ఈటల విషయంలో కేసీఆర్ తొలి విజయం ఇదే!

టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్ ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తారని అందరూ ఆశించారు. కొత్త పార్టీ పెడతారని, రాష్ట్రవ్యాప్తంగా కలియదిరుగుతారని, టీఆర్ఎస్ వ్యతిరేక శ్రేణుల్ని తనతో కలుపుకొని వెళ్తారని,…

టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్ ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తారని అందరూ ఆశించారు. కొత్త పార్టీ పెడతారని, రాష్ట్రవ్యాప్తంగా కలియదిరుగుతారని, టీఆర్ఎస్ వ్యతిరేక శ్రేణుల్ని తనతో కలుపుకొని వెళ్తారని, అసంతృప్త నాయకులందర్నీ ఒకే వేదికపైకి తెచ్చి, కేసీఆర్ ని ఢీకొడతారని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు జరిగింది, జరుగుతోంది వేరు.

ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిన ఈటల.. కేసీఆర్ దెబ్బకి గల్లీ నాయకుడైపోయారు. బీజేపీలో చేరడం ద్వారా ఈటల పరిధి హుజూరాబాద్ కి మాత్రమే ఫిక్స్ అయింది. త్రిముఖ పోరులో అసలు ఈటల గెలుపుపై కూడా సందేహాలు ముసురుకుంటున్నాయి. ఒకరకంగా ముందు జాగ్రత్తతో ఈటల ఇల్లిల్లూ తిరుగుతున్నారు. హుజూరాబాద్ లో ఈటల ఓడిపోతే.. ఒకరకంగా ఆయనకది రాజకీయ సమాధే. కేసీఆర్ వ్యతిరేకులెవరూ ఇకపై ఈటల చేసిన సాహసం చేయకపోవచ్చు.

వాస్తవానికి టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయి ఉన్న అతికొద్దిమంది నేతల్లో ఈటల రాజేందర్ కూడా ఒకరు. కరీంనగర్ జిల్లాలో బలమైన బీసీ నేత కావడం ఆయనకు మరో ప్లస్ పాయింట్. ప్రస్తుతం టీఆర్ఎస్ లో హవా చూపిస్తున్న చాలామంది, గతంలో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల్లో ఉంటూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మసలుకున్నవారే. అలాంటి మచ్చ ఈటలపై లేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి, వచ్చిన తర్వాత తన హక్కుగా మంత్రి పదవి సాధించుకున్నారు.

అలాంటి ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయనను ఓ రాష్ట్ర నాయకుడిలా చూశారంతా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా, అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఈటల రాజేందర్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు కూడా. కానీ రోజు రోజుకీ ఆయన పరిధి తగ్గిపోతూ వచ్చింది. అలా తగ్గించేశారు కేసీఆర్.

ఈటలపై కబ్జాకోరు అనే ముద్రవేసి, ఆయన్ను నైతికంగా దెబ్బకొట్టారు కేసీఆర్. హుజూరాబాద్ లో బీసీ, హైదరాబాద్ లో రెడ్డి అంటూ.. మరో వివాదాన్ని సృష్టించారు. బీసీ మంత్రులంతా కరీంనగర్ ని టార్గెట్ చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తల్ని నయానో భయానో బెదిరించి మరీ ఈటల వైపు వెళ్లకుండా చేశారు. సొంత పార్టీ పెట్టి కేసీఆర్ కి పోటీగా నడిపే సత్తా తనకు తానే లేదని ఈటల డిసైడ్ అయ్యేలా చేసి, ఈటలను సింగిల్ గా నిలబెట్టారు కేసీఆర్.

కేసీఆర్ వ్యూహాలకు భయటపడే అనివార్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కండువా కప్పుకోవాల్సి వచ్చింది రాజేందర్. అక్కడితో ఈటల రాష్ట్ర నాయకుడనే ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పడింది. బీజేపీలో ఉన్న శతకోటి నాయకుల్లో ఒక నాయకుడు ఈటల రాజేందర్ అనే పేరు పడిపోయింది.

రాష్ట్ర పర్యటనలతో అలజడి రేపిన కేసీఆర్, నిధుల వరద పారిస్తూ, ఉద్యోగాల ప్రకటనలిస్తూ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. హుజూరాబాద్ లో బలమైన అభ్యర్థి లేకపోయినా టీఆర్ఎస్ గెలుస్తుందనే సీన్ క్రియేట్ చేశారు. అందులోనూ 2018లో ఈటల ప్రత్యర్థి, అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ హంగామా కూడా మొదలైంది.

2018 ఎన్నికల్లో హుజూరాబాద్ లో కాంగ్రెస్ ది రెండోస్థానం, బీజేపీది మూడో స్థానం. దీంతో ఈటలకు గెలుపై అనుమానం మొదలైంది. అందుకే ఇల్లిళ్లూ తిరుగుతున్నారు. ఊరూరా కుటుంబంతో కలసి ప్రచారం మొదలు పెట్టారు. కేసీఆర్ కి పోటీగా రాష్ట్ర నాయకుడవటం తరవాత సంగతి, ముందు ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తున్నారు ఈటల. ఒకవేళ ఈటల ఓడిపోతే మాత్రం కేసీఆర్ కి ఎదురెళ్లి తనకు తానే రాజకీయ సమాధి కట్టుకున్నట్టు లెక్క.