ఒకవైపు కేంద్రమంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ఒక కొలిక్కి వచ్చింది. దాదాపు రెండు సంవత్సరాలా రెండు నెలల ముందు ఏర్పాటు చేసిన మంత్రి వర్గానికి ప్రధాన మంత్రి మోడీ మార్పుచేర్పులు చేశారు. పలువురు సీనియర్లను నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. వైఫల్యాలను వారి ఖాతాల్లోకి కలిపేశారు. కొత్త వాళ్లను తీసుకున్నారు.
యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా చెప్పుకున్నా.. అది కేవలం రాజకీయ సమీకరణాల ఆధారంగానే అని స్పష్టం అయ్యింది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ అనేది సామార్థ్యాలకు, పనితీరుకూ కొలబద్ద కాదని.. కేవలం రాజకీయ అంశాల ఆధారంగానే మార్పుచేర్పులు జరిగాయని స్పష్టం అవుతూ ఉంది.
మోడీ సంగతలా ఉంటే.. మంత్రివర్గంలో చేయబోయేమ మార్పుల గురించి ముందే చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన తొలి కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే.. అందరికీ రెండున్నరేళ్ల పాటు మాత్రమే అవకాశం ఉంటుందని జగన్ ఖరాకండిగా చెప్పారప్పట్లో. రెండున్నరేళ్లేనా అని కొందరు అనుకుంటే, రెండున్నరేళ్ల వరకూ భరోసా అని కొందరు ఫీలయి ఉండవచ్చు. ఏకంగా 20 మందిని మార్చేస్తానంటూ కూడా అప్పట్లోనే జగన్ క్లారిటీ ఇచ్చారు.
అయితే మధ్యలో కరోనా కారణంగా మంత్రులకు కూడా పలు అవాంతరాలు ఏర్పడి ఉండవచ్చు. కానీ ఆ సమయాన్ని కూడా జగన్ లెక్కేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
కేంద్రమంత్రి వర్గ విస్తరణకూ ఏపీ మంత్రి వర్గ మార్పు చేర్పులకూ సంబంధం లేదు కానీ, పాలకులు కరోనా కాలాన్ని గ్రేస్ పిరియడ్ తీసుకునే అవకాశాలు ఉండవని స్పష్టం అవుతోంది. కేంద్రమంత్రి వర్గ మార్పు చేర్పులతో ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు జగన్ లో కూడా ఆలోచనలను పెంచి ఉండవచ్చు!
స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారం అయితే, ఇంకా నాలుగు నెలల సమయం ఉండనే ఉంది. అయితే ఈ పాటికే ముఖ్యమంత్రి ఒక అభిప్రాయానికి వచ్చారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది.
టీటీడీ బోర్డు ఏర్పాటుకు సంబంధించి నియామకాన్ని ఆపడంతోనే రాబోయే రాజకీయ మార్పు చేర్పులకు జగన్ స్పష్టమైన సంకేతాలను ఇచ్చారని స్పష్టం అవుతోంది. జరగబోయే మార్పు చేర్పులు సూఛాయగా స్పష్టం అవుతోందని.. ముందుగా ఉప ముఖ్యమంత్రులపైనే వేటు పడే అవకాశాలు ఎక్కువ అనే టాక్ వినిపిస్తూ ఉంది!
ఉపముఖ్యమంత్రుల హోదాల్లోని మంత్రుల్లో కొందరి పనీతిరుపై జగన్ అంత సానుకూలంగా లేరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. ఉపముఖ్యమంత్రుల స్థానంలో కొత్త వారు ఉప ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటున్నారు.
జగన్ తొలి కేబినెట్లో ఐదు మంది ఉపముఖ్యమంత్రులను నియమించుకున్నారు. అయితే వారు ఆశించిన స్థాయిలో పనితీరును చూపలేకపోయారని.. దీంతో కొత్త ఉప ముఖ్యమంత్రులు రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు ఉపముఖ్యమంత్రులు తమ సీటును కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
మరోవైపు ఆయా సామాజికవర్గాల, రాజకీయ సమీకరణాల ఆధారంగా మంత్రి పదవులను ఆశిస్తున్న వారు కూడా తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తోంది.