మెగాస్టార్, తన అన్న చిరంజీవిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవమానించారని రెండు రోజులుగా పవన్‌కల్యాణ్ కొత్త పల్లవి అందుకున్నారు. ఎప్పుడేం మాట్లాడ్తారో బహుశా పవన్‌కల్యాణ్‌కు కూడా స్పష్టత వుండదేమో! కడప, తిరుపతి జిల్లాల పర్యటనల్లో జనసేనాని బలంగా చేసిన విమర్శ వైసీపీ ఆధిపత్య ధోరణితో అందర్నీ అవమానిస్తోందని.
తన అన్న చిరంజీవి చేతులెత్తి వేడుకునేలా జగన్ చేశారని, నమస్కారానికి కనీసం ప్రతినమస్కారం కూడా చేయని సంస్కారం ముఖ్యమంత్రిదని పవన్ ఘాటు విమర్శలు చేశారు. “ఎంత పెద్ద హీరోలైనా మా దగ్గరికి నడుచుకుంటూ రావాలనుకున్నదే మీ ఆధిపత్య ధోరణి” అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి పవన్ అన్నారు.
అన్నకు అవమానం సరే… మీకు జరుగుతున్న పరాభవం గురించి గుర్తించడం లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటున్నా ఏడాదిన్నర కాలం నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాల అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వకపోవడం అవమానించడం కాదా? అని నెటిజన్లు పవన్‌ను నిలదీస్తున్నారు. మరోవైపు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీని ప్రధాని మోదీ ఢిల్లీకి, తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ను హైదరాబాద్ పర్యటనలో స్వయంగా తన దగ్గరికి అమిత్‌షా పిలిపించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించుకో పవన్‌కల్యాణ్ అని నెటిజన్లు హితవు చెబుతున్నారు.
ఈ పరిణామాలు జనసేన కార్యకర్తలు, సినీ అభిమానుల్ని అవమానించడం కాదా పవన్‌కల్యాణ్ అని ప్రశ్నిస్తున్నారు. మిత్రపక్షమైన బీజేపీ అగ్రనేతలు నిరాదరణ చూపడం మీ దృష్టిలో గౌరవించడమైతే… ఎవరికీ అభ్యంతరం లేదని నెటిజన్లు వ్యంగ్య కామెంట్స్ పెడుతున్నారు. వీపు వెనకాల మిత్రపక్షమైన బీజేపీ, అనధికార సన్నిహిత పార్టీ టీడీపీ చేసే అవమానాల గురించి ఆలోచించుకో పవన్ అని నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తుండడం గమనార్హం.
అవమానం జరిగితే అన్న చిరంజీవి చూసుకుంటారని, తమరు అనవసరంగా చింతించొద్దని హితవు చెబుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌కు విశేష ప్రాధాన్యం ఇవ్వడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ఇష్టమైన వాళ్లు అవమానిస్తే తియ్యగా వుంటుందేమో అని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.