలకు’ ఇవ్వటానికి చూస్తున్నారని అడ్డుకోబోయారు. ‘‘భూమిపై యాజమాన్యపు హక్కులంటే దానికింద వున్న ఉప ఖనిజాలు కూడా’ అని సుప్రీం కోర్టు తీర్పును ఆదివాసుల భూముల విషయంలో అమలు చేయండి అన్నారు. ఈయన కోరికలు ఏ వర్గాలకు కష్టాన్ని కలిగిస్తాయో వేరే చెప్పనవసరం లేదు.
కారణాలు ఏమయినా న్యాయ నిర్బంధంలో వుండగా నిండు ప్రాణం పోయింది. దేశంలో ఆదివాసుల మీద ఆవగింజంత సానుభూతి వున్నా ఈ మరణానికి కలవరపడ్డారు. ప్రపంచ హక్కుల వేదికలూ ఆశ్చర్య పోయాయి. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలూ, న్యాయవ్యవస్థా ఒక్కసారి ఆలోచించాలి: హక్కులు పౌరులందరికీ వుంటాయా? కొందరికే వుంటాయా?
సతీష్ చందర్