రానురాను బయోపిక్ కు అర్థం మార్చేస్తున్నారు తెలుగు మేకర్స్. ఆమధ్య ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. ఒకటి కాదు, ఏకంగా 2 భాగాలు తీశారు. కానీ అందులో ఏముంది? ఎన్టీఆర్ గెటప్పులు చూపించారు తప్ప, ఆయన జీవితాన్ని ఆవిష్కరించలేకపోయారు. పైపెచ్చు ఎన్టీఆర్ పై వచ్చిన వివాదాలు, కుటుంబ సమస్యల్ని కావాలని పక్కనపెట్టారు. అప్పుడది బయోపిక్ ఎలా అవుతుంది?
ఇప్పుడు దాసరి నారాయణరావు బయోపిక్ తీస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరి ఈసారైనా దాసరి జీవితాన్ని ఆవిష్కరిస్తారా? లేక బయోపిక్ పేరిట ''కొంతమందికి'' అనుకూలంగా తమ సినిమాను మార్చుకుంటారా..? అదే ఇప్పుడు ప్రధానమైన చర్చ.
దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. పరిశ్రమకు చెందిన ఎన్నో వివాదాల్ని ఒంటి చేత్తో పరిష్కరించిన వ్యక్తి ఆయన. చాలామంది చెబుతున్నట్టు లైట్ బాయ్ నుంచి స్టార్ హీరో వరకు ఎంతోమందికి ఆయన అందుబాటులో ఉండేవారు. నిజానికి దాసరి బయోపిక్ కు ముడి సరకు, మూలపదార్థం, మెయిన్ పిల్లర్ ఇదే. కానీ కేవలం దీని చుట్టూరా కథ నడుపుతామంటే మాత్రం అది బయోపిక్ అనిపించుకోదు. అప్పుడు దానికి ఇంకో పేరు పెట్టుకుంటే మంచిది.
దర్శకుడిగా ఎన్నో హిట్ సినిమాలు అందించారు దాసరి. హీరోల్ని పక్కనపెట్టి మరీ బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఘనత ఆయనది. కథలతో ఆయన చేసిన ప్రయోగాలు అన్నీఇన్నీ కావు. అవన్నీ బయోపిక్ లో చూపించాల్సిందే. చూపిస్తారు కూడా. మరి వివాదాల సంగతేంటి?
ఇండస్ట్రీలో కేవలం కొంతమంది హీరోలకు మాత్రమే దాసరి అందుబాటులో ఉన్నారని, వాళ్లకు ఫేవర్ గా కొన్ని పనులు చేశారనే విమర్శలున్నాయి. మరి వాటిని బయోపిక్ లో చూపిస్తారా? 80ల్లో ఓ పెద్ద హీరోతో ఆయనకు చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ ఇష్యూ సంగతేంటి? ఇక దాసరి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయన కుటుంబంలో కొన్ని కలహాలున్నాయి. కొడుకుల మధ్య పొరపొచ్చాలున్నాయి. బయోపిక్ అన్నప్పుడు ఇవి కూడా చూపించాలి. కుటుంబ గొడవల వల్ల ఆయన ఎంత మానసిక క్షోభ అనుభవించారో చెప్పాల్సిందే.
వీటితో పాటు రాజకీయ వివాదాలు, కుంభకోణం ఆరోపణలు, మీడియా హౌజ్ ఏర్పాటుచేయడం లాంటి అంశాల్ని కూడా స్పృశించాల్సిందే. దాసరి గొప్పదనంతో పాటు ఇవన్నీ కవర్ చేసినప్పుడు మాత్రమే అది సిసలైన బయోపిక్ అనిపించుకుంటుంది. లేదంటే ఎన్టీఆర్ బయోపిక్ కు, దాసరి బయోపిక్ కు పెద్ద తేడా కనిపించదు.