తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్సార్‌టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల ఇక కార్యరంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ సమాజ ఆదరణ పొందేందుకు ఆమె శక్తివంచన లేకుండా శ్రమించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ సమాజాన్ని ప్రధానంగా పీడిస్తున్న నిరుద్యోగ సమస్యపై పోరాడేందుకు ఆమె పకడ్బందీ ప్రణాళికతో ముందుకు రానున్నారు.
ఖమ్మం బహిరంగ సభలో ప్రకటించినట్టు నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ఏప్రిల్ 15 నుంచి 72 గంటల పాటు షర్మిల దీక్షలో కూచున్నారు. అయినప్పటికీ కేసీఆర్ సర్కార్‌లో చలనం రాకపోవడంతో నిరుద్యోగ సమస్యపై పోరాటాన్ని ఉధృతం చేయడానికి ఆమె గట్టి నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగ యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పించేందుకు ప్రతి మంగళ వారం నిరుద్యోగ దీక్ష చేపట్టాలని షర్మిల నిర్ణయించారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తెలిపారు.
కేవలం ఎన్నికల సమయంలో వరాలు కురిపించే సంస్కృతిని మాని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్ కేలండర్ రూపొందించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ అవలంబిస్తున్న విద్యార్థి, ఉద్యోగ, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను తిప్పి కొడుతూ, బాధితులకు అండగా నిలిచేందుకు తమ నాయకురాలు ముందుకు రానున్నారని ఆమె చెప్పారు.