ఇల్లు కాలి ఒకడు బాధపడుతుంటే ఇంకోడు ఇంకెందుకో బాధపడుతున్నాడని సామెత. టాలీవుడ్ వ్యవహారం పాపం అచ్చం ఇలాగే వుంది. కరోనా ఫేజ్ వన్..టూ…పింక్..ఎల్లో ఇలా రకరకాల సమస్యలతో జనం సతమతం అవుతుంటే, సినిమా థియేటర్ల టికెట్ రేట్లు ఆంధ్రలో తగ్గించేసారని టాలీవుడ్ జనాలు కిందా మీదా అయిపోతున్నారు. సినిమాలు విడుదలకు రెడీగా వున్నాయి. కానీ విడుదల చేద్దాం అంటే టికెట్ రేట్లు అంతంత మాత్రంగా వున్నాయి. కింకర్తవ్యం?
సినిమా థియేటర్ల టికెట్ రేట్లు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోవడానికి అసలు సిసలు కారణం మాత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల వైఖరే తప్ప వేరు. కాదు. ఇది వాస్తవం. కాకులను కొట్టి గెద్దలకు వేసినట్లు, జనాలను పీల్చి పిప్పి చేసి, కలెక్షన్లు లాగేసి తీసుకెళ్లి హీరోల ముందు కుమ్మరించే వ్యవహారం ప్రారంభించడమే దీనికి కారణం. మెగాస్టార్ టాప్ హీరోగా చిరకాలం వున్నా ఈ సమస్య రాలేదు. బాలయ్య, నాగ్, వెంకీ ఇలా వీరంతా ఎవరి లెవెల్ రెమ్యూనిరేషన్ వారు తీసుకున్నా కూడా ఇలాంటి వ్యవహారం రాలేదు.
కానీ ఈ జనరేషన్ టాప్ హీరోల అత్యాశే ఈ పరిస్థితికి దారి తీసింది. హీరోల డేట్ ల కోసం నిర్మాతలు వెంపర్లాడడం, అందుకోసం భయంకరమైన పారితోషికాలు ఆఫర్ చేయడం. అది చూసి హీరోలు ఇంకా..ఇంకా అంటూ అత్యాశకు పోవడం. అలాగే కప్పాలు కట్టేసి, ఆ డబ్బుల వసూలు కోసం సినిమా టికెట్ ను యూనిఫారమ్ రేటు చేసి చిన్న చిన్న ఊళ్లలో కూడా రెండేసి వందలు వంతున కొల్ల కొట్టేయడం. ఇదేగా గత కొన్ని సంవత్సరాలుగా జరిగింది.
దీనివల్ల థియేటర్ యజమానులు బాగుపడ్డారా? లేదు. డిస్ట్రిబ్యూటర్లు లాభాలు చేసుకున్నారా? పెద్దగా లేదు. నిర్మాతలు లాభాలు పొగెట్టుకున్నారా? అదీ అంతగా లేదు. మరి బాగుపడింది ఎవరు? యాభై కోట్ల మేరకు రెమ్యూనిరేషన్లు పెంచేసుకున్న హీరోలు మాత్రమే. గత ఏడాది జనవరిలో సూపరు..డూపరు..బ్లాక్ బస్టర్ అన్న సినిమాకు నిర్మాతకు పది కోట్లు మిగిల్తే హీరోకు వెళ్లింది ముఫై అయిదు కోట్లు. అలా వుంటుంది వ్యవహారం. మరో సినిమాకు నిర్మాతకు ఆ మాత్రం కూడా రాలేదు. హీరోకు మాత్రం వెళ్లింది యాభై కోట్లు.
ప్రభుత్వం ఉదాసీనత, అధికారుల అవసరాలు, అన్నీ అడ్డం పెట్టుకుని, కోర్టుల ద్వారా రేట్లు తెచ్చుకోవడం అనే సులువైన మార్గం కనిపెట్టి, వారం వారం ఇదే కార్యక్రమంగా పెట్టుకున్నారు. నిజానికి థియేటర్ యజమానులు 90శాతం మందికి ఈ వ్యవహారంతో సంబంధమే లేదు. వారి లెటర్ హెడ్ లు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర, లీజుదారుల దగ్గర వుంటాయి. అన్ని డాక్యుమెంట్లు చకచకా రెడీ చేసేయడం, కొర్టుకు వెళ్లి రేట్లు తెచ్చేసుకోవడం.
ఇంటిల్లిపాదీ వెళ్లి తొలివారంలోనే వెళ్లి సినిమా చూడాలంటే కనీసం రెండు వేలరూపాయలు కావాల్సిందే. కానీ అదే ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల గట్టిగా రెండు నుంచి అయిదు వందలు వుంటే చాలు. అంటే ప్రభుత్వం తీసుకున్న కొత్త టికెట్ రేట్ల నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు. అందులో సందేహం లేదు. సామాన్యుడికి చాలా ఊరట.
కానీ..అలా అని ఈ రేట్లు సబబేనా? అని ప్రశ్నించుకుంటే…కాదు అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వ్యవహారం అంతా కొండనాలుకు మందేస్తే వున్న నాలుక ఊడిపోయిందన్న చందంగా వుంది కాబట్టి. అడ్డగోలు టికెట్ రేట్ల దోపిడీకి అడ్డు కట్ట వేయాల్సిందే. అందులో సందేహం లేదు. అందుకోసం ఏకంగా థియేటర్ వ్యవస్థనే చంపేయాల్సినంత పని లేదు.
ప్రభుత్వానికి తెలియదా?
కొత్త టికెట్ రేట్లు ఫిక్స్ చేయడం అన్నది ఆదరాబాదరా హడావుడిగా చేయడం అన్నది ప్రభుత్వం చేసిన తప్పు. అందులో సందేహం లేదు. కొత్త టికెట్ రేట్లు ఫిక్స్ చేసే ముందు మినిమమ్ ఎక్సర్ సైజ్ జరగాల్సి వుంది. అసలు థియేటర్ల సీటింగ్ కెపాసిటీ ఎంత? ఖర్చు ఎంత? ఆదాయం ఎలా వుంటుంది? యావరేజ్ ఆక్యుపెన్సీ ఎలా వుంటుంది? అన్నవి అన్నీ మదింపు చేయాలి. ఆ తరువాత రేట్లు హేతుబద్దతతో ఫిక్స్ చేయాలి. కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా దున్నపోతు ఈనిందంటే గొడ్ల సావిట్లో కట్టేయమన్న చందంగా వ్యవహారం జరిగిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు లాక్కో లేక లేక పీక్కోలేక కిందా మీదా అవుతున్నారు.
ఒక థియేటర్ నిర్వహణ వ్యయం అన్నది ప్రభుత్వానికి తెలియంది కాదు. ఎందుకంటే ఆస్తిపన్ను విధించేది ప్రభుత్వం. విద్యుత్ చార్జీలు విధించేది ప్రభుత్వం. మినిమమ్ వేజెస్ నిర్ణయించేది ప్రభుత్వం. జిఎస్టీ శాతం డిసైడ్ చేసేది ప్రభుత్వం. మళ్లీ ఎమ్మార్పీలకే అమ్మాలని హుకుం జారీ చేసేది ప్రభుత్వమే. అందువల్ల థియేటర్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందన్నది ప్రభుత్వానికి తెలియంది కాదు.
ఫంక్షన్ హాళ్లకు అస్సలు అనుమతి అక్కరలేదు. లైసెన్స్ అక్కరలేదు. నిబంధనలు ఏమీ లేవు. కానీ 12 గంటలకు ఇంత వంతున వాళ్లకు నచ్చినట్లు ఫిక్స్ చేసుకుంటారు. కానీ అదే థియేటర్ అయితే మాత్రం సవాలక్ష నిబంధనలు. పంక్షన్ హాళ్లకు ఏడాదికిలో మహా అయితే 60 రోజులు బుకింగ్ లు వుండడానికి అవకాశం వుంది. థియేటర్ కు వారానికి ఇంత అని 52 వారాలకు ఆదాయం వుంటుంది. అందుకే చాలా థియేటర్లు ఇప్పుడు పంక్షన్ హాళ్లు గా మారిపోతున్నాయి.
ప్రభుత్వ ఉదాసీనత
చిరకాలంగా థియేటర్ వ్యవస్థను ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేసింది. టికెట్ రేట్లను స్ట్రీమ్ లైన్ చేయకుండా కావాలనే వదిలేసింది అనుకోవాలి. అలా వదిలేయడం వల్లనే థియేటర్ల టికెట్ రేట్లు కోర్లు గుమ్మాలు ఎక్కాయి. ఆ అవకాశం ఇచ్చింది ప్రభుత్వమే. పైగా మారుతున్న కాలానికి అనుగుణంగా థియేటర్ షో ల సంఖ్య మార్చడం అలాగే టికెట్ రేట్లు స్ట్రీమ్ లైన్ చేయడం వంటి పనులు చేపట్టలేదు.
ఒకప్పుడు రోజుకు మూడు ప్రదర్శనలే వుండేవి. శని, ఆదివారాలు నాలుగు షో లు వుండేవి. శుక్రవారం సినిమా విడుదల అయితే మూడు రోజుల పాటు నాలుగు షో లు వేసుకునే అవకాశం వుండేది. రాను రాను నాలుగు షోల అవకాశం దొరికింది. మల్టీ ఫ్లెక్స్ లకు ప్రదర్శన వేళలు వాటికి అవే ఫిక్స్ చేసుకునే అవకాశం లభించింది. మరి సింగిల్ స్క్రీన్ లకు ఆ అవకాశం ఎందుకు వుండదు.
కొత్త సినిమాలు విడుదలయితే రేట్లు, వేళలు లోకల్ అధికారులు చేతులు తడిపేసి మార్చుకునే థియేటర్లు ఎన్నో వున్నాయి. ఇవన్నీ ఇలా అలవాటుగా సాగిపోతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసినా చూసి చూడనట్లు వదిలేస్తూ వచ్చింది. అన్నింటికి మించి థియేటర్ల దగ్గర టాక్స్ ఎగ్గొట్టే వ్యవహారం ఎక్కువగా జరుగుతోందనే ఆరోపణలు ఎప్పటి నుంచో వుంది. నట్టి కుమార్ లాంటి ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఈ విషయం మీద ఏనాటి నుంచో మొత్తు కుంటున్నారు.
థియేటర్ల లెక్కలు టైట్ చేస్తే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని నట్టి కుమార్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ ఇలా పన్ను ఎగ్గొట్టే వాళ్ల వెనుక వున్న పెద్దలకు ప్రభుత్వంతో వున్న సంబంధాల కారణంగా అటు దృష్టి పెట్టలేదు. నట్టి కుమార్ లాంటి వాళ్ల గోల అరణ్య రోదనే అయింది.
ఇప్పుడేంటి పరిస్థితి?
ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం పూర్తిగా థియేటర్ల మీద దృష్టి పెట్టాలి. థియేటర్లకు కావాల్సిన వెసులుబాట్లు ఇవ్వాలి. అలాంటి సమయంలోనే ఈ పన్ను ఎగవేత మీద దృష్టి పెట్టాలి. అవసరం అయితే సినిమా టికెట్ ల ఆన్ లైన్ వ్యవస్థను కంట్రోల్ లోకి తీసుకోవాలి. దాని ద్వారా అన్ని జాఢ్యాలు సమసిపోతాయి. ఎంత వస్తోంది..ఎంత పోతోంది..ఫేక్ కలెక్షన్లు..బ్లాక్ మనీ ఇలా అన్నీ మాయం అయిపోతాయి.
సరైన కమిటీ వేసి, సమగ్ర అధ్యయనం చేయించి, హేతుబద్దమైన రేట్లు ఫిక్స్ చేయాలి. అంతే కానీ తొచిన అంకెలు వేసి, తాంబూలాలు ఇచ్చేసాం..తన్నుకు చావండి అనే టైపులో వ్యవహరించడం సరి కాదు. పలాస, పొద్దుటూరు, చాలా ఊళ్లలో ఇరవై, ముఫై రూపాయలకే సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకుంటే ఆ థియేటర్లలో పార్కింగ్ రేటునే ఇరవై రూపాయలు వుంటుంది. అంటే టికెట్ రేట్లు హేతుబద్దంగా నిర్ణయించలేదనే కదా అర్థం.
ప్రభుత్వానికి దూరంగా
టాలీవుడ్ వైపు నుంచి కూడా తప్పిందం వుంది. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీ గద్దె దిగిపోయాక, ఆంధ్ర ప్రభుత్వంతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది టాలీవుడ్ అని ఓ విమర్శ వుంది. తెలంగాణ ప్రభుత్వం విషయంలో, ప్రభుత్వ పెద్దల విషయంలో విపరీతమైన భయభక్తులతో వ్యవహరిస్తున్న సినిమా హీరోలు, జనాలు ఆంధ్ర ప్రభుత్వం అంటే మాత్రం అంటీ ముట్టనట్లు వున్నారు.
ఇక్కడ ఓ ట్వీటు పడితే పది రీ ట్వీట్ లు, ఇక్కడ ఓ మాట కాకితో కబురందితే డజన్ల కొద్దీ ట్వీట్లు. అక్కడ సిఎమ్ జగన్ స్వయంగా గాయకుడు ఎస్పీబీ కి భారతరత్న ఇవ్వాలని ట్వీటు వేసినా, రీట్వీట్ చేసే హీరో లేరు.
ప్రభుత్వం-పరిశ్రమ అన్నాక ఇచ్చి పుచ్చుకోవాలి. ప్రభుత్వానికి తగిన మర్యాద ఇవ్వాలి. పరిశ్రమకు కావాల్సిన ప్రోత్సాహం ఇవ్వాలి. ఇలా జోడు గుర్రాల స్వారీ సాగాలి కానీ ప్రభుత్వంతో తమకేమి పని అన్నట్లు వుండకూడదు. గతంలో తెలుగు దేశం ప్రభుత్వం వుండగా ఇదే పరిశ్రమ ఎలా బిహేవ్ చేసిందన్నది గుర్తు తెచ్చుకోవాలి.
కింకర్తవ్యమ్..?
ఇప్పుడు బాల్ మొత్తం ఎగ్జిబిటర్ల కోర్టులోకి తోసేసారు. సమస్య థియేటర్ల వారిది అన్నట్లు ఇండస్ట్రీ వ్యవహరిస్తోంది. లీజు మొత్తాలు తగ్గించేయాలని చూస్తున్నారు. కానీ టికెట్ రేట్ల వల్ల తమకే సమస్య అని నిర్మాతలకు తెలియంది కాదు. కానీ ఎగ్జిబిటర్లను ముందుకు తోసి, ప్రభుత్వం దగ్గరకు పంపించి తాము తెరవెనుక వుండాలనే నిర్మాతలు సినిమా పెద్దలు చూస్తున్నారు. ఎగ్జిబిటర్లు కిందా మీదా పడి రేట్లు తెచ్చుకు వస్తే మళ్లీ హీరోల జేబులు నింపేయచ్చు.
అందుకే ఎగ్జిబిటర్లు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు. మరీ ఎక్కువ రేట్లు కావాలని కోరడం లేదు. ఇప్పుడు వచ్చిన కొత్త రేట్లు చాలా వరకు సరిపోతాయని, కొన్నింటిని సవరిస్తే చాలు అని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఎందుకంటే రేట్లు వందలు,వేలు అయినా వారి లీజు రేట్లు మారడం లేదు కదా. అందుకే మున్సిపల్ కార్పొరేషన్ల పరిథిలో కొత్త రేట్లను పది నుంచి యాభై రూపాయల రేంజ్ లో మాత్రమే పెంచాలని కోరుతున్నారు.
మున్సిపాల్టీ లెవెల్ లో పది రూపాయల నుంచి ఇరవై రూపాయల రేంజ్ లో పెంచితే చాలని కోరుతున్నారు. నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ల్లో మాత్రం కాస్త యాభై రూపాయల రేంజ్ లో పెంచాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇవ్వాళ కార్పొరేషన్ అయినా పల్లెటూరు అయినా కూడా థియేటర్ల సోకులు,సదుపాయాలు దాదాపు ఒకే మాదిరిగా వున్నాయి.
గంట కట్టేదెవరు?
అంతా బాగానే వుంది. ఏ సినిమా హీరో కూడా ముందుకు రావడం లేదు. నిర్మాతలకు ఎవరి ద్వారా సిఎమ్ దగ్గరకు వెళ్లాలో తెలియడం లేదు. సిఎమ్ జగన్ కు వివరంగా చెప్పగలిగిన వారు ఎవ్వరు అన్నది తెలియడం లేదు. చిరు, నాగ్ వంటివాళ్లు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, సమావేశాలు పెట్టడం లేదు. గిల్డ్ సమావేశం అవుతున్నా డిస్కస్ చేయడం తప్ప చేయగలిగింది కనిపించడం లేదు.
కొందరు సిఎమ్ దగ్గర ఈ విషయం ప్రస్తావించినా ఆయన నుంచి సానుకూల సమాధానం రావడం లేదని తెలుస్తోంది. ఒకవేళ జగన్ దృష్టికి తీసుకెళ్లగలిగినా, ఇప్పటికిప్పుడు రేట్లు సవరిస్తారన్న నమ్మకం లేదు. కమిటీ వేయడం అన్నది జరిగే అవకాశం వుంది.
అదే జరిగితే కమిటీ నివేదిక ఇవ్వాలి. దాని మీద మంత్రి వర్గ ఉపసంఘం, ఆపై దాని సిఫార్సులు ఇలా చాలా వ్యవహారం చాలా వుంటుంది. కానీ అప్పటి లోగా చాలా సమయం గడచిపోతుంది. అందుకే ఇండస్ట్రీ ఓ తాటిపైకి వచ్చి, బేషజాలు హీరోయిజాలు పక్కన పెట్టి, ప్రభుత్వం దగ్గరకు వెళ్లాల్సిందే. థియేటర్లను కాపాడాల్సిందే. లేదూ అంటే ఓటిటి ప్లాట్ ఫారమ్ ల కారణంగా ఎప్పుడో పదేళ్ల తరువాత థియేటర్ల హవా తగ్గడం కాదు. ఇప్పుడే ఆ పరిస్థితి దాపురించే ప్రమాదం వుంది.
విఎస్ఎన్ మూర్తి