చాలాకాలం తర్వాత.. పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన తెచ్చారు. ఆయన ఒక చేతగాని రాజకీయ నాయకుడు అని అర్థం వచ్చేలా తన సుదీర్ఘ వ్యాఖ్యానం వినిపించారు. ఆయన వైఫల్యాలను చాలా విపులంగా గుర్తు చేశారు. ఇదంతా ఎందుకంటే.. తాను రాజకీయాల్లోకి ఎందుకు అడుగు పెట్టాడో సమర్థించుకోవడానికి. తన అన్నయ్య చిరంజీవికి చేతకాలేదు గనుకనే.. ఆయన తప్పు చేశాడు గనుకనే ఆయన చేసిన తప్పును సరిదిద్దడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానంటూ పవన్ కల్యాణ్ చెప్పుకున్నారు.
తిరుపతిలో జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్ కల్యాణ్ రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ప్రజలనుంచి వారి కష్టాలు విని వారి వినతిపత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అందులో మళ్లీ యధావిధిగా తాను ఏ కులానికి చెందిన వాడిని కాదని, కొన్ని కులాలకే అధికారం దక్కుతోందని కులాల గురించి బోలెడంత ఊదరగొట్టారు. అలాగే.. 2014లో తొలిసారిగా చంద్రబాబు పల్లకీ మోయాల్సిన అవసరం ఎలా ఏర్పడిందో వివరించాడు.
అప్పట్లో నరేంద్రమోడీ దేశానికి ప్రధాని కావాల్సిందే అని పవన్ బలంగా అనుకున్నారట. అయితే రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పదేపదే సంప్రదించినా.. కనీసం మాట్లాడలేదట. చివరికి మోడీ స్వయంగా.. మేం టీడీపీతో పొత్తుపెట్టుకున్నాం అన్నాక.. చంద్రబాబు తన ఆఫీసుకు వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తే మద్దతిస్తానని చెప్పి.. అలా చేశారట. ఎన్నికల్లో పోటీచేయకుండా చంద్రబాబు పల్లకీ మోయాలంటే.. తమ కార్యకర్తలకు గౌరవం కావాలని పట్టుబట్టారట. ఇదేదో గౌరవం అడిగినట్లుగా లేదు.. కార్యకర్తలందరికీ ప్యాకేజీ అడిగినట్లుగా ఉంది! మొత్తానికి ఈ మాటద్వారా.. అప్పట్లో టీడీపీకి మద్దతు ఎందుకిచ్చినట్లో పవన్ బయటపడ్డారని ప్రజలు అనుకుంటున్నారు.
పవన్ తన సొంత ఘనతను ఎలా చెప్పుకున్నా, తనకు దక్కిన ప్యాకేజీలకు ఏ రంగు పూసుకున్నా బాగానే ఉండేది. కానీ మధ్యలోకి పాపం మెగాస్టార్ చిరంజీవిని కూడా లాక్కువచ్చారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఉండాల్సిందిట. ప్రజాదరణను (?) మనం నిలబెట్టుకోలేక, తెలుగుదేశాన్ని రానీయకపోవడంతో గందరగోళం ఏర్పడిందట. ఆ రకంగా చిరంజీవి చేసిన తప్పును సరిదిద్దడానికి పవన్ బేషరతుగా దేశం జెండా మోశాడట.
2009 ఎన్నికల్లో చిరంజీవి పార్టీ వచ్చినప్పుడు.. చాలా మంది ఆదరించారట. అయితే అప్పుడు వాళ్లు వైఎస్ కుటుంబానికి కోవర్టులుగా మారారని, తర్వాత మంత్రిపదవులు కూడా అనుభవించారని ఆడిపోసుకున్నారు.
పవన్ కల్యాణ్ మాటలు నిజమే అనుకుంటే.. ప్రజారాజ్యం పార్టీలో మొదటి కోవర్టు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. విలీనం వలన అతిపెద్ద పదవి పొందింది చిరంజీవి మాత్రమే. కానీ తాను విఫల రాజకీయ నాయకుడిని అనే స్పృహ చిరంజీవికి పూర్తిగా ఉంది. అందుకే ఆయన గుట్టు చప్పుడు కాకుండా.. మళ్లీ రాజకీయాల ఊసెత్తకుండా, అందరితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి రాజకీయ చేతగాని తనాన్ని ఆయన బర్త్ డే సందర్భంగా గుర్తు చేస్తున్నట్లుగా, ఆయనను ప్రపంచంలో అందరికంటె ఎక్కువగా ప్రేమిస్తుంటానని చెప్పుకునే తమ్ముడు.. ఈ విమర్శలు చేయడం విశేషం.