కృష్ణా జలాల వివాదంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో టీడీపీ దాదాపు కనుమరుగైనా… ఇంకా అక్కడేదో తన పార్టీ ఉన్నట్టు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వీడడం లేదు. గతంలో ఏపీ విభజన సమయంలో అనుసరించిన వైఖరినే మరోసారి బాబు పునరావృతం చేస్తున్నారు.
కృష్ణా జలాల విషయంలో విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని తెలిసినా …ఆ విషయమై నిజాయతీగా మాట్లాడేందుకు చంద్రబాబు ధైర్యం చేయకపోవడం గమనార్హం. పైగా కృష్ణా జలాల విషయంలో తానేదో పెదరాయుడి మాదిరి భావిస్తూ సలహాలు, తీర్పులు ఇస్తున్నారు.
తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే క్రమంలో ఆ ప్రాంత పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదాన్ని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు స్పందిస్తూ…కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.
ఒకవేళ ఆ పని వాళ్లిద్దరి వల్ల కాకపోతే అపెక్స్ కమిటీ వద్దకెళ్లి చర్చించొచ్చని మరో మార్గం చెప్పారు. సీఎంలిద్దరూ ఆ పని చేయకుండా సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిష్కరించుకునే అవకాశాలున్నప్పటికీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. అంతే తప్ప, తెలంగాణ వాదనలో బలం లేదని చెప్పడానికి బాబు ముందుకు రాకపోవడం విశేషం.
గతంలో తన హయాంలో 2015లో రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి చేసుకున్న నీటి కేటాయింపుల ప్రకారమే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందనే వాస్తవాన్ని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తు న్నారనే విమర్శలున్నాయి. కరవు పీడిత ప్రాంతానికి నీళ్లు అందకుండా అడ్డుకోవడం తగదని చెప్పడానికి చంద్రబాబుకు మనసు రావడం లేదు.
తెలంగాణ అంటే భయమా? లేక తనకు ఓట్లు వేయలేదని రాయలసీమ ప్రజలంటే కోపమా? అనే విషయమై చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా రాయలసీమకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న తెలంగాణ వైఖరిపై చంద్రబాబు మౌనం…. ఆంధ్రప్రదేశ్ సమాజానికి నష్టం కలిగిస్తోందనే వాదన రోజురోజుకూ బలపడుతోంది.