జనసేనాని పవన్‌కల్యాణ్, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజకీయ పోరాటంలో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాజకీయ శూన్యత లేని చోట రాజకీయ పార్టీ పెట్టి మహామహులతో కలబడి నిలబడి తన ఉనికి చాటుకోవాలని ఓ మహిళ పోరాటం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇదే పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే …2014లో రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ, ఇతర పార్టీల ప్రయోజనాల కోసం తనను తాను బలి పెట్టుకున్న పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని దశాబ్దాలుగా రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల నేతలు మాత్రమే అధికారాన్ని పంచుకుంటున్నారు. ఆ రెండు అగ్రవర్ణ సామాజిక నేతల అధికారాలకు పల్లకీలు మోసే బోయీలుగా మిగిలిన సామాజిక వర్గాల ప్రజలు, నేతలు మారిన పరిస్థితి. సహజంగానే ఆ రెండు సామాజిక వర్గాల నేతల వ్యవహార శైలితో కాపులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు విసిగిపోయి ఉన్నాయి. ఎంతసేపూ వారి రాజకీయ , అధికార ప్రయోజనాల కోసమే తప్ప, తమకు పవర్ అనేది అందని ద్రాక్షేనా అనే అసంతృప్తి, అసహనం ఆయా సామాజిక వర్గాల్లో బలంగా ఉంది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఆవిర్భవించిన ప్రజారాజ్యం 18 శాతం ఓటు బ్యాంకును దక్కించుకుని కొద్దోగొప్పో సీట్లను కూడా సాధించింది. అయితే ఆ సీట్లు అధికార పీఠానికి దగ్గర చేయలేకపోయాయి. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణానంతరం… అధికారాన్ని నిలబెట్టేందుకు మాత్రం ప్రజారాజ్యం సీట్లు దోహద పడ్డాయి. అనంతర కాలంలో కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం అయ్యింది.
ఆ తర్వాత రాష్ట్ర విభజన, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్‌కల్యాణ్ నేతృత్వంలో జనసేన ఆవిర్భావం లాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేనను స్థాపించినప్పటికీ పవన్‌కల్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. ఆ రెండు పార్టీలు ఇటు ఏపీలో, అటు ఢిల్లీలో అధికారంలోకి వచ్చాయి. టీడీపీ, బీజేపీలను అధికారంలోకి తేవడం, జగన్ నేతృత్వంలోని వైసీపీని ప్రతిపక్షానికి పరిమితం చేయడంతో రాజకీయంగా తన లక్ష్యం నెరవేరిందనే సంతృప్తితో పవన్‌కల్యాణ్ రిలాక్ష్ అయ్యారు.
ఇలా నాలుగేళ్ల పాటు ప్రజలకు దూరంగా ఉండి, ఆ తర్వాత మరోసారి పవన్‌కల్యాణ్ కొత్త పాత్రలో తెరపైకి వచ్చారు. ఈ సారి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలవి మూడు దారులయ్యాయి. టీడీపీ, బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా, వామపక్షాలు, బీఎస్పీతో కలిసి జనసేన కూటమిగా ఏర్పడి 2019 ఎన్నికల బరిలో జనసేనాని తలపడ్డారు. అయితే చంద్రబాబు మనిషిగానే జనసేనానిని ప్రజలు చూశారు. మంగళగిరిలో పోటీ చేసిన లోకేశ్‌పై బలహీనమైన సీపీఐ అభ్యర్థిని జనసేనాని పొత్తులో భాగంగా నిలిపారు. అలాగే భీమవరం, గాజువాకలో రెండుచోట్ల పవన్‌కల్యాణ్ పోటీ చేయగా, చంద్రబాబు కనీసం అటువైపు తొంగి చూడకపోవడంతో… ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనే అనుమానాలకు బలం చేకూర్చారు.
ప్రస్తుతం బీజేపీతో జనసేనాని పొత్తులో భాగంగా కలిసి ఉన్నారు. విభజన హామీలను మోదీ సర్కార్ నెరవేర్చలేదని ఒకప్పుడు హిందీ, ఇంగ్లీష్‌లో బహిరంగ సభల్లో గట్టిగా అరిచిన పవన్, ఇప్పుడే అదే పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం ఆయన రాజకీయ గందరగోళానికి, అపరిపక్వతకు నిదర్శనం. ఇప్పుడు సినిమా షూటింగ్‌లు లేని రోజుల్లో నాలుగైదు నెలలకు ఒకసారి పార్టీ నేతలతో మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు.
అప్పుడప్పుడు మెరుపు తీగలా మీడియా ముందుకొచ్చి …తన రాజకీయ సిద్ధాంతాలు భిన్నమైనవని, తాను అందరి నాయకుడిలాంటి వాడిని కాదని, చేగువేరా స్ఫూర్తి అని, గద్దర్ పాటలకు మైమరిచిపోయానని, గుంటూరు శేషేంద్రశర్మ కవిత్వంతో మనసంతా ప్రేమను నింపుకున్నానని, ప్రజలంటే తనకెంతో ప్రాణమని… ఇలా ఏవేవో చెబుతారాయ.
తీరా ఆచరణలోకి వచ్చే సరికి తుస్సుమనిపించడం జనసేనాని లక్ష్యంగా కనిపిస్తోంది. పవన్ మాటలు వింటే ముద్దొస్తాయని, చేతలు చూస్తే కోపం వస్తుందని జనసేన నాయకులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఎన్నికలకు ఏడాది ఉందనగా చూసుకుందామనే ధోరణి ఆయనలో కనిపిస్తోంది. దీంతో ఏపీలో తన సామాజిక వర్గం బలంగా ఉన్నప్పటికీ కేవలం నమ్మకం కలిగించకపోవడంతో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా పవన్‌కల్యాణ్ ఎదగలేకపోయారు. దీంతో మరోసారి ఆ రెండు సామాజిక వర్గాలకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తారని నమ్మిన మిగిలిన సామాజిక వర్గాల్లో పవన్‌కల్యాణ్ తీవ్ర నిరాశ కలిగించారు.
ఇదే తెలంగాణలో ఇటీవల పార్టీ పెట్టిన షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా కేసీఆర్ పాలన లేదంటూ షర్మిల విమర్శలకు పదును పెట్టారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణలో అభివృద్ధి కనిపించకపోగా, అప్పులు మాత్రం అమాంతం పెరిగాయని విమర్శల బాణాలు సంధిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణకు చట్టప్రకారం దక్కాల్సిన చుక్క నీటిని కూడా వదులుకోమని స్వయాన తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను హెచ్చరించారు. అలాగే నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు దీక్ష చేపట్టారు. మున్ముందు నిరుద్యోగ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
రాజకీయాలను సీరియస్‌గా తీసుకున్న వారెవరైనా … పార్టీ పెట్టిన తర్వాత ఇలాగే చేస్తారు. తమ కోసం ఎవరితోనైనా కలబడుతారని నమ్మిన వాళ్లనే ప్రజలు ఆదరిస్తారు. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలను దక్కించుకోడానికి, పచ్చి తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన వైఎస్సార్ తనయ షర్మిల తపసు చేస్తుంటే, ఇదే పవన్‌కల్యాణ్ తనకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, సద్వినియోగం చేసుకోకపోవడం ముమ్మాటికీ ఆయన వైఫల్యమనే అభిప్రాయాలున్నాయి.
తెలంగాణలో షర్మిల అధికారాన్ని దక్కించుకుంటుందా? లేదా? అనేది తర్వాత ప్రశ్న. అందుకోసం ఆమె అనుసరిస్తున్న పోరాట, రాజకీయ పంథాను మాత్రం పవన్ స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో బలపడేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటే బాగుంటుదని జనసైనికులు అభిప్రాయ పడుతున్నారు. పవన్‌కల్యాణ్ గారు ఏమంటారో మరి!