జనసేనాని పవన్‌కల్యాణ్‌ను అలా సమాజంపై వదిలేస్తారా? పవన్‌కల్యాణ్ అపార అజ్ఞానంపై చివరికి జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇతర పార్టీలు ఖుషీ అవుతున్నాయి. ఇలాంటి అజ్ఞాని మనకు ప్రత్యర్థి కావడమే మంచిదైందని వైసీపీ ఆనందిస్తోంది. తిరుపతిలో పవన్‌కల్యాణ్ రాజకీయ అభిప్రాయాల్ని వింటే ఎవరికైనా పిచ్చెక్కుతుంది. ఆయన ఏమన్నారంటే…
‘ఒక కులానికి గంపగుత్తగా అమ్మేస్తున్నారంటూ జనసేనపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను టీడీపీకి కానీ వైసీపీకి కానీ కొమ్ము కాయడానికి సిద్ధంగా లేను’
‘ఈ రోజు ఎవరితో పోటీ చేస్తాననేది నిర్ణయం తీసుకోలేదు. విధ్వంస రాజకీయాలు చేస్తున్నప్పుడు శత్రువులతోనూ కలుస్తాం. ఇందులో అనుమానానికి తావులేదు. వైసీపీ రాకూడదన్నదే మా విధానం’
‘వైఎస్ కుటుంబ కోవర్టుల వల్ల ప్రజారాజ్యం పార్టీని 2009లో నిలబెట్టుకోలేకపోయాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో కలవ కూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. 2014లో మూడో ప్రత్యామ్నాయం లేదు కాబట్టే అది కూడా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ కోరిక మేరకే చంద్రబాబుకు మద్దతిచ్చాను’
పైన పేర్కొన్న మూడు అభిప్రాయాలను కూడా నిన్నటి తిరుపతి పర్యటనలో ఒకే సమయంలో చెప్పినవే. టీడీపీ, వైసీపీ కొమ్ము కాయనని చెప్పింది ఆయనే. రానున్న ఎన్నికల్లో ఎవరితో పోటీ చేస్తాననేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటూనే, మళ్లీ శత్రువులతోనూ కలుస్తామని ప్రకటించారు. వైసీపీ రాకూడదన్నదే తన పార్టీ విధానమని తేల్చి చెప్పారు. నరేంద్ర మోదీ కోరిక మేరకే 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చామని ఆయన సెలవిచ్చారు. మోదీ చెబితేనే మద్దతు ఇచ్చానని చెబుతున్నప్పుడు ఇక మీకెందుకు చంద్రబాబు గౌరవం ఇవ్వాలి? అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? కొత్తగా పార్టీ పెట్టిన నాయకుడికి సొంత ఎజెండా, అభిప్రాయాలు ఉండవా?
మూడు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాల్ని ఒకే సమయంలో వెల్లడించిన పవన్‌కల్యాణ్ మానసిక స్థితిపై ఎవరికైనా అనుమానాలొస్తే తప్పెవరిది? శత్రువులతోనైనా కలుస్తామంటే…. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు వుంటుందని అనుకోవాలా? మరి టీడీపీ, వైసీపీ కొమ్ము కాయడానికి తాము లేమనే మాటలెందుకు? మొదటి నుంచి తమరు టీడీపీ కొమ్ము కాస్తున్న మాట నిజమే కదా? ఎక్కడైనా ఒక పార్టీకి తాము అధికారంలోకి రావాలనే ఆశయం వుంటుంది.
అదేంటోగానీ, పవన్‌కల్యాణ్‌కు మాత్రం వైసీపీని అడ్డుకోవడమే ఎజెండాగా మారింది. ఇదెక్కడి విడ్డూరం అయ్యా! చివరికి సొంత పార్టీ వాళ్లు కూడా అసహ్యించుకునేలా పార్టీని నడుపుతున్న పవన్‌కల్యాణ్‌ను ఏమనాలో వారి విచక్షణకే వదిలేద్దాం. మొత్తానికి ఆయన మానసిక స్థితి మాత్రం బాగాలేదని పవన్ మాటలే చెబుతున్నాయి. ఆయన్ని అలా వదిలేస్తే జనసేన సంగతి అటుంచితే, సమాజానికి, రాజకీయానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతుందనే భయాందోళన వ్యక్తమవుతోంది.